Share News

ఆ చట్టం రైతుకు ఉరితాడే

ABN , Publish Date - May 04 , 2024 | 03:45 AM

జగన్‌ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంతో రైతులకు ఎలాంటి రక్షణ ఉండదని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.

ఆ చట్టం రైతుకు ఉరితాడే

మేమొచ్చాక రద్దు.. రెండో సంతకం దానిపైనే: చంద్రబాబు

ఈ జగన్‌ ఫొటోల పిచ్చోడు.. జనం ముఖాలపైనా తన బొమ్మ వేయాలంటాడేమో

ఇళ్లకెళ్లి పింఛన్‌ ఎందుకివ్వరు?.. బ్యాంకుల చుట్టూ తిప్పుతూ ఇబ్బంది పెడుతున్నారు

వృద్ధుల మరణాలు ప్రభుత్వ హత్యలే.. సైకో, డ్రామాల సీఎంను సాగనంపాలి

మా గెలుపు అన్‌స్టాపబుల్‌.. వార్‌ వన్‌సైడే.. బందిపోటు అంతానికి జనం సిద్ధం: బాబు

ఒంగోలు/నెల్లూరు, మే 3 (ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంతో రైతులకు ఎలాంటి రక్షణ ఉండదని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. దాని ద్వారాఈ సీఎం ప్రజల భూమిని ఇతరులకు తాకట్టు పెడతాడని.. అమ్మేస్తాడని ధ్వజమెత్తారు. ఈ చట్టం రైతుల మెడకు ఉరితాడు వంటిదని.. తక్షణం దానిని రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే రద్దుచేస్తామన్నారు. తొలి సంతకం మెగా డీఎస్సీపైన, రెండో సంతకం టైటిలింగ్‌ చట్టం రద్దుపైనే పెడతానని స్పష్టం చేశారు. ప్రజాగళంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం పొదిలిలో, జనసేనాని పవన్‌ కల్యాణ్‌తో కలిసి రాత్రికి నెల్లూరులో నిర్వహించిన జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ‘మనకు అమ్మానాన్నలు ఇచ్చిన ఆస్తుల మీద, మనం కష్టపడి సంపాదించుకున్న ఆస్తుల మీద ఈ జగన్‌ బొమ్మ వేసుకోవడం దేనికి సంకేతమో ప్రజలు ఆలోచించాలి. భవిష్యత్‌లో మన భూములు మనం అమ్ముకోవాలన్నా, కొనాలన్నా జగన్‌ అనుమతి తీసుకోవలసిన పరిస్థితి వస్తుంది. ఆ విధంగా జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టం తయారు చేశాడు. భవిష్యత్‌లో 10(1), అడంగల్‌, పాసు పుస్తకాలు ఏమీ ఉండవు. వీటిని కొనాలన్నా, అమ్మాలన్నా జగన్‌ అనుమతి కావాలి’ అని తెలిపారు. ఈ ఫొటోల పిచ్చోడు చివరకు జనం ముఖాలపై కూడా తన బొమ్మ వేయాలంటాడేమోనని ఎద్దేవా చేశారు. ప్రజలకు వారసత్వంగా వచ్చిన భూముల పాసు పుస్తకాలు, సర్వే రాళ్లపైనా ఈయన బొమ్మలు ఎందుకు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక పెన్షన్లు తీసుకునే వృద్ధులు మండుటెండల్లో అల్లాడుతుండడంపై ఆవేదన వ్యక్తంచేశారు. సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్లకు వెళ్లి పింఛన్లు ఇచ్చే అవకాశం ఉన్నా ఈ సీఎస్‌, జగన్‌ ప్రభుత్వం అలా చేయడంలేదన్నారు. సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ తిప్పుతూ వారిని అవస్థలు పెడుతున్నారన్నారని ఆక్షేపించారు. అనేకమంది వృద్ధులు ఎండల్లో తిరగలేక చనిపోతున్నారని, అవన్నీ ప్రభుత్వ హత్యేలేనని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతినెలా 1వ తేదీన ఇళ్లవద్దే రూ.4వేల పింఛన్‌ అందజేస్తామన్నారు. ఇంకా ఏమన్నారంటే..


కూటమి గెలుపును ఆపలేరు..

జగన్‌ పాలనలో భూములు, ఇసుక, మద్యం, ఖనిజ దోపిడీ అంతులేకుండా సాగింది. ఒంగోలు ఎంపీగా ప్రజాసేవలో 40 ఏళ్లుగా ఉన్న మాగుంట కుటుంబాన్ని కాదని ఎర్రచందనం స్మగ్లర్‌ చెవిరెడ్డిని తెచ్చిపెట్టారు. ఈ సీఎం అహంకారి, విధ్వంసకారుడు, ఇతరులను వేధించి వారు బాధపడుతుంటే ఆనందించే సైకో. రాష్ట్రం బాగుపడాలంటే ఈయన ఈ రాష్ట్రం నుంచి పారిపోయేలా తీర్పు ఇవ్వాలి. పోలింగ్‌ బూత్‌లు దద్దరిల్లేలా ఓట్లు వేసి టీడీపీ కూటమిని గెలిపించాలి. 13వ తేదీతో రాష్ట్ర ప్రజలు రాక్షస పాలనను అంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 25కు 25 పార్లమెంట్‌, 160కి పైగా ఎమ్మెల్యే సీట్లను ఎన్డీయే గెలుచుకుంటుంది. ప్రధాని మోదీ కూడా ఆంధ్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు ద్వారా తెలుగుజాతి భవిష్యత్‌కు మద్దతు పలకాలి. ఎన్డీయే అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తో మేలు జరుగుతుంది. జగన్‌ ప్రభుత్వం ఉద్యోగులకు అన్యాయం చేసింది. సీపీఎస్‌ రద్దు చేస్తామని ప్రకటించి చేయలేదు, జీతాలు సక్రమంగా ఇవ్వలేదు. దీనికి గుణపాఠం చెప్పే అవకాశం వచ్చింది. శనివారం నుంచే పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రారంభమవుతోంది. నెల్లూరు గడ్డ మీద నుంచి ఉద్యోగులను అభ్యర్థిస్తున్నాను. 95శాతం.. వీలుంటే 100శాతం టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను గెలిపించండి. ముస్లింల సంక్షేమానికి నాదీ పూచీ. వారికి 4ురిజర్వేషన్లు కాపాడతాం. మక్కాకు వెళ్లే వారికి లక్ష ఆర్థికసాయం అందిస్తాం. దుల్హన్‌, రంజాన్‌ తోఫాలు పునరుద్ధరిస్తాం. ఇమాంలకు గౌరవ వేతనం, మసీదుల నిర్వహణకు ఆర్థిక సాయం అందజేస్తాం.


మెరుగైన సంక్షేమం..

జగన్‌ రూ.10 ఇచ్చి వంద రూపాయలు లాగేసుకున్నాడు. వెయ్యి రూపాయలు దోచేసుకున్నాడు. రూ.13 లక్షల కోట్ల అప్పుల పాల్జేశాడు. మేం వచ్చాక రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూనే ఇప్పటికన్నా మంచి సంక్షేమాన్ని అందిస్తాం. ఆడబిడ్డ నిధి కింద 18ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 చొప్పున ఐదేళ్ల కాలానికి రూ.90 వేలిస్తాం. ఎంతమంది బిడ్డలుంటే అంత మందికి ఒక్కొక్కరికి 15వేల చొప్పున చదువుకోవడానికి ఇస్తాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం. యువతా మీ ఉద్యోగాల బాధ్యత మాది. రైతును రాజును చేస్తాం. చంద్రన్న బీమా సహజ మరణానికి రూ.5లక్షలు, ప్రమాదంలో చనిపోతే రూ.10లక్షలు ఇస్తాం. ఆరోగ్య బీమా 25లక్షలకు పెంచుతాం. బీసీ డిక్లరేషన్‌ ఇస్తాం.. వారికి ఐదేళ్లలో లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తాం. కాపు సంక్షేమానికి రూ.15 వేల కోట్లు, ప్రతి డ్రైవర్‌కు ఏడాదికి రూ.15 వేలు ఇస్తాం. వైసీపీ రహిత రాష్ట్రం కావాలన్నదే పవన్‌ కల్యాణ్‌ ధ్యేయం. జగన్‌ వ్యతిరేక ఓటు చీలకూడదనే కూటమి కట్టడానికి ముందుకొచ్చారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం, రాష్ట్ర ప్రజల కోసం అందరం కూటమిగా ఏర్పడ్దాం. పవన్‌ సూచన మేరకు యువతలో ఉన్న స్కిల్స్‌పై సెన్సస్‌ తీస్తాం. ఎవరిలో ఏ స్కిల్‌ ఉందో దాని ఆధారంగా ఉద్యోగావకాశాలు కల్పించే ప్రయ త్నం చేస్తాం. నెల్లూరు, తిరుపతి, చెన్నైలను కలుపుతూ ట్రై సిటీగా అభివృద్ధి చేసి సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ హబ్‌గా తయారు చేస్తాం.


సానుభూతి కోసం డ్రామాలాడడం జగన్‌కు అలవాటే. 2014లో తండ్రి మృతితో, 2019లో బాబాయిని హత్య చేసి సానుభూతి పొంది ఓట్లు దండుకున్నాడు. ఇప్పుడు కనిపంచని గులకరాయి డ్రామాలాడారు. నాటకాల జగన్‌ కావాలో.. మీ సమస్యలు పరిష్కరించే నాయకుడు కావాలో ప్రజలు ఆలోచించాలి.

రాష్ట్రంలో ఎన్నికలు వన్‌సైడే. ఎన్డీయే గెలుపు అన్‌స్టాపబుల్‌. వైసీపీ డబ్బులతో, కుట్రలతో రాజకీయాలు చేయాలనుకుంటోంది. వందలు, వేల కోట్లు ఖర్చు పెట్టినా ప్రజలు ఆ పార్టీకి ఓట్లు వేయరు.

ఇవి ఆంధ్ర భవిష్యత్‌ కోసం జరుగుతున్న ఎన్నికలు. ఒక బందిపోటుకు, ఐదుకోట్ల మంది ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.

- చంద్రబాబు

Updated Date - May 04 , 2024 | 03:45 AM