Share News

గుంటూరులో యాత్ర వెలవెల

ABN , Publish Date - Apr 13 , 2024 | 04:53 AM

అదేమైనా 50 వేలు మంది పట్టే ప్రాంగణమా అంటే కాదు, పట్టుమని ఐదు వేలు మంది ఉంటే కిక్కిరిసిపోయినట్లుగా కనిపించే ప్రాంగణమది....

గుంటూరులో యాత్ర వెలవెల

5వేలమంది పట్టే ప్రాంగణం.. 1150 బస్సులు

అయినా.. బస్సు యాత్రకు కనిపించని స్పందన

వర్షంతో 3 గంటలు ఆలస్యంగా సభ

గుంటూరు (ఆంధ్రజ్యోతి) సత్తెనపల్లి, ఏప్రిల్‌ 12 : అదేమైనా 50 వేలు మంది పట్టే ప్రాంగణమా అంటే కాదు, పట్టుమని ఐదు వేలు మంది ఉంటే కిక్కిరిసిపోయినట్లుగా కనిపించే ప్రాంగణమది. అయినా.. జగన్‌ బహిరంగ సభ కోసం సిద్ధంచేసిన ప్రాంగణం వెలవెలబోయింది. వెనక ఉన్న గ్యాలరీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. జగన్‌ ప్రసంగం ప్రారంభించగానే ప్రాంగణంలో ఉన్న కొద్దిపాటి ప్రజలు సైతం మెల్లగా బస్సుల వద్దకు జారుకొన్నారు. జగన్‌ ప్రసంగం కూడా చప్పగా సాగడంతో నిరాశగా వెనుదిరిగారు. శుక్రవారం సాయంత్రం గుంటూరు నగరంలో జగన్‌ బస్సు యాత్ర, 16వ నెంబరు జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన ప్రాంగణంలో నిర్వహించిన సభకు ప్రజాస్పందన కొరవడింది. జగన్‌ సభ కోసం ఆర్టీసీ ద్వారా 1150 బస్సులు సమకూర్చుకొన్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా జిల్లాల నుంచి బస్సులను తీసుకొచ్చారు. యాత్ర జరిగింది మూడు నియోజకవర్గాల మీదగా కాగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా బస్సులను పెట్టి జనాన్ని తీసుకొచ్చారు. అయితే శుక్రవారం సాయం త్రం 3గంటల సమయంలో గుంటూరు నగరంలో భారీ వర్షం కురవడంతో సభా ప్రాంగణం బురదమయంగా మారింది. మధ్యాహ్నం 3.30 గంటలకు సభ ప్రారంభం కావాల్సి ఉండగా మూడు గంటల ఆలస్యంగా 6.30 గంటలకు మొదలైంది. అప్పటికే బస్సుల్లో తీసుకొచ్చిన జనం కాస్త వెనుదిరగడం ప్రారంభించారు. చాలామంది బస్సులు దిగకుండా వాటిల్లోనే కూర్చుండిపోయారు. మరోవైపు బస్సులన్ని సీఎం సభకు తరలించడంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా, జగన్‌ సభ కోసం గుంటూరు నగర శివారులోని బొంతపాడు సమీపంలో ఎన్‌హెచ్‌-16 డివైడర్‌ని పూర్తిగా ధ్వంసం చేశా రు. అలానే సబ్‌ వేకు ఉండే ఇనుప కంచెని సుమారు అర కిలోమీటర్‌ దూరం పైగా తొలగించారు. కనీసం వాహనాల రాకపోకలను మళ్లించకుండా హైవే మీద వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు.

బాబు అననివి అన్నట్టుగా...

  • గుంటూరు సభలో జగన్‌ పదేపదే అబద్ధాలు

ప్రతీ ఇంటికి కేజీ బంగారం ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ఏనాడూ ప్రజలకు హామీ ఇవ్వలేదు. అలానే ఆడబిడ్డ పుడితే కుటుంబానికి రూ.25వేల డిపాజిట్‌ చేస్తానని చెప్పలేదు. అయినప్పటికీ సీఎం జగన్‌ పదేపదే సభలో చంద్రబాబు ప్రతీ ఇంటికి కేజీ బంగారం, రూ. 25వేల డిపాజిట్‌ చేస్తానని చెబుతూ మోసం చేసేందుకు వస్తున్నారని పచ్చి అబద్ధాలు మాట్లాడారు. ఒక్క రూపాయి కూడా డ్వాక్రా రుణాలను చంద్రబాబు మాఫీ చేయలేదని జగన్‌ మరో అబద్ధమాడారు. 2014-19 మధ్యన డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చాలావరకు అమలుచేశారు. రూ.17వేల కోట్లకు పైగా రైతు రుణమాఫీ చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే రుణమాఫీ చేయలేదని సీఎం చెప్పారు. ఎన్నికల్లో పోరాటం తనకు, చంద్రబాబు కాదట.. ప్రజలకు, చంద్రబాబుకని జగన్‌ చేసిన వ్యాఖ్యలు ముందే కాడిపడేసినట్లుగా ఉన్నాయన్న అభిప్రా యం వ్యక్తమైంది. శనివారం విజయవాడలోకి బస్సు యాత్ర ప్రవేశిస్తున్న సందర్భంగా పెద్దఎత్తున చెట్లను కొట్టేశారు.

Updated Date - Apr 13 , 2024 | 04:53 AM