Share News

పొన్నవోలుకు పదవి క్విడ్‌ ప్రో కో!

ABN , Publish Date - Apr 29 , 2024 | 04:28 AM

పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి ‘క్విడ్‌ ప్రో కో’లో భాగంగానే అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ)పదవి ఇచ్చారని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు, సీఎం జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

పొన్నవోలుకు పదవి క్విడ్‌ ప్రో కో!

చార్జిషీట్లలో తండ్రి పేరు చేర్చినందుకు జగన్‌ మేలు.. చేర్పించింది కాంగ్రెస్‌ కాదు జగనే

వైఎస్‌ పేరు లేకుంటే బయటికి రావడం అసాధ్యమనే.. జగన్‌పై షర్మిల సంచలన ఆరోపణలు

విశాఖపట్నం/అమరావతి, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి ‘క్విడ్‌ ప్రో కో’లో భాగంగానే అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ)పదవి ఇచ్చారని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు, సీఎం జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ చార్జిషీటులో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పేరు చేర్చడానికి పొన్నవోలు వేసిన పిటిషన్లే కారణమని... జగన్‌ ఆదేశాల మేరకే ఆయన ఇలాచేశారని ఆరోపించారు. ఆదివారం ఉదయం విశాఖలోని స్టీల్‌ప్లాంటు సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షర్మిల మాట్లాడారు. వైఎస్‌ పేరును కాంగ్రెస్‌ పార్టీ సీబీఐ చార్జిషీటులో చేర్చిందని పులివెందుల సభలో జగన్‌ ఆరోపించినందుకే... తాను ఈ విషయాలు చెప్పాల్సి వస్తోందన్నారు. ‘‘జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరు చేర్చడానికి పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వేసిన పిటిషన్లే కారణం. సీబీఐ తొలుత రాజశేఖర్‌రెడ్డి పేరు చేర్చలేదు. పొన్నవోలు చేర్పించేలా చేశారు. వైఎస్‌ పేరు సీబీఐ చార్జిషీట్‌లో లేకపోతే.. జగన్‌ జైలు నుంచి బయటకు రావడం అసాధ్యమని భావించారు. ట్రయల్‌ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. జగన్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరేడు రోజుల్లోనే పొన్నవోలు సుధాకర్‌ రెడ్డిని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ)గా నియమించారు. వీరిద్దరి మధ్య ఏ సంబంధమూ లేకపోతే అంత హడావుడిగా, తొందరగా ఎందుకు మేలు చేసినట్లు?’’ అని షర్మిల ప్రశ్నించారు. ‘‘చార్జిషీట్‌లో తండ్రి పేరును చేర్చేలా చేసిన వ్యక్తికి ఎవరైనా పదవి ఇస్తారా? నేనైతే ఇవ్వను. క్విడ్‌ ప్రోకోలో భాగంగానే పొన్నవోలుకు జగన్‌ పదవి ఇచ్చారు’’ అని తెలిపారు. వైఎస్‌ అంటే తనకు గౌరవమని పొన్నవోలు అబద్ధాలు చెప్పారని... నిజంగా గౌరవముంటే చార్జిషీటులో వైఎస్‌ పేరు చేర్చాలని అన్ని కోర్టుల చుట్టూ తిరుగుతారా అని షర్మిల నిలదీశారు. తనను పొన్నవోలు సంస్కారం లేకుండా ఏకవచనంతో సంబోధిస్తూ... ఊగిపోతూ మాట్లాడారని ఆక్షేపించారు. తద్వారా జగన్‌ భక్తి, స్వామిభక్తి చాటుకున్నారన్నారు. తానెవరో జగన్‌కు తెలియదని పొన్నవోలు చెబుతున్నారని.. ముక్కూ ముఖం తెలియని వ్యక్తిని.. పైగా తండ్రిని దోషిగా చేస్తూ సీబీఐ చార్జిషీటులో పేరు చేర్చాలన్న వ్యక్తిని ఏఏజీగా అందలమెక్కిస్తారా అని ప్రశ్నించారు.

Updated Date - Apr 29 , 2024 | 04:28 AM