Share News

జగన్‌ సార్‌.. మానవత్వం ఏమైంది?

ABN , Publish Date - Apr 29 , 2024 | 04:23 AM

పోలీసులకు ఒక్క రోజైనా సెలవు లేకపోతే ఎలా? 365 రోజులూ విధి నిర్వహణలోనే ఉంటే కుటుంబంతో గడిపేది ఎప్పుడు? కొంచెమైనా మానవత్వంతో ఆలోచించకపోతే ఎలా? మనందరి ప్రభుత్వం రాగానే వారంలో ఒక్కరోజు పోలీసులకు కచ్చితంగా సెలవు ఇచ్చి తీరుతాం

జగన్‌ సార్‌.. మానవత్వం ఏమైంది?

వీక్లీ ఆఫ్‌లు ఇస్తామని ప్రతిపక్షంలో హామీ

అధికారంలోకి వచ్చాక ఖాకీలకు మస్కా

జగన్‌ సర్కారు తీరుపై పోలీసులు రుసరుస

అమరావతి, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): ‘పోలీసులకు ఒక్క రోజైనా సెలవు లేకపోతే ఎలా? 365 రోజులూ విధి నిర్వహణలోనే ఉంటే కుటుంబంతో గడిపేది ఎప్పుడు? కొంచెమైనా మానవత్వంతో ఆలోచించకపోతే ఎలా? మనందరి ప్రభుత్వం రాగానే వారంలో ఒక్కరోజు పోలీసులకు కచ్చితంగా సెలవు ఇచ్చి తీరుతాం’ అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఖాకీలకే మస్కా కొట్టారు. వారంలో ఒక రోజు కానిస్టేబుల్‌ నుంచి సీఐ వరకూ సెలవు లభించేలా రాష్ట్ర పోలీసు శాఖ కమిటీ సిఫారసులను జిల్లాల ఎస్పీలకు 2019 చివర్లో పంపింది. రెండు, మూడు జిల్లాల్లో ఎస్పీలు అమలు చేయగానే పోలీసు అధికారుల సంఘం నుంచి సత్కారాలు, భజనలు చేయించుకున్న జగన్‌ 2020 మార్చి నుంచి తూచ్‌ అనేశారు. కరోనా లాక్‌డౌన్‌ ప్రభావంతో ఆ రెండు, మూడు జిల్లాల్లోనూ రద్దు చేయగా మిగిలిన ప్రాంతాల్లో అమలే కాలేదు. అసలు నిజం ఇది అయితే.. తాజా మేనిఫెస్టోలో పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు ఇచ్చామంటూ అబద్ధాలు అచ్చేశారు. జగన్‌ అబద్దాలు చెప్పడం పట్ల ఖాకీలు కారాలు, మిరియాలు నూరుతున్నారు. కొంచెమైనా మానవత్వం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Apr 29 , 2024 | 08:40 AM