Share News

మాకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే తప్పా!

ABN , Publish Date - Apr 29 , 2024 | 04:05 AM

మాటలు జాగ్రత్త!! వివేకానందరెడ్డి కుటుంబానికి అన్యాయం జరిగితే చెప్పకూడదా! ప్రశ్నించ కూడదా? మీఇంట్లో అన్యాయం జరిగితే ప్రశ్నించవా?’

మాకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే తప్పా!

వివేకానందరెడ్డి కుటుంబానికి అన్యాయం జరిగితే ప్రశ్నించొద్దా

ఘాటుగా స్పందించిన వివేకా కుమార్తె

పులివెందుల, ఏప్రిల్‌ 28: ‘‘మాటలు జాగ్రత్త!! వివేకానందరెడ్డి కుటుంబానికి అన్యాయం జరిగితే చెప్పకూడదా! ప్రశ్నించ కూడదా? మీఇంట్లో అన్యాయం జరిగితే ప్రశ్నించవా?’’ అని వైసీపీ కార్యకర్తపై దివంగత వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దరంగాపురం(సారాయిపల్లె)లో సునీత ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రచార రథం పైనుంచి ‘‘నాన్నకు న్యాయం చేయండి. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయండి’’ అని కోరారు. ఇంతలో గ్రామంలోని వైసీపీకి చెందిన ఓ కార్యకర్త.. ‘‘ప్రచారం చేసుకోండి కానీ, వివేకా కేసుతో మీకేం పని’’ అంటూ సునీత ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తయిన పోలీసులు అతనిని అడ్డుకుని పక్కకు తీసుకెళుతుండగా.. అతను మరోమారు నోటిదురుసుగా మాట్లాడారు. దీంతో సునీత తీవ్ర స్వరంతో అతన్ని హెచ్చరించారు. ‘‘వివేకానందరెడ్డికి అన్యాయం జరిగితే చెప్పడం తప్పా. మీ ఇంట్లో అన్యాయం జరిగితే ప్రశ్నించవా? మాటలు జాగ్రత్తగా రానీ’’ అన్నారు. పోలీసులు ఆ వ్యక్తిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. అనంతరం సునీత ప్రసంగం కొనసాగింది. వివేకానందరెడ్డికి జరిగిన అన్యాయానికి కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే న్యాయం జరుగుతుందని సునీత చెప్పారు. ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. షర్మిలకు ఓటు వేస్తే మీకు ఎలాంటి సమస్య వచ్చినా తీర్చేందుకు శాయశక్తులా పోరాడుతామన్నారు. అనంతరం చిన్నరంగాపురం, బ్రాహ్మణపల్లె, నల్లపురెడ్డిపల్లె తదితర గ్రామాలలో సునీత ప్రచారం సాగించారు.

Updated Date - Apr 29 , 2024 | 04:05 AM