Share News

సాగుకు సున్నం.. రయితుకు దుఃఖం !

ABN , Publish Date - Apr 29 , 2024 | 04:27 AM

వ్యవసాయాన్ని పండగ చేస్తామన్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు ప్రతి దశలో తోడుగా ఉంటామన్నారు. ఆర్బీకేల ద్వారా రైతు ఇంటికే సేవలు అందిస్తామని చెప్పారు. కౌలు రైతులతో సహా ప్రతి రైతు కుటుంబానికీ పెట్టుబడి సాయమందిస్తామని నమ్మబలికారు. పంట నష్టానికి ఇన్‌పుట్‌ సబ్సిడీ, మద్దతు ధర, గ్రామ స్థాయిలో శీతలీకరణ గిడ్డంగులు, సహకార డెయిరీల పునరుద్ధరణ, ఉచిత బోర్లు.. ఇంకా ఎన్నెన్నో చెప్పారు

సాగుకు సున్నం..  రయితుకు దుఃఖం !

వ్యవ‘సాయం’ విస్మరించిన జగన్‌

ఎన్నికల ముందు ఎన్నో హామీలు.. అధికారంలోకి వచ్చాక అరకొర సాయం

రైతు భరోసాపై నాలుక మడత.. ఏటా 13,500 ఇస్తామని 7,500లే

కేంద్ర సాయం 6 వేలూ ఆ ఖాతాలోకే.. రాయితీ పథకాలకు అంటకత్తెర

పెరిగిన పెట్టుబడి.. దక్కని ‘మద్దతు’.. దిగుబడులపై విపత్తుల దెబ్బ

పంట నష్టపరిహారం అంతంతే.. రుణభారంతో రైతన్నల బలవన్మరణాలు

ఏటా తగ్గుతున్న సాగు విస్తీర్ణం.. మాటలకే ‘రైతు పక్షపాత’ ప్రభుత్వం

వ్యవసాయాన్ని పండగ చేస్తామన్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు ప్రతి దశలో తోడుగా ఉంటామన్నారు. ఆర్బీకేల ద్వారా రైతు ఇంటికే సేవలు అందిస్తామని చెప్పారు. కౌలు రైతులతో సహా ప్రతి రైతు కుటుంబానికీ పెట్టుబడి సాయమందిస్తామని నమ్మబలికారు. పంట నష్టానికి ఇన్‌పుట్‌ సబ్సిడీ, మద్దతు ధర, గ్రామ స్థాయిలో శీతలీకరణ గిడ్డంగులు, సహకార డెయిరీల పునరుద్ధరణ, ఉచిత బోర్లు.. ఇంకా ఎన్నెన్నో చెప్పారు. జగన్‌ పాదయాత్రలోనూ, 2019 ఎన్నికల మేనిఫెస్టోలోనూ రైతులకు హామీలు కురిపించారు. అధికారంలోకి వచ్చాక రైతన్నలను నట్టేట ముంచారు. మద్దతు ధర లేదు. ఉచిత బోర్లు లేవు. పంట నష్టపోయిన రైతులకు తగిన పరిహారం చెల్లించలేదు. రాయితీ పథకాలకు కత్తెర వేశారు. ఏ హామీని కూడా పూర్తిగా నిలబెట్టుకోలేదు. అరకొర సాయం అందిస్తూ గొప్పలు చెప్పుకోవడమే కానీ రైతన్నలను ఆదుకోవడం లేదు. జగన్‌ సర్కారు నిర్వాకంతో వ్యవసాయ రంగం కుదేలైంది. పెట్టుబడులు పెరిగాయి. అతివృష్టి, అనావృష్టితో రైతులు దెబ్బతిన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కాక ఎందరో రైతులు సాగుకు స్వస్తి చెప్తున్న పరిస్థితి. గత నాలుగేళ్లుగా ఏటా 10-15 లక్షల ఎకరాల సాగు తగ్గుతూ రాగా, ఈ ఏడాది తీవ్ర వర్షాభావం, తుఫాన్‌ దెబ్బకు ఏకంగా 40 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. అయితే రైతుల కోసం ఐదేళ్లలో రూ.లక్షా 85 వేల కోట్లు ఖర్చు చేశామని గొప్పలు చెబుతున్నారు.

ఇదీ జగన్‌ మాట

‘చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెప్పి పూర్తిగా చేయకుండా ఎగ్గొట్టారు. టీడీపీ ప్రభుత్వానికి, వైసీపీ సర్కారుకు తేడా గమనించండి’ అని జగన్‌ పదేపదే చెబుతుంటారు.

తేడా గమనించారా..!

2014 ఎన్నికల్లో గెలిచాక చంద్రబాబు రైతులకు ఒకేసారి రూ.50 వేలు దాకా రుణమాఫీ చేశారు. ఐదేళ్లలో మరో 60-70 వేలు మాఫీ చేశారు. ఒక్కో రైతుకు దాదాపు రూ.లక్ష లబ్ధి చేకూర్చారు. కానీ రైతు భరోసా కింద ఐదేళ్లలో రూ.67,500 ఇచ్చామని జగన్‌ గొప్పలు చెబుతుండగా.. కేంద్రం పీఎం కిసాన్‌ కింద ఇచ్చిన రూ.30,000 (ఏటా రూ.6వేలు) ఇందులో నుంచి మినహాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం చేసిన సాయం 37,500 మాత్రమే. ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా, విత్తన రాయితీ, రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా వంటి పథకాలన్నీ పాతవే. టీడీపీ ప్రభుత్వం రాయితీపై అమలు చేసిన సూక్ష్మసేద్యం, వ్యక్తిగత వ్యవసాయ యాంత్రీకరణ, ఉచితంగా సూక్ష్మపోషకాల పంపిణీ వంటి వాటిని జగన్‌ సర్కారు అటకెక్కించింది. అన్నివిధాలా చంద్రబాబు ప్రభుత్వంలోనే రైతులకు ఎక్కువగా మేలు జరిగింది. మరి జగన్‌ చెప్పిన తేడా ఏంటో వైసీపీ నేతలకే తెలియాలి..!

  • 31 లక్షల మందికి సాయం సున్నా

హామీ: పెట్టుబడి సాయం కింద ఏటా ప్రతి రైతు కుటుంబానికీ రూ.12,500 చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు జగన్‌ హామీ ఇచ్చారు.

వాస్తవం: జగన్‌ అధికారంలోకి వచ్చాక గొప్ప కోసం మరో రూ.వెయ్యి పెంచి రూ.13,500 ఇస్తామన్నారు. కానీ పీఎం కిసాన్‌ కింద ఏటా కేంద్రం ఇచ్చే రూ.6 వేలను మినహాయించి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.7,500 మాత్రమే ఇస్తున్నారు. ఏటా రూ.13,500 చొప్పున ఒక్కో లబ్ధిదారుకు రూ.67,500 అందాల్సి ఉండగా, రూ.37,500 మాత్రమే ఇచ్చి రూ.30 వేలు కోత పెట్టారు. రాష్ట్రంలో 64 లక్షల మంది భూ యజమానులు ఉండగా అనేక సాకులతో 16 లక్షల మందికి మొండిచేయి చూపారు. అలాగే 16.5 లక్షల మంది కౌలు రైతులు ఉండగా 15 లక్షల మందికి ఎగనామం పెట్టారు. అగ్రవర్ణ కౌలురైతులకు నయాపైసా ఇవ్వలేదు. మొత్తంగా 31 లక్షల మంది రైతులకు సాయం సున్నా.

  • రబీ బీమా ఎగవేత

హామీ: రైతు నయా పైసా కట్టకుండా వారి వాటా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా ప్రతి రైతుకూ అందిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు.

వాస్తవం: రాష్ట్రంలో 60 లక్షల మందిపైగా రైతులు పంటలు సాగు చేస్తుండగా, ఈ-క్రాప్‌ తప్పనిసరి నిబంధనతో సగం మందికి కూడా బీమా కల్పించడం లేదు. 2019లో 9.48 లక్షల మందికి, 2020లో 15.15 లక్షల మందికి, 2021లో 15.60 లక్షల మందికి, 2022లో 10.20 లక్షల మందికే పరిహారం ఇచ్చారు. ఖరీఫ్‌లో తప్ప రబీ పంటలకు బీమా అమలు చేయలేదు. 2022-23 రబీ పంటల బీమా పరిహారం గత డిసెంబరులో ఇస్తామని ఇప్పటికీ ఇవ్వలేదు. 2023-24 బీమా పరిహారం వచ్చే జూన్‌లో వస్తుందని జగన్‌ చెప్పారు. దీంతో రబీ పంటల బీమా ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. నిరుడు ప్రధానమంత్రి ఫసల్‌ బీమాను అమలు చేస్తామన్న ప్రభుత్వ పెద్దలు ఆ మాటా నిలబెట్టుకోలేదు.

  • పావలా వడ్డీ ఎత్తివేత

హామీ: రైతన్నలకు వడ్డీలేని పంట రుణాలిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు.

వాస్తవం: పంట రుణాలకు టీడీపీ ప్రభుత్వంలో రూ.లక్ష వరకు సున్నా వడ్డీ, రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు పావలా వడ్డీ అమలు చేశారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు వర్తించే వడ్డీ రాయితీని నిలిపివేశారు.

రూ.లక్షలోపు రుణాలకు అసలుతో పాటు వడ్డీ వసూలు చేస్తున్నారు. సున్నా వడ్డీ సొమ్మును ఏడాది తర్వాత ఎప్పుడో రైతుల ఖాతాల్లో జమ చేసే పద్ధతి పెట్టారు. సవాలక్ష నిబంధనలతో సున్నా వడ్డీని అందరికీ వర్తింపజేయడం లేదు. పావలా వడ్డీ రుణాల పథకానికి కేంద్రం రాయితీ వాటా ఇస్తున్నా.. రాష్ట్ర వాటా విడుదల చేయట్లేదు. దీంతో రూ.లక్షపైన అప్పు తీసుకున్న రైతులు 7 % వడ్డీ భరించాల్సి వస్తోంది.

  • ఉసురు తీస్తున్న అప్పులు

హామీ: వ్యవసాయంలో నష్టాలతో అప్పుల పాలై ఆత్మహత్య చేసుకునే రైతులు, కౌలురైతుల కుటుంబాలు రోడ్డున పడకుండా పునరావాస ప్యాకేజీ కింద రూ.7లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని జగన్‌ ప్రకటించారు.

వాస్తవం: ఈ ఐదేళ్లలో వరుస విపత్తులు, మద్దతు ధర లేక నష్టపోయిన సన్నకారు రైతులు, కౌలురైతులు అప్పులపాలై బలవన్మరణాలకు పాల్పడిన ఘటనలు కోకొల్లలు. కానీ ఈ ఉదంతాలన్నీ రికార్డులకు ఎక్కడం లేదు. ఎంతమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటనే లేదు. కానీ వైఎస్సార్‌ ఫార్మర్‌ సూసైడ్‌ ఎక్స్‌గ్రేషియా వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం బలవన్మరణాలకు పాల్పడిన రైతు కుటుంబాలకు రూ.7లక్షల చొప్పున 1,316 క్లెయిమ్‌లు సెటిల్‌ చేసి, రూ.92.12 కోట్లు పంపిణీ చేసినట్లు ఉంది.


  • పంట నష్ట సాయం అరకొరే

హామీ: ప్రకృతి విపత్తులు సంభవించినపుడు రైతులను ఆదుకుంటామని,

రూ.4 వేల కోట్లతో విపత్తు సహాయ నిధి ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు.

వాస్తవం: ఈ ఐదేళ్లలో ఏ బడ్జెట్‌లోనూ రూ.2 వేల కోట్లు మించి కేటాయించలేదు. వరుస విపత్తులతో లక్షల ఎకరాల్లో రూ.వేల కోట్ల విలువైన పంట నష్టపోగా, ఐదేళ్లలో ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రైతులకిచ్చింది రూ.3,262 కోట్లు మాత్రమే. అది కూడా కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే విపత్తు సహాయంతోనే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నారు. 2019లో అధిక వర్షాలు, 2020, 2021లో కొవిడ్‌ కారణంగా ఆక్వా, ఉద్యాన పంట ఉత్పత్తులకు ఎగుమతులు లేక రైతులు నష్టపోయారు. వారికి ప్రత్యేక సాయమేదీ అందించలేదు. 2022లో తుఫాన్లు, అకాల వర్షాలు, 2023లో తీవ్ర వర్షాభావం, మిచౌంగ్‌ తుఫాన్‌తో భారీ నష్టం వాటిల్లింది. పంట నష్టానికి కూడా ఈ-క్రాప్‌ తప్పరిసరి చేసి, 33ుపైన నష్టపోయిన రైతులకే ఇన్‌పుట్‌ సబ్సిడీ అనే నిబంధన పెట్టారు. కౌలుసాగుదారులందరికీ సాయం అందలేదు.

  • ధరల స్థిరీకరణ నిధి మిథ్య!

హామీ: ‘రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. పంట వేసే ముందే మద్దతు ధరలు ప్రకటించి, ధర తగ్గితే మార్కెట్‌ జోక్యంతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది’.. అని జగన్‌ అనేక సార్లు చెప్పారు.

వాస్తవం: తొలి రెండేళ్లు ధాన్యం తప్ప ఇతర ఉత్పత్తులను చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేయలేదు. ఏ సీజన్‌లోనూ పండిన ధాన్యంలో 40ు కూడా కొనలేదు. ధాన్యం అమ్మిన రైతులకు ఈ ఏడాది మొదట్లో తప్ప ఎప్పుడూ 21 రోజుల్లోపు డబ్బులిచ్చిన దాఖలా లేదు. ధరల స్థిరీకరణ నిధితో ఉల్లి, టమాటా తప్ప ప్రధాన పంటలు నామమాత్రంగా కూడా కొనలేదు. సుబాబుల్‌, జామాయిల్‌ కర్రలకు టన్ను రూ.5 వేలు వచ్చేలా చూస్తామని చెప్పి..

రైతుకు రూ.2 వేలు కూడా రాకపోతే ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. చంద్రబాబు ప్రభుత్వం మిర్చి, శనగ, జొన్న, మొక్కజొన్న పంటలకు ధరలు తగ్గినప్పుడు రైతులకు బోనస్‌ ఇవ్వగా, జగన్‌ సర్కార్‌ అలాంటి సాయమేమీ చేయలేదు.

  • ఉచిత బోర్లు తూచ్‌

హామీ: రైతుకు నయాపైసా ఖర్చు లేకుండా వైఎస్సార్‌ జలకళ పథకంలో ఉచితంగా బోర్లు వేయిస్తామని జగన్‌ హామీ ఇచ్చారు.

వాస్తవం: అధికారం చేపట్టిన ఏడాది తర్వాత జలకళ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతుల నుంచి దాదాపు 2.4 లక్షల దరఖాస్తులు రాగా, సుమారు 24 వేల బోర్లు మాత్రమే వేశారు. 2023-24లో 20 వేల బోర్లు వేయిస్తామని బడ్జెట్‌లో పేర్కొన్నారు. లక్షలాది మంది రైతులు బోర్లు అడుగుతుంటే వేలల్లో కూడా వేయలేదు. వేసిన బోర్లకు కరెంట్‌ కనెక్షన్లు సగం కూడా ఇవ్వలేదు. పంపు సెట్లు అమర్చింది కేవలం మూడు అంకెల్లోనే! మరోవైపు వ్యవసాయ రంగానికి పగటి పూట 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తామని జగన్‌ హామీ ఇచ్చి, రోజులో 7 గంటలు కూడా ఇవ్వట్లేదు. పైగా వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్లు బిగించాల్సిందేనని రైతులపై ప్రభుత్వం ఒత్తిడి చేసింది.

  • ఆక్వా రైతుకు అవస్థలు

హామీ: ‘ఆక్వా రైతులకు యూనిట్‌ రూపాయిన్నరకే విద్యుత్‌ ఇస్తాం. మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ రూ.9కు పెంచుతాం’ అని జగన్‌ ప్రకటించారు.

వాస్తవం: రాష్ట్రంలో 4.70 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు అవుతుంటే.. జోన్‌ పేరుతో ఆక్వా సాగును విభజించారు. 10 ఎకరాల్లోపు సాగు చేసే ఆక్వా రైతులకు రూపాయిన్నరకు కరెంటు ఇస్తున్నారు. 10 ఎకరాలపైన ఆక్వా సాగు చేసే రైతులకు విద్యుత్‌ రాయితీ పూర్తిగా ఎత్తేశారు. దీంతో దాదాపు లక్షన్నర మందికి విద్యుత్‌ రాయితీ అందకుండా పోయింది. జోన్‌ బయట వాడే కరెంట్‌కు కమర్షియల్‌ రేటు వసూలు చేస్తున్నారు. మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయంలో రూ.10వేలు ఇస్తున్నామంటూ ఇతర రాయితీ పథకాలు కట్‌ చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో బోట్లు, వలలు, ఇతర పరికరాలు రాయితీపై ఇవ్వగా, ఈ ప్రభుత్వం అరకొరగా కూడా పంపిణీ చేయలేదు.

  • గిడ్డంగులు ఏవీ?

హామీ: ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగులు, గోదాములు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తాం’ అని జగన్‌ హామీ ఇచ్చారు.

వాస్తవం: రూ.1,845 కోట్ల నాబార్డు రుణంతో రెండు దశల్లో 2,400 గిడ్డంగులు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుని, మొదటి దశ లక్ష్యంలో సగం కూడా నిర్మించలేదు. బిల్లులు ఇవ్వకుండా రెండో దశను అటకెక్కించారు. రూ.3,600 కోట్లతో ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో 26 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామని సగం కూడా పెట్టలేదు.

  • కేంద్రం సొమ్ముతో జగన్‌ ప్రచారం

జగన్‌ సర్కార్‌ తెచ్చిన రైతుభరోసా పథకానికి కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్‌ను కలిపి వైఎస్సార్‌ రైతుభరోసా-పీఎం కిసాన్‌ అని పేరు పెట్టారు. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్‌ సొమ్మునూ తామే ఇచ్చినట్లు జగన్‌ సర్కారు బిల్డప్‌ ఇచ్చింది. అత్త సొమ్ముతో అల్లుడి సోకు అంటే ఇదే కదూ? ఐదేళ్లలో ఒక్కో రైతుకు రూ.67,500 చొప్పున రైతుభరోసా కింద రూ.34,288 కోట్లు ఖర్చు చేశామని జగన్‌ చెప్తున్నారు. వాస్తవానికి ఐదేళ్లలో రైతుభరోసా కింద ఇచ్చింది రూ.19,860 కోట్లు మాత్రమే. పీఎం కిసాన్‌ కింద కేంద్రం రూ.14,428 కోట్లు ఇచ్చింది. కేంద్రం అనుమతితో పీఎం కిసాన్‌ పథకాన్ని దత్తత తీసుకుని ఉంటే.. ఈ పథకం ప్రకటనల్లో ప్రధాని మోదీ ఫొటో ప్రచురించాలి. కానీ ఐదేళ్లలో ఏనాడూ మోదీ ఫొటో పెట్టలేదు. ఇదే విషయంపై కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నేతలు అనేక సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

  • జగన్‌ వచ్చాక రైతులకు నష్టం

చంద్రబాబు పాలనలో వ్యవసాయ రుణాల మాఫీతో 58.29 లక్షల మంది రైతులు రూ.15,279 కోట్లు లబ్ది పొందారు. అయితే 4,5 విడతల సొమ్ము విడుదల చేసినా ఎన్నికల కోడ్‌ వల్ల రైతుల ఖాతాలకు చేరలేదు. ఎన్నికల ముందు రూ.4 వేల చొప్పున దాదాపు 54.89 లక్షల రైతు కుటుంబాలకు అన్నదాత సుఖీభవ కింద చంద్రబాబు ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది. కానీ రైతులకు లబ్ధి కలిగితే తమకు రాజకీయంగా నష్టమని భావించిన వైసీపీ నేతలు అన్నదాత సుఖీభవపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్‌ రైతు రుణమాఫీ ప్రక్రియను రద్దు చేసింది. మధ్యలో ఆగిపోయిన చెల్లింపుల ప్రక్రియను కొనసాగించక పోవడంతో అప్పట్లో ఒక్కో రైతు రూ.50 వేలు దాకా నష్టపోయారు.


  • కేంద్రం సొమ్ముతో జగన్‌ ప్రచారం

జగన్‌ సర్కార్‌ తెచ్చిన రైతుభరోసా పథకానికి కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్‌ను కలిపి వైఎస్సార్‌ రైతుభరోసా-పీఎం కిసాన్‌ అని పేరు పెట్టారు. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్‌ సొమ్మునూ తామే ఇచ్చినట్లు జగన్‌ సర్కారు బిల్డప్‌ ఇచ్చింది. అత్త సొమ్ముతో అల్లుడి సోకు అంటే ఇదే కదూ? ఐదేళ్లలో ఒక్కో రైతుకు రూ.67,500 చొప్పున రైతుభరోసా కింద రూ.34,288 కోట్లు ఖర్చు చేశామని జగన్‌ చెప్తున్నారు. వాస్తవానికి ఐదేళ్లలో రైతుభరోసా కింద ఇచ్చింది రూ.19,860 కోట్లు మాత్రమే. పీఎం కిసాన్‌ కింద కేంద్రం రూ.14,428 కోట్లు ఇచ్చింది. కేంద్రం అనుమతితో పీఎం కిసాన్‌ పథకాన్ని దత్తత తీసుకుని ఉంటే.. ఈ పథకం ప్రకటనల్లో ప్రధాని మోదీ ఫొటో ప్రచురించాలి. కానీ ఐదేళ్లలో ఏనాడూ మోదీ ఫొటో పెట్టలేదు. ఇదే విషయంపై కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నేతలు అనేక సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

  • జగన్‌ వచ్చాక రైతులకు నష్టం

చంద్రబాబు పాలనలో వ్యవసాయ రుణాల మాఫీతో 58.29 లక్షల మంది రైతులు రూ.15,279 కోట్లు లబ్ది పొందారు. అయితే 4,5 విడతల సొమ్ము విడుదల చేసినా ఎన్నికల కోడ్‌ వల్ల రైతుల ఖాతాలకు చేరలేదు. ఎన్నికల ముందు రూ.4 వేల చొప్పున దాదాపు 54.89 లక్షల రైతు కుటుంబాలకు అన్నదాత సుఖీభవ కింద చంద్రబాబు ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది. కానీ రైతులకు లబ్ధి కలిగితే తమకు రాజకీయంగా నష్టమని భావించిన వైసీపీ నేతలు అన్నదాత సుఖీభవపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్‌ రైతు రుణమాఫీ ప్రక్రియను రద్దు చేసింది. మధ్యలో ఆగిపోయిన చెల్లింపుల ప్రక్రియను కొనసాగించక పోవడంతో అప్పట్లో ఒక్కో రైతు రూ.50 వేలు దాకా నష్టపోయారు.

Updated Date - Apr 29 , 2024 | 04:27 AM