Share News

బ్యాంకు ఖాతాల్లోకే పింఛను

ABN , Publish Date - Apr 29 , 2024 | 04:28 AM

వలంటీర్లు లేకుంటే పింఛన్లు అందవు అన్నట్లుగా అవ్వా తాతలను ఇబ్బంది పెట్టిన జగన్‌ సర్కారు ఈసారి ‘పద్ధతి’ మార్చింది.

బ్యాంకు ఖాతాల్లోకే పింఛను

ఆధార్‌తో మ్యాప్‌ అయినవారికి నగదు బదిలీ.. బ్యాంకు ఖాతాలు లేకపోతే ఇంటి దగ్గరే

సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ.. పంచాయతీరాజ్‌ మార్గదర్శకాలు జారీ

అమరావతి, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): వలంటీర్లు లేకుంటే పింఛన్లు అందవు అన్నట్లుగా అవ్వా తాతలను ఇబ్బంది పెట్టిన జగన్‌ సర్కారు ఈసారి ‘పద్ధతి’ మార్చింది. పింఛన్ల పంపిణీ సజావుగా సాగాలన్న ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు... ఆదివారం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. మే, జూన్‌ నెలలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందీ లేకుండా పెన్షన్‌ పంపిణీకి చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం.. బ్యాంకు ఖాతాలు ఉన్న వారికి నగదు బదిలీ ద్వారా నేరుగా ఖాతాల్లోకి సొమ్ము జమ చేస్తారు. బ్యాంక్‌ అకౌంట్‌ ఆధార్‌తో మ్యాప్‌ అయిన లబ్ధిదారులందరికీ ఇది వర్తిస్తుంది. బ్యాంకు ఖాతాలు లేని వారు, దివ్యాంగులు, వయోవృద్ధులు, నడవలేక వీల్‌చైర్లకు పరిమితమైన వారికి... సచివాలయ ఉద్యోగులు ఇంటికే వెళ్లి పెన్షన్‌ పంపిణీ చేస్తారు. మే, జూన్‌ నెలల్లో పెన్షన్ల కోసం ఎవరూ సచివాలయాల వద్ద పడిగాపులు కాయకుండా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని శశిభూషణ్‌ ఆదేశించారు. నగదు బదిలీ జరిగే లబ్ధిదారుల పేర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసే సిబ్బంది మొబైల్‌ యాప్‌లలో కనిపించవన్నారు. నగదు బదిలీ ద్వారా పెన్షన్‌ పంపిణీ చేసే వారి వివరాలు గ్రామ, వార్డ్‌ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు మే 1 తేదీన పంపిణీ ప్రారంభించి 5వ తేదీ లోగా పూర్తి

చేయాలని సూచించారు.

Updated Date - Apr 29 , 2024 | 04:28 AM