Share News

రిజర్వేషన్లపై జగన్‌ది తప్పుడు ప్రచారం

ABN , Publish Date - Apr 29 , 2024 | 04:30 AM

కూటమికి ఓటు వేస్తే ముస్లింల రిజర్వేషన్లు రద్దవుతాయంటూ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని,

రిజర్వేషన్లపై జగన్‌ది తప్పుడు ప్రచారం

4% రిజర్వేషన్లపై సుప్రీంలో సొంత

ఖర్చుతో పోరాటం చేసింది టీడీపీనే

ఎన్డీయేతో ఉన్నప్పుడే విజయవాడ,

కడపల్లో హజ్‌ హౌస్‌ల నిర్మాణం

వైసీపీ పాలనలో అన్నీ అరాచకాలే

ముస్లింలతో బాబు ఆత్మీయ భేటీ

నెల్లూరు, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): కూటమికి ఓటు వేస్తే ముస్లింల రిజర్వేషన్లు రద్దవుతాయంటూ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సుప్రీం కోర్టులో ఉన్న ముస్లింల 4% రిజర్వేషన్ల కేసుపై సొంత ఖర్చులతో న్యాయవాదులను పెట్టి పోరాడింది టీడీపీనే అని చంద్రబాబు స్పష్టం చేశారు. తాను సీఎంగా ఉన్న సమయంలో ముస్లిం నేతలను ఢిల్లీకి పంపి సుప్రీంకోర్టులో పోరాటం చేసినట్లు గుర్తు చేశా రు. ఆదివారం నెల్లూరులోని కోటమిట్ట షాదీమంజిల్‌లో ము స్లింలతో చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ‘నేను అబ్దుల్‌ కలాంను రాష్ట్రపతిని చేస్తే జగన్మోహన్‌రెడ్డి అబ్దుల్‌ సలాం చనిపోయేలా చేశారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులను రక్షించుకునేందుకు నరసరరావుపేటలో ఓ వ్యక్తి పోరాటం చేస్తే దారుణంగా చంపేశారు. ఇటువంటి అరాచకాలను టీడీపీ ప్రభుత్వంలో ఎప్పుడైనా చూశారా? అధికారంలో ఉన్న ఐదేళ్లు జగన్మోహన్‌రెడ్డి కేంద్రంలో ఏ పార్టీకి సపోర్ట్‌ చేశారో ముస్లింలకు సమాధానం చెప్పాలి. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ బిల్లులకు పార్లమెంటులో వైసీపీ సపోర్ట్‌ చేసింది. ఏ 2 విజయసాయిరెడ్డి సంతకాలు పెట్టడమే కాకుండా మంచి చట్టాలంటూ మాట్లాడారు. నేడు అదే ఏ 2 నెల్లూరుకు వచ్చి ముస్లింలకు అన్యాయం జరుగుతోందని అంటున్నారు. ఇది ముస్లింలకు వైసీపీ చేసిన ద్రోహం కాదా?’ అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.


ముస్లింలను ఆదుకున్నది మేమే

‘2014-19 మధ్య తాము ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఏ ఒక్క ముస్లింకు అన్యాయం జరగకుండా చూసుకున్నాం. ఎన్డీయేలో ఉన్నప్పుడే హైదరాబాద్‌లో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం, హజ్‌ హౌస్‌ నిర్మించాం. రాష్ట్ర విభజన తర్వాత ఎన్డీయేలో ఉన్నప్పుడే కడప, విజయవాడలో హజ్‌ హౌస్‌లు నిర్మించాం. దుల్హన్‌ పథకం తీసుకొచ్చాం. రంజాన్‌ తోఫా, విదేశీ విద్య, సబ్సిడీ రుణాలతో ముస్లింలను ఆదుకున్నది తెలుగుదేశం పార్టీ’ అని చంద్రబాబు అన్నారు.

Updated Date - Apr 29 , 2024 | 04:34 AM