Share News

YCP GOVT: ‘సుమోటో’నాటకం!

ABN , Publish Date - Apr 12 , 2024 | 06:49 AM

జగన్‌ సర్కారువన్నీ వక్ర మార్గాలు... వంకర వ్యూహాలే! ఎన్నికల వేళ అవి మరింత ముమ్మరంగా తెరపైకి వస్తున్నాయి. తన అనుకూల అధికారుల ద్వారా ప్రభుత్వ కార్యక్రమం ముసుగులో పార్టీ ప్రచారం చేసుకోవడమే దీని లక్ష్యం. ఇందులో భాగంగా... ‘కుల సమాచార సేకరణ, పునఃపరిశీలన’ పేరిట రెవెన్యూ సిబ్బందిని గ్రామ, వార్డు స్థాయుల్లో ఇంటింటికీ పంపేందుకు వైసీపీ సర్కారు ప్రయత్నిస్తోంది.

YCP  GOVT: ‘సుమోటో’నాటకం!

ఇంటింటికీ వెళ్లి కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలట..

ఎన్నికల వేళ వైసీపీ సర్కారు కొత్త కుయుక్తి

జగన్‌ కోసం సీసీఎల్‌ఏ అధికారి ప్రయత్నాలు

సుమోటోగా కుల ధ్రువీకరణ పత్రాల పునఃపరిశీలన

ఇంటింటికీ తిరగాలని రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు

జగన్‌ తరఫున ప్రచారం చేయడమే అసలు ఉద్దేశం

పైఅధికారికి తెలియకుండానే ప్రభాకర్‌ రెడ్డి అత్యుత్సాహం

కోడ్‌ ఉల్లంఘించలేమని జేసీలు, తహసీల్దార్ల ఆందోళన

కుల ధ్రువీకరణ పత్రాల కోసం జిల్లాల్లో వేలకొద్దీ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్‌ఐల పరిశీలన కోసం ఎదురు చూస్తున్నాయి. వాటిని పరిష్కరించి ‘మీ సేవ’ ద్వారా సర్టిఫికెట్లు జారీ చేయవచ్చు. కానీ... ఇప్పుడు ఇంటింటికీ వెళ్లి.. అడగని వాళ్లకూ కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేస్తారట! దరఖాస్తు చేసుకోకున్నా ధ్రువపత్రాలు ఇవ్వడం ఇప్పటిదాకా ఎక్కడా లేదు!

(అమరావతి – ఆంధ్రజ్యోతి): జగన్‌ సర్కారువన్నీ వక్ర మార్గాలు... వంకర వ్యూహాలే! ఎన్నికల వేళ అవి మరింత ముమ్మరంగా తెరపైకి వస్తున్నాయి. తన అనుకూల అధికారుల ద్వారా ప్రభుత్వ కార్యక్రమం ముసుగులో పార్టీ ప్రచారం చేసుకోవడమే దీని లక్ష్యం. ఇందులో భాగంగా... ‘కుల సమాచార సేకరణ, పునఃపరిశీలన’ పేరిట రెవెన్యూ సిబ్బందిని గ్రామ, వార్డు స్థాయుల్లో ఇంటింటికీ పంపేందుకు వైసీపీ సర్కారు ప్రయత్నిస్తోంది. దీనికి ‘సుమోటో కుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన’ (సుమోటో క్యాస్ట్‌ వెరిఫికేషన్‌) అనే పేరుపెట్టింది. భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) కార్యాలయంలో ఇటీవల కీలక బాధ్యతల్లోకి వచ్చిన ప్రభాకర్‌ రెడ్డి అనే అధికారి జగన్మోహన్‌ రెడ్డి కోసం ఎన్నికల వేళ ఈ డ్రామాకు తెరలేపినట్టు సమాచారం. ఈ కార్యక్రమాన్ని ఇప్పటికిప్పుడే అమలు చేయాలంటూ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌లు, మండల తహసీల్దార్లను ఆయన ఆదేశించారు. వెంటనే పని ప్రారంభించాలంటూ వాట్సాప్‌ ఆదేశాలిచ్చారు. కోడ్‌ అమల్లో ఉన్నందున ఇలా చేయలేమని జేసీలు చెప్పినా ఆయన పట్టించుకోలేదు. ‘ఈ పని చాలా ముఖ్యం. చేసి తీరాల్సిందే’ అని ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. కానీ... ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి కేసుల్లో ఇరుక్కోవడానికి తాము సిద్ధంగా లేమంటూ పలువురు జేసీలు తేల్చిచెప్పేశారు. దీంతో సీన్‌ రివర్స్‌ అయింది. అయితే... ప్రభాకర్‌ రెడ్డి తన పై అధికారికే తెలియకుండా ఈ తతంగం నడుపుతున్నట్లు తెలిసింది.

ఏమిటీ ‘సుమోటో’?

కుల, ఆదాయ, స్థానికత, ఫ్యామిలీ మెంబర్‌ ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు ఒక పద్ధతి ఉంది. తొలుత విద్యార్థులు తమకు అవసరమైన సర్టిఫికెట్ల కోసం స్థానిక ‘మీ సేవ’ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి. గ్రామ లేదా వార్డు రెవె న్యూ అధికారి దీనిని పరిశీలిస్తారు. అర్హులని తేలితే తహసీల్దార్‌ ఆమోదంతో కుల, ఆదాయ ఽధ్రువీకరణ పత్నాలు జారీ చేస్తారు. ఇదీ ఇప్పు డు అమలులో ఉన్న విధానం. కానీ... ఎన్నికల సమయంలో రెవెన్యూ సిబ్బందిని ఇంటింటికీ పంపించి, పరోక్షంగా ‘జగన్‌ భజన’ చేయించేందుకే ‘సుమోటో’ను తెరపైకి తెచ్చారు. అంటే... గ్రామ, వార్డు రెవెన్యూ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వారిది ఏ కులమో, ఏ మతమో తెలుసుకుంటారు. దరఖాస్తు చేసుకోకున్నా వీళ్లే సుమోటోగా కుల ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. పనిలో పనిగా... జగన్‌ అనుకూల ప్రచారం కూడా చేయడమే దీని అసలు ఉద్దేశం.

ఎందుకంత ఆరాటం?

రేషన్‌ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఉపాధి హామీ పథకం, సాధికారిక సర్వే డేటాల రూపంలో సర్కారు వద్ద ప్రజలకు సంబంధించిన సకల సమాచారం అందుబాటులో ఉంది. ఆ డేటా ఆధారంగా కుటుంబంలో ఒకరికి కుల ధ్రువీకరణ పత్రం ఇంతకు ముందే ఇచ్చి ఉంటే, మిగిలిన వారికి పెద్దగా విచారణ లేకుండానే సర్టిఫికెట్లు ఇవ్వాలని జీఓ 469 చెబుతోంది. పైగా... కుల ధ్రువీకరణ పత్రాలు అందరికీ అవసరం ఉండదు. కానీ, ‘మీరే ఇంటింటికీ వెళ్లండి. అందరికీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వండి’ అని ప్రభాకర్‌ రెడ్డి ఆదేశించడం గమనార్హం.

ఎన్నికల వేళ ఇదేం గోల?

రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఎన్నికల నిర్వహణ విధుల్లో తలమునకలయ్యారు. ఈ సమయంలో సుమోటో కుల ధ్రువీకరణ స్కీమ్‌ ను తెర పైకి తేవడంతో వారంతా తలలు పట్టుకుంటున్నారు. నిజానికి జూన్‌లో కొత్త విద్యాసంవత్సరం మొదలవుతుంది. కులం, ఆదాయ సర్టిఫికెట్లు అప్పుడు అవసరమవుతాయి. రాష్ట్రంలో ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకానుంది. మే 13న పోలింగ్‌ ఉంటుంది. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాతే ‘సుమోటో’ కార్యక్రమం చేపట్టవచ్చు. కానీ... కోడ్‌ అమలులో ఉన్నప్పుడే రెవెన్యూ సిబ్బందిని ఇంటింటికీ తిప్పాలనే ఆలోచన వెనుక అసలు వ్యూహం వేరే ఉంది. సర్టిఫికెట్ల పేరిట సిబ్బందిని ఇంటింటికీ పంపించి జగన్‌ అనుకూల ప్రచారం చేయించాలన్నది అసలు కోణమని ఆ వర్గాలు చెబుతున్నాయి.

జేసీలపై ఒత్తిళ్లు

‘‘సమీకృత కుల ధ్రువీకరణ పత్రాల విన్నపాలను వీఆర్‌ఓల లాగిన్‌కు పంపించాం. ఎన్నికల సమయంలో ఈ పనిని తక్షణమే చేపట్టేలా వీఆర్‌ఓలకు ఆదేశాలు ఇవ్వండి’’ అని బుధవారం జేసీలు, తహసీల్దార్‌లకు పంపించిన వాట్సాప్‌ ఆదేశాల్లో సీసీఎల్‌ఏ అధికారి ప్రభాకర్‌ రెడ్డి పేర్కొన్నారు. అయితే, పలువురు జేసీలు ఈ పనిచేయలేమని చేతులెత్తేశారు. దీంతో గురువారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామని, అందులో అన్ని విషయాలు మాట్లాడదామని చెప్పారు. రంజాన్‌ పండుగ సందర్భంగా గురువారం సెలవురోజు. అయినా ఈ పనిపై వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించి జేసీలను దారికి తీసుకొచ్చి సుమోటో కార్యక్రమం అమలు చేయాలని ప్రభాకర్‌ రెడ్డి గట్టి ప్రయత్నమే చేశారు. అయితే, జేసీల నుంచి సానుకూల స్పందన రాలేదు.

Updated Date - Apr 12 , 2024 | 06:49 AM