ఓటమి భయంతోనే పిన్నెల్లి ఆటవిక చర్యలు
ABN , Publish Date - May 16 , 2024 | 01:08 AM
ఓటమి భయంతోనే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఆటవిక చర్యలకు పాల్పడు తున్నారని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ జంగా
గుంటూరు, మే 15(ఆంధ్రజ్యోతి): ఓటమి భయంతోనే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఆటవిక చర్యలకు పాల్పడు తున్నారని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వర్గీయుల దాడిలో తీవ్రంగా గాయపడి గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలు షేక్ ఫిరోజ్, షేక్ సాజిద్ బాషా, కేతావతు రేఖ్యానాయక్, చేరెడ్డి మంజుల తదితరులను లావుతో పాటు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు తదితరులు పరామర్శించారు. లావు మాట్లాడుతూ టీడీపీ ఏజెంట్‌గా కుర్చున్నందుకు ఒక మహిళను గొడ్డలితో మొఖంపై నరకటానికి చేతులెలా వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాకెట్ యుగంలోకి వెళుతున్న మనం, జగన్ ముఠా చేష్టలతో రాతి యుగంలోకి వెళుతున్నట్లుందని అన్నారు. అధికారంలో ఎవరున్నా కలిసిమెలసి అభివృద్ధి చేసుకోవాలసింది పోయి కక్షలు కార్పణ్యాలతో పోలీసు స్టేషన్లు, న్యాయస్థానాల చుట్టూ తిరగవలసిన ఖర్మ ఎందు కని అన్నారు. పిన్నెల్లి సోదరుల మాటలు విని ఇలాంటి దాడులకు పాల్పిడితే, ప్రభుత్వం మారిన తరువాత తమ వాళ్ళను అదుపు చేయటం చంద్రబాబు చేతిలో కూడా ఉండదన్న విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. కేవలం పోలీసు అధికారుల అసమర్థత, పక్షపాతం వల్లే పల్నాడులో దాడులు, దహనాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెంటాలగ్రామంలో గొడవలు జరిగే అవకాశముందని ముందుగా జిల్లా పోలీసు అధికారులకు తెలిపినా ఎటువంటి చర్యలు చేపట్టలేదని అన్నారు. అవసరంలేని చోట ఎక్కువ మంది పోలీసులను పెట్టి, అవసరం ఉన్న చోట సిబ్బందిని లేకుండా చేసి దాడులు జరగటానికి కారణమైన అధికారులు, ప్రభుత్వం మారగానే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇంత మారణ హోమం జరుగుతున్నా దానికి కారకులైన వైసీపీ రౌడీ మూకలను ఎందుకు అరెస్టు చేయటంలేదో డీజీపీ, ఎస్పీ సమాధానం చెప్పాలన్నారు. తమ కార్యకర్తలను కాపాడుకోవటానికి ఎంత దూరం వెళ్లటానికైనా తాను సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు. ఆయన వెంట టీడీపీ నేతలు మన్నవ సుబ్బారావు, ధారునాయక్, మద్దిరాల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.