Share News

కుల చిచ్చుకు జగన్‌ కుట్ర

ABN , Publish Date - Apr 29 , 2024 | 04:39 AM

గోదావరి జిల్లాల్లో కాపులకు, దళితులకు మధ్య చిచ్చు పెట్టాలనేదే సీఎం జగన్‌ కుయుక్తి అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు.

కుల చిచ్చుకు జగన్‌ కుట్ర

కాపులు, దళితుల మధ్య గొడవలకు కుయుక్తులు: పవన్‌

కాపు రిజర్వేషన్లను ఒప్పుకోని వ్యక్తితో

ఆ వర్గం ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు

కాపులను తాకట్టుపెట్టే స్థాయి

నాకుంటే ఓడిపోయేవాడినా?

ఆ ఉద్యమం వైసీపీ నడిపించిందే!

రిజర్వేషన్లు రావని తెలిసినా

ఆ పార్టీ నేతలను ఎగదోశారు

రైలును తగులబెట్టించారు

ప్రత్తిపాడు, జగ్గంపేట సభల్లో పవన్‌

కాకినాడ, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): గోదావరి జిల్లాల్లో కాపులకు, దళితులకు మధ్య చిచ్చు పెట్టాలనేదే సీఎం జగన్‌ కుయుక్తి అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో దున్నని భూమి, ఉండని ఇళ్లు.. అన్నీ జగన్‌ లాగేసుకుంటాడని స్పష్టం చేశారు. కాపుల రిజర్వేషన్‌ ఉద్యమం వైసీపీ కనుసన్నల్లో జరిగిందని ధ్వజమెత్తారు. ఆ పార్టీ కీలకనేతల కనుసన్నల్లో తుని రైలు దహనం ఘటన జరిగిందని మండిపడ్డారు. వైసీపీకి ఓటేస్తే మనల్ని మనమే కిరోసిన్‌ పోసుకుని తగలబెట్టుకున్నట్లని హెచ్చరించారు. ఆదివారం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం, జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో జరిగిన ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. జగన్‌ ప్రభుత్వానికి అసలు ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు. ‘ఐదేళ్ల పాలనలో అవినీతిలో మునిగిపోయినందుకా.. మెగా డీఎస్సీ ’ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసినందుకా.. పోలవరం పూర్తి చేయకుండా అన్నదాతలను మోసం చేసినందుకా.. భవన నిర్మాణ కార్మికుల నిధులను మింగేసినందుకా.. రహదారులు నిర్మించకుండా వదిలేసి వెన్నుపూసలు విరగ్గొడుతున్నందుకా..’ అని నిలదీశారు. రాబోయే ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలని.. అరాచక పాలన సాగించిన జగన్‌ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేయాలని పిలుపిచ్చారు. ఇంకా ఏమన్నారంటే.. కాపు రిజర్వేషన్ల ఉద్యమం వైసీపీ కనుసన్నల్లోనే జరిగింది. రిజర్వేషన్ల కోసం జరిగే సభ సందర్భంగా ఏవో దుర్ఘటన జరుగుతుందని నాకు ముందే సమాచారం వచ్చింది. రిజర్వేషన్లు రావని తెలిసి కూడా వైసీపీ నేతలు మిథున్‌రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి తదితరులు రైలు దహనం జరిగేలా చేశారు. కొబ్బరి తోటల్లో కిరాయి మూకలను ఉంచి ఈ ఘటనకు పాల్పడ్డారు. కేసులు మాత్రం అమాయక యువకులపై నమోదవడంతో వారంతా నష్టపోయారు. కొందరు నేతలు నన్ను విమర్శిస్తున్నట్లు నాకు కాపులను తాకట్టు పెట్టే స్థాయి ఉంటే ఇలా ఎందుకు ఉంటాను? ప్రభుత్వాన్ని ఈపాటికే స్థాపించే వాడిని కదా! గత ఎన్నికలకు ముందు తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన జగన్‌.. కాపులకు రిజర్వేషన్‌ ఇవ్వను ఛీ..పో అన్నాడు. అయినా ఆయన్నే గెలిపించారు. కాపులకు రిజర్వేసన్‌ ఇవ్వని వ్యక్తికి కాపు ఎమ్మెల్యేలు ఎలా మద్దతిస్తారు? ఈబీసీ కోటా ఎందుకు తీసేశాడు? రాష్ట్ర పరిధిలో అయినా కనీసం అరశాతం కూడా ఇవ్వలేదు. మరి జగన్‌కు ఎందుకు ఓటేయాలి?


ఎవరి ఆస్తి ఎవరిది?

ఆస్తుల క్రయ విక్రయాలు చేస్తే ఇకపై స్టాంపు పేపర్లకు బదులు జిరాక్స్‌లు ఇవ్వడం ఏంటి? ప్రభుత్వం నాలుగురోజుల కింద జీవో తెచ్చింది. ఇదే జరిగితే ఒకప్పుడు దున్నేవాడిదే భూమి అనే నినాదం స్థానంలో దున్నని భూమి, ఉండని ఇళ్లు అన్నీ జగన్‌వే అన్నట్లు మారుతుంది. ఎవరి సొమ్ము ఎవరు తీసుకుంటారు? ఆస్తులు మనవా.. జగన్‌వా..? ఆయనకు ఆ హక్కు ఎక్కడుంది? వైసీపీ నేతలకు కూడా చెబుతున్నా.. రేపు మీ ఆస్తులు కూడా జగన్‌ లాగేస్తారు.

కులాలను విడదీయను.. కలుపుతా

గోదావరి జిల్లాల్లో కాపులకు-దళితులకు మధ్య గొడవలు పెట్టాలని జగన్‌ కుయుక్తులు పన్నుతున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన దళిత డ్రైవర్‌ను హత్య చేసి డోర్‌డెలివరీ చేశాడు. అలాంటి వ్యక్తిని జగన్‌ వెనకేసుకు తిరుగుతున్నాడు. దీనివల్ల కాపు సామాజికవర్గానికి నష్టం. తద్వారా ఆ సామాజికవర్గంపై దళితులకు ఆగ్ర హం వస్తుంది. అలా రెండు సామాజికవర్గాలు కొట్టుకునేలా కుయుక్తి పన్నారు. నేను కులాలను విడదీయను. కలిపే వ్యక్తిని.

పోలీసులకు ‘సరెండర్‌’ బాకీలు

రాష్ట్రంలో పోలీసులకు ఇవ్వాల్సిన సరెండర్‌ లీవ్స్‌ కింద జగన్‌ రూ.750 కోట్లు బాకీలు పెట్టేశారు. కానీ వారితో ఊడిగం చేయిస్తున్నారు. చివరకు వారాంతపు సెలవులు కూడా ఇవ్వడం లేదు. సీపీఎస్‌ విషయమై చంద్రబాబుతో చర్చించి మేనిఫెస్టోలో పెట్టేలా చేస్తా. అధికారంలోకి వచ్చాక ఏడాదిలోపు సమస్యకు పరిష్కారం కనుక్కుంటాం. ఈ ప్రభుత్వంలో హోంగార్డులకు జీతాలు అందలేదు. అందుకే పోలీసులు ఆలోచించి ఓటేయాలి. చిన్నపిల్లల చిక్కీలో జగన్‌ రూ.65 కోట్లు దోచేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వరు గానీ వలంటీర్ల సన్మానాలకు రూ.703 కోట్లు ధారాదత్తం చేశారు. కల్తీ మద్యంతో పేదల రక్తాన్ని అమ్ముకున్న రక్తవ్యాపారి జగన్‌.


అరటి గెలలు పండించుకుందాం..

జగన్‌ ప్రభుత్వం అరటి పళ్లు తినేసి తొక్కలను మనకు వదిలేసింది. కానీ కూటమి వచ్చాక అరటి గెలలు పండించుకుందాం. అందుకే యువతకు ఒకటే చెబుతున్నా. మీ దండాలు వద్దు.. మీ భవిష్యత్‌ నాకు కావాలి. నాకు లంచాలు వద్దు. మీకు బంగారు భవిష్యత్‌ అందితే అదే నాకు సంతృప్తి. ్జకూటమి అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు నుంచి అన్నదాతల కష్టాల వరకూ తీరతాయి. నిరుద్యోగుల దగ్గర నుంచి భవన నిర్మాణ కార్మికుల వరకు బాధలు తీరతాయి. ప్రత్తిపాడు నియోజకవర్గంలో వంతాడ మైనింగ్‌ అక్రమాలు అరికట్టేలా స్వయంగా నేనే పర్యవేక్షిస్తా. ఈ నియోజకవర్గంలో ద్వారంపూడి రొయ్యల ఫ్యాక్టరీకి ప్రభుత్వం బ్రిడ్జి కట్టించింది. కానీ ప్రజలు రహదారులు లేకుండా ఇబ్బందులు పడుతుంటే ఏరోజూ పట్టించుకోలేదు. ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే ద్వారంపూడి సహజ వనరులను భారీగా లూటీ చేస్తున్నారు. వీరి సంగతి తేల్చడానికే నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా.

రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టును జగన్‌ పక్కనపడేశారు. 74 శాతం పూర్తయిన ప్రాజెక్టును గాలికి వదిలేశారు. అక్కడకు వెళ్లి పరిశీలించాలంటే నిషేధిత ప్రాంతంగా మార్చేశారు.

- పవన్‌ కల్యాణ్‌

Updated Date - Apr 29 , 2024 | 04:40 AM