Share News

ఏమిటా ఉత్తర్వులు.. ముఖ్య కార్యదర్శిని జైలుకు పంపాలి

ABN , Publish Date - Mar 29 , 2024 | 06:16 AM

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లుగా లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్లను నియమించే నిమి త్తం జీవో ఇవ్వడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇలాంటి జీవో జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిని జైలుకు పంపించాలని ఘాటు

ఏమిటా ఉత్తర్వులు.. ముఖ్య కార్యదర్శిని జైలుకు పంపాలి

ప్రిన్సిపాళ్లుగా బోధనేతర సిబ్బందా!?

ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడం ఆత్మహత్యా సదృశమే

సిలబస్‌ గురించి లైబ్రేరియన్లు, పీడీలకు ఏం తెలుస్తుంది?

సర్వీసు ఉందని స్వీపర్‌ను కూడా ప్రిన్సిపాల్‌ చేస్తారేమో

అసమర్థులను నియమిస్తే విద్యా సంస్థల తలరాత ఏమిటి?

జీవోపై వివరణ ఇచ్చేందుకు 1న కోర్టు ముందు హాజరుకండి

పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శికి హైకోర్టు ఆదేశం

ప్రిన్సిపాళ్ల పదోన్నతిపై సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు సస్పెండ్‌

అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లుగా లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్లను నియమించే నిమి త్తం జీవో ఇవ్వడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇలాంటి జీవో జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిని జైలుకు పంపించాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి కల్పించేందుకు లైబ్రేరియన్లు, పీడీలకు సిలబస్‌, పాఠ్యాంశాలపై ఏం అవగాహన ఉంటుందని ప్రశ్నించింది. 20 ఏళ్లు మోటర్‌ సైకిల్‌ నడిపిన అనుభవం ఉందని విమానం నడిపేందుకు అనుమతిస్తారా అని నిలదీసింది. సర్వీసు ఉంది కదా అని వార్డు బాయ్‌ని సర్జన్‌గా, కళాశాలలోని స్వీపర్‌కు ప్రిన్సిపాల్‌గా పదోన్నతి కల్పించండంటూ మండిపడింది. బోధనేతర సిబ్బందిని కళాశాల ప్రిన్సిపాళ్లుగా నియమిస్తే సిలబస్‌ గురించి వారికేం అవగాహన ఉంటుందని ప్రశ్నించింది. జీవో 76 జారీ చేయడం ఆత్మహత్యా సదృశ్యమేనని, అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీసింది. ఇలాంటి జీవోలను పౌర సమాజం హర్షించదని పేర్కొంది. ఈ ఉత్తర్వుల కారణంగా ఉత్పన్నమయ్యే పరిణామాల గురించి ఒకసారి ఆలోచించాలని సూచించింది. అసమర్థులను విద్యాసంస్థలకు అధిపతులుగా నియమిస్తే వాటి తలరాత ఏమిటని ప్రశ్నించింది. విద్యా ప్రమాణాలకు విఘాతం కలిగించేలా ప్రభుత్వ జీవో ఉందని ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఇలాంటి చర్యలను అనుమతిస్తే విద్యావ్యవస్థ విధ్వంసానికి దారితీస్తుందని స్పష్టం చేసింది. విద్యావ్యవస్థ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని కాకుండా ఇతర కారణాలతో జీవో తెచ్చినట్లు కనపడుతోందని వ్యాఖ్యానించింది. 2021 డిసెంబరు 8న జారీ చేసిన జీవో 76లోని అంశాలు, చట్టనిబంధనలపై అధ్యయనం చేసి కోర్టు ముందు హాజరుకావాలని పాఠశాల ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. జూనియర్‌ కాలేజీల్లో 197మంది జూనియర్‌ లెక్చరర్లకు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ని సస్పెండ్‌ చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం సస్పెండ్‌ చేసింది. విచారణ ఏప్రిల్‌ 1కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ జి. నరేందర్‌, జస్టిస్‌ ఎన్‌. హరినాథ్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ఇంటర్మీడియెట్‌ జూనియర్‌ కాలేజీల్లో జూనియర్‌ లెక్చరర్లకు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి కల్పించే వ్యవహారంలో 2021లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 76, ఏపీ స్టేట్‌ అండ్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌ను పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఏపీ గవర్నమెంట్‌ జూనియర్‌ లెక్చరర్స్‌ ఇన్‌ లైబ్రరీ సైన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.సంజీవరావు, మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి... 197 మంది జూనియర్‌ లెక్చరర్లకు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ని సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ కె.శ్యామ్‌కుమార్‌ ధర్మాసనం ముందు అప్పీల్‌ వేశారు. ఈ అప్పీల్‌ గురువారం విచారణకు రాగా అప్పిలెంట్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి వాదనలు వినిపించారు. సింగిల్‌ జడ్జి వద్ద పిటిషనర్‌ తమను ఉద్దేశపూర్వకంగా ప్రతివాదిగా చేర్చలేదని, సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను ఉత్తర్వులను సస్పెండ్‌ చేయాలని కోరారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది ఠాగూర్‌ యాదవ్‌ వాదనలు వినిపిస్తూ... ఇంటర్మీడియట్‌ కమిషనర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ జీవోకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. లైబ్రరీ సైన్స్‌ లెక్చరర్లను పదోన్నతిలో పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు. ప్రిన్సిపాల్‌ కేవలం పరిపాలనా వ్యవహారాలు మాత్రమే చూస్తారని, ఈ నేపథ్యంలో నాన్‌టీచింగ్‌ స్టాప్‌ను ప్రిన్సిపాళ్లుగా నియమించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌కు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి కల్పించే విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 76ను ధర్మాసనం లోతుగా పరిశీలించింది. లైబ్రేరియన్లు, పీడీలు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి పొందేందుకు అర్హులుగా పేర్కొనడంపై విస్మయం వ్యక్తం చేసింది. జీవోను ఇప్పటివరకు ఎందుకు సవాల్‌ చేయలేదని అప్పిలెంట్‌ తరఫు సీనియర్‌ న్యాయవాదిని ప్రశ్నించింది. నాన్‌టీచింగ్‌ స్టాఫ్‌ను ప్రిన్సిపాళ్లుగా నియమిస్తే విద్యావ్యవస్థకు నష్టం జరగదా, దీనివల్ల ఉత్పన్నమయ్యే ప్రతికూల పరిణామాల గురించి ఆలోచించారా అని జీపీని ప్రశ్నించింది. ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యశాఖ ముఖ్యకార్యదర్శిని జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి హాజరుకు ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.

Updated Date - Mar 29 , 2024 | 06:16 AM