Share News

టీడీపీవోళ్లు కనిపిస్తే నరికేస్తా!

ABN , Publish Date - Apr 29 , 2024 | 04:10 AM

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి అలియాస్‌ రాజారెడ్డి అరాచకాలు, దౌర్జన్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.

టీడీపీవోళ్లు కనిపిస్తే నరికేస్తా!

రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి సోదరుడి అరాచకం

అర్ధరాత్రి టీడీపీ వర్గీయుల ఇళ్లలోకి చొరబడి దాడులు.. బెదిరింపులు

అధికార పార్టీలో చేరాలని ఒత్తిళ్లు లేదంటే ఊరు విడిచి వెళ్లాలని హుకుం

అనంతపురం, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి అలియాస్‌ రాజారెడ్డి అరాచకాలు, దౌర్జన్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఆత్మకూరు మండలంలోని ఎమ్మెల్యే స్వగ్రామం తోపుదుర్తిలో రాజారెడ్డి శనివారం అర్ధరాత్రి అరాచకానికి పాల్పడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా వారి ఇళ్లలోకి చొరబడి దాడులు చేశారు. గ్రామంలోని టీడీపీ దళిత నేత వన్నూరప్ప ఇంట్లోకి రాజారెడ్డి అనుచరులు చొరబడి.. వైసీపీలో చేరాలని, లేకపోతే చంపేస్తామని హెచ్చరించారు. వన్నూరప్ప నిరాకరించడంతో దాడికి దిగారు. పిడిగుద్దులు గుద్దుతూ ఎమ్మెల్యే ఇంటివద్దకు తీసుకెళ్లారు. ‘‘ఉంటే వైసీపీలో ఉండు.. లేదంటే మరో 13 రోజుల్లో నిన్న చంపుతాం’’ అని బెదిరించారు. ఆ తర్వాత టీడీపీ బీసీ నేత బోయ లింగమయ్య ఇంటికి వెళ్లి ‘‘అన్న పిలుస్తున్నాడు.. రా..’’ అని హుకుం జారీ చేశారు. అయితే, తాను రానని లింగమయ్య స్పష్టం చేయడంతో విషయం రాజారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆవేశంతో ఊగిపోతూ వచ్చిన రాజారెడ్డి.. లింగమయ్య ఇంట్లోకి చొరబడి.. ‘‘ఉంటే వైసీపీలో ఉండాలి. లేదంటే ఊరు విడిచిపెట్టి వెళ్లాలి. పార్టీలో చేరకపోతే నరికిపారేస్తాం’’ అని బెదిరించారు. ఇదే సమయంలో మద్యం మత్తులో ఉన్న పలువురు వైసీపీ కార్యకర్తలు ఆ ఇంటిని చుట్టుముట్టారు. లింగమయ్య కుటుంబ సభ్యులు వారిని ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి ఎమ్మెల్యే సోదరుడి ఆరాచకంతో గ్రామస్థులు బెంబేలెత్తిపోయారు. దౌర్జన్యకాండ జరుగుతున్నంతసేపు ఇళ్ల నుంచి గ్రామస్థులు బయటకు రాలేదు. ఎమ్మెల్యే సోదరుడు బెదిరింపులకు తెగబడుతున్నా పోలీసుల నుంచి ఎలాంటి స్పందనా కనిపించలేదు. పోలీసులకు సమాచారం ఇచ్చినా నింపాదిగా ఆదివారం ఉదయం ఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు ఆ గ్రామానికి వచ్చి.. తిరిగి వెళ్లిపోయారు. గ్రామంలో పోలీసు పికెట్‌ ఉన్నా స్పందించలేదు.

వారి నుంచి ప్రాణహాని: వన్నూరప్ప

రాప్తాడు ఎమ్మెల్యే సోదరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని టీడీపీ దళిత నేత వన్నూరప్ప ఆందోళన వ్యక్తం చేశారు. రాజారెడ్డి అనుచరులు అర్ధరాత్రి తమ ఇంట్లోకి చొరబడి దాడి చేశారని, తనను బలవంతంగా ఎమ్మెల్యే ఇంటివద్దకు తీసుకెళ్లారని, ఉమారెడ్డి అనేవ్యక్తి మద్యం మత్తులో దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా కొడకా చంపుతాం.. టీడీపీ నా కొడుకులు ఊళ్లో కనబడకూడదు. పరిటాల వాళ్లు ఎలా వస్తారు?’ అని రాజారెడ్డి బెదిరించారని అన్నారు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు విన్నవించారు.

Updated Date - Apr 29 , 2024 | 07:51 AM