Share News

పెళ్లింట పెను విషాదం

ABN , Publish Date - Mar 29 , 2024 | 06:19 AM

కుమార్తె పెళ్లి చేసి తిరిగివస్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఆమె తల్లి సహా ఒకే కుటుంబంలోని ముగ్గురు మృత్యువాత పడ్డారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం సమీపంలో 16వ నంబర్‌ జాతీయ రహదారిపై గురువారం అతివేగం,

పెళ్లింట పెను విషాదం

రోడ్డు ప్రమాదంలో వధువు తల్లి సహా ముగ్గురు మహిళలు మృతి

మరో ముగ్గురికి తీవ్రగాయాలు

వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ఘోరం

డివైడర్‌ దాటి వెళ్లి సిమెంట్‌ దిమ్మెను ఢీకొన్న కారు

అతివేగం, నిద్రమత్తే కారణం

ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెం వద్ద ఘటన

టంగుటూరు/కందుకూరు, మార్చి 28: కుమార్తె పెళ్లి చేసి తిరిగివస్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఆమె తల్లి సహా ఒకే కుటుంబంలోని ముగ్గురు మృత్యువాత పడ్డారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం సమీపంలో 16వ నంబర్‌ జాతీయ రహదారిపై గురువారం అతివేగం, నిద్రమత్తు కారణంగా జరిగిన ప్రమాదం ముగ్గురు ప్రాణాలు తీసింది. మరో ముగ్గురిని ఆస్పత్రి పాలుచేసింది. నెల్లూరు జిల్లా కందుకూరులోని గుర్రంవారిపాలెంకు చెందిన రాయని స్రవంతికి తెలంగాణ రాష్ట్రం పాల్వంచలో బుధవారం రాత్రి వివాహమైంది. ఈ శుభకార్యానికి స్రవంతి కుటుంబ సభ్యులు, బంధువులు బుధవారం ఉదయం వాహనాల్లో బయల్దేరి వెళ్లారు. వివాహం అనంతరం అర్ధరాత్రి 12 గంటల తర్వాత వారు తిరుగు ప్రయాణమయ్యారు. వధువు తల్లి అరుణ (50), సోదరుడు వేణు, చిన్నమ్మ కుమార్తె గుళ్లాపల్లి శ్రావణి (22), మేనమామ తల్లపనేని వినోద్‌, ఆయన భార్య దివ్య (28) వారి మూడేళ్ల కుమారుడు అభిరామ్‌ ఒక కారులో బయల్దేరారు. టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం సమీపంలోని ఫ్లైఓవర్‌ దిగువన గురువారం ఉదయం వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రెండో వైపు మార్గంలోకి వెళ్లి మార్జిన్‌లో ఉన్న సిమెంటు దిమ్మెను ఢీకొట్టింది. దీంతో వెనుక సీట్లో కూర్చున్న అరుణ, శ్రావణి, దివ్య అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడుపుతున్న వినోద్‌, ఆయన కుమారుడు అభిరామ్‌, ముందు సీట్లో కూర్చొన్న వేణుకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఎస్సై నాగేశ్వరరావు, హైవే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు నుంచి మృతులను, క్షతగాత్రులను బయటకు తీశారు. గాయపడిన వారిని 108 వాహనంలో రిమ్స్‌కు పంపారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. వీరిలో వినోద్‌, ఆయన కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. వెనుకనే వస్తున్న పెళ్లి బస్సులో ఉన్న వధూవరులు, బంధువులు, ఇతర వాహనాల్లో ఉన్న మరికొందరు ప్రమాద స్థలం వద్ద దిగి కన్నీరు మున్నీరయ్యారు. అతివేగం, నిద్రమత్తు ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాద సమయంలో కారు 120 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. కారు వేగం ధాటికి సిమెంటు పోల్‌ సైతం విరిగిపోయింది. ఒంగోలు ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం గురువారం రాత్రి మృతదేహాలను కందుకూరుకు తీసుకు రాగా బంధువుల రోదనలు మిన్నంటాయి.

రెండు బైకులు ఢీకొని ముగ్గురి మృతి

రామభద్రపురం, మార్చి 28: విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొట్టక్కి వద్ద జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఎస్‌ఐ జ్ఞానప్రసాద్‌ కథనం మేరకు.. రామభద్రపురం మండలం జన్నివలస గ్రామానికి చెందిన జొన్నాడ పురుషోత్తం (25), జి.రాంప్రసాద్‌, జి.గణేష్‌ గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో సాలూరు నుంచి బైక్‌పై స్వగ్రామానికి వస్తున్నారు. సాలూరు గొల్లవీధికి చెందిన జి.శ్రీను (45), యశోద కృష్ణ (47) రామభద్రపురం వైపు నుంచి ద్విచక్రవాహనంపై సాలూరు వెళ్తున్నారు. ఈ క్రమంలో కొట్టక్కి వద్ద జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలూ ఢీకొన్నాయి. పురుషోత్తం తలకు తీవ్రగాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. శ్రీను, యశోద కృష్ణ సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గణేష్‌, రాంప్రసాద్‌ తీవ్ర గాయాలతో విజయనగరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటన స్థలాన్ని బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు, రూరల్‌ సీఐ తిరుమలరావు పరిశీలించారు.

Updated Date - Mar 29 , 2024 | 06:19 AM