Share News

అడ్డగోలుగా చేస్తే... అంతే!

ABN , Publish Date - Mar 29 , 2024 | 06:17 AM

‘ఇది మా ప్రభుత్వం. మేం అనుకున్నదే చేస్తాం. తోచినట్లుగా నిబంధనలు మార్చేస్తాం. అర్హులను పక్కన పెట్టేసి అనర్హులకు పదోన్నతులు ఇచ్చేస్తాం. అంతా మా ఇష్టం’’ అంటూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్న జగన్‌ సర్కారుకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జూనియర్‌ కాలేజీల

అడ్డగోలుగా చేస్తే... అంతే!

హైకోర్టులో జగన్‌ సర్కారుకు ఝలక్‌

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల ప్రినిపాల్‌ పదోన్నతుల్లో నిబంధనలకు పాతర

తోచినట్లు సర్వీసు రూల్స్‌ మార్పు

అర్హులకు పదోన్నతులు నిలిపివేత

ఓ మంత్రి సొంత నిర్ణయాలతో కొత్త రూల్స్‌

ప్రమోషన్లకు జేఎల్స్‌ నుంచి లక్షలు వసూలు

అధికారులు వద్దన్నా వినిపించుకోని మంత్రి

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘‘ఇది మా ప్రభుత్వం. మేం అనుకున్నదే చేస్తాం. తోచినట్లుగా నిబంధనలు మార్చేస్తాం. అర్హులను పక్కన పెట్టేసి అనర్హులకు పదోన్నతులు ఇచ్చేస్తాం. అంతా మా ఇష్టం’’ అంటూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్న జగన్‌ సర్కారుకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాల్‌ పదోన్నతుల్లో నిబంధనలు బేఖాతరు చేయడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల సొంత రూల్స్‌ చూసి ఒకదశలో హైకోర్టే విస్మయం వ్యక్తం చేసింది. ఇటీవల 197 మంది జూనియర్‌ లెక్చరర్లకు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతులు కల్పిస్తూ ఇంటర్‌ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతుల్లో తమను పరిగణనలోకి తీసుకోకపోవడంపై కాలేజీల్లో పనిచేసే లైబ్రేరియన్లు హైకోర్టును ఆశ్రయించారు. వారిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని, ఇంటర్‌ విద్యాశాఖ ఇచ్చిన పదోన్నతులను సస్పెండ్‌ చేస్తూ ఇటీవల న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దానిపై మళ్లీ కొందరు కోర్టును ఆశ్రయించగా అసలు లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు పదోన్నతుల జాబితాలోకి ఎలా వచ్చారని న్యాయస్థానం ఆరా తీసింది. 2021లో వారికీ పదోన్నతులు కల్పించే విధంగా సర్వీసు రూల్స్‌ను జగన్‌ ప్రభుత్వం మార్చిన విషయం వెలుగులోకి వచ్చింది. అంతకుముందు ప్రిన్సిపాల్‌ పదోన్నతులకు అర్హుల జాబితాలో మూడు కేటగిరీలు ఉండేవి. డైరెక్ట్‌ కోటాలో వచ్చిన జూనియర్‌ లెక్చరర్లు, టీచర్‌ నుంచి పదోన్నతి ద్వారా జేఎల్‌ అయినవారు, ఇంటర్‌, డిగ్రీ కాలేజీల్లో పనిచేసే మినిస్టీరియల్‌ సిబ్బంది నుంచి జేఎల్‌ అయినవారికి కలిపి ఒకే సీనియారిటీ జాబితా తయారుచేసి ప్రమోషన్లు ఇచ్చేవారు. 2018లో ఇచ్చిన పదోన్నతుల్లోనూ ఇదే విధానం పాటించారు.

ఆ అధికారి అత్యుత్సాహం

మొదటినుంచీ ఉన్న సీనియారిటీ జాబితా విధానాన్ని జగన్‌ ప్రభుత్వం మార్చేసింది. ప్రిన్సిపాళ్ల పదోన్నతుల్లో తమను కూడా పరిగణించాలని లైబ్రేరియన్లు కోరడంతో దానిపై 2021 డిసెంబరులో ఏకంగా జీవో 76 జారీ చేసింది. అప్పటివరకూ ఉన్న కేటగిరీలతో పాటు ఇకనుంచి లైబ్రేరియన్లు, ఫిజికల్‌ డైరెక్టర్లను కూడా పదోన్నతుల్లోకి పరిగణించాలని స్పష్టంచేసింది. దీనిని జూనియర్‌ లెక్చరర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. వారు పాఠాలు చెప్పరని, పరీక్షల బాధ్యతలు ఉండవని, ఉత్తీర్ణత టార్గెట్లతో సంబంధం లేదని, వారు ప్రిన్సిపాళ్లు కావడానికి అర్హులుకారని వాదించారు. ఇదే విషయాన్ని అప్పటి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌కు నాటి ఇంటర్మీడియెట్‌ కమిషనర్‌ బి.ఉదయలక్ష్మి లేఖ రాశారు. జేఎల్స్‌ కూడా నేరుగా ఆయన్ను కలిసి ఇది నిబంధనలకు విరుద్ధమని వివరించారు. కానీ ప్రభుత్వ ఆదేశాలతో నిబంధనలను పట్టించుకోకుండా ముఖ్య కార్యదర్శి జీవో 76 జారీ చేశారు. లైబ్రేరియన్లకు, పీడీలకు ఎందుకు అర్హత కల్పించాల్సి వచ్చిందో అందులో ఎక్కడా పేర్కొనలేదు. వారిని కూడా ప్రిన్సిపాళ్ల జాబితాలోకి చేరుస్తూ సర్వీస్‌ రూల్స్‌ సవరిస్తూ ఏకపక్షంగా జీవో ఇచ్చారు. ఇప్పుడు ఆ జీవోనే వివాదానికి కారణమైంది. అవసరమైతే ఆ ముఖ్యకార్యదర్శిని జైలుకు పంపుతామని కోర్టు వ్యాఖ్యానించేలా నిబంధనలు తుంగలో తొక్కారు.

అమాత్యుడి వసూళ్ల పర్వం

పదోన్నతుల్లో ఒక కేటగిరీని పక్కనపెట్టేందుకు ఓ సీనియర్‌ మంత్రి భారీగా ముడుపులు వసూలు చేశారని విద్యాశాఖలో ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందు పాఠశాల విద్యాశాఖ నుంచి అన్ని స్థాయిల్లో వసూళ్లకు తెరతీసిన ఆయన ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకున్నారు. ఇటీవల 1,200 మంది టీచర్లను అక్రమంగా బదిలీ చేయడం ద్వారా రూ.40కోట్ల వరకు ఆయన వెనకేశారన్న విమర్శలున్నాయి. ఈ వ్యవహరంలో కూడా ఓ కేటగిరీని పక్కనపెట్టడం ద్వారా లబ్ధిపొందే డీఆర్‌ కోటా జేఎల్స్‌ నుంచి కూడా భారీగా వసూలు చేశారని ఆ వర్గాలు అంటున్నాయి. ఒక్కో జేఎల్‌ నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేసి, టీచర్ల నుంచి వచ్చిన జేఎల్స్‌ను పక్కనపెట్టేలా ఆదేశించారని చెబుతున్నాయి. కాగా, ఇది నిబంధనలకు విరుద్ధమని కొందరు అధికారులు చెప్పినా ఆ మంత్రి సొంత నిబంధనలు అమలుచేయించారని తెలుస్తోంది.

అర్హులకు ఆపేశారు

లైబ్రేరియన్లు, పీడీల సీనియారిటీని 2016 నుంచే లెక్కిస్తుండటం, అంతకుముందు నుంచే సీనియర్‌ జేఎల్స్‌ ఉండటంతో వారికి తాజా పదోన్నతుల్లో అవకాశం లభించలేదు. అయితే టీచర్ల నుంచి వచ్చిన జేఎల్స్‌ను తాజా పదోన్నతుల్లో పక్కనపెట్టారు. వారికి సంబంధించి కొన్ని కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయని, అవి తేలకుండా వారికి పదోన్నతులు ఇవ్వలేమని ఇంటర్‌ విద్యాశాఖ పేర్కొంది. అయితే న్యాయస్థానంలో వేర్వేరు కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ డీఆర్‌ కోటా నుంచి వచ్చినవారికి, మినిస్టీరియల్‌ సిబ్బందికి పదోన్నతులు ఇచ్చేశారు. అయితే వారికి ఇచ్చినవి అడహక్‌ పదోన్నతులని, కోర్టు కేసుల తర్వాత వెనక్కి పంపాల్సిన అవసరం రావొచ్చని అందులో స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వారిని పక్కనపెట్టిందని అర్థమవుతోంది.

Updated Date - Mar 29 , 2024 | 06:17 AM