Share News

మళ్లీ అమ్మాయే పుట్టిందా!

ABN , Publish Date - Apr 16 , 2024 | 03:29 AM

నాలుగో కాన్పులోనూ ఆడ సంతానమే కలగడంతో ఓ తల్లి మానవత్వం మరిచి అప్పుడే పుట్టిన పసికందును 20 అడుగుల ఎత్తు నుంచి తుప్పల్లోకి విసిరేసింది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో

మళ్లీ అమ్మాయే పుట్టిందా!

చిన్నారిని తుప్పల్లో పడేసిన తల్లి

మగబిడ్డపై మమకారంతో నాలుగోసారి గర్భవతి

భర్తకు సైతం తెలియనివ్వకుండా గోప్యత

అబ్బాయి పుడితే చెబుదామనే ఆలోచన

కడియం, ఏప్రిల్‌ 15: నాలుగో కాన్పులోనూ ఆడ సంతానమే కలగడంతో ఓ తల్లి మానవత్వం మరిచి అప్పుడే పుట్టిన పసికందును 20 అడుగుల ఎత్తు నుంచి తుప్పల్లోకి విసిరేసింది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో జరిగిందీ ఘోరం. స్థానికులు, బంధువులు, వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వేమగిరి గణపతినగర్‌కు చెందిన తాపీ పనిచేసే వ్యక్తికి ముగ్గురు ఆడపిల్లలు.. వారు ప్రస్తుతం స్కూలుకు వెళుతున్నారు. ఆయన భార్యకు మగసంతానంపై మమకారంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకోలేదు. అయితే, కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్నట్టు భర్తను నమ్మించింది. మరోసారి గర్భం దాల్చింది. అబ్బాయి పుడితే అందరికీ చెబుదాం, అమ్మాయి పుడితే మాయం చేద్దామనే ఆలోచనతో గర్భం దాల్చిన విషయాన్ని గోప్యంగా ఉంచింది. పొట్ట పెరగడంపై భర్త ప్రశ్నించగా, ఈ మధ్య ఎక్కువగా తినడంతో పెరుగుతోందని నమ్మించింది. ఆదివారం పురుటినొప్పులు రాగా.. భర్తను, పిల్లలను చర్చికి పంపింది. తనకు తానే పురుడు పోసుకుని, కత్తిపీటతో పేగును కత్తిరించింది. అమ్మాయి పుట్టడంతో నైటీలో పసికందును చుట్టి 20 అడుగుల ఎత్తు నుంచి తుప్పల్లోకి విసిరేసింది. ఏడుపులు వినిపించడంతో చుట్టుపక్కలవారు వచ్చి చూడగా చిన్నారి కనిపించింది. దీనిపై గ్రామంలో కలకలం రేగడంతో అందరూ వచ్చి చూస్తున్నారు. చిన్నారి తండ్రి కూడా వచ్చి చూశాడు. చిన్నారికి చుట్టిన నైటీ తన భార్యదని గమనించి ఇంటికెళ్లి భార్యను నిలదీశాడు. దీంతో మగ సంతానంపై మమకారంతో ఇలా చేశానంటూ ఆమె కన్నీరుకార్చింది. హుటాహుటిన తల్లీబిడ్డను కడియం ఆస్పత్రికి, అక్కడి నుంచి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

Updated Date - Apr 16 , 2024 | 03:29 AM