Share News

సీఎం ‘ఇంటర్‌’ ఫెయిల్‌!

ABN , Publish Date - Apr 29 , 2024 | 04:22 AM

జగన్‌ చెప్పిన ఒక్క మాట కోసం లెక్చరర్లు, సౌకర్యాలు, పుస్తకాలు లేకుండా ఉన్నత పాఠశాలల్లో ‘హైస్కూల్‌ ప్లస్‌’ల పేరిట ఇంటర్మీడియట్‌ కోర్సులు ప్రారంభించి అక్కడ చదివిన విద్యార్థులు ఘోరమైన ఫలితాలు పొందడానికి కారణమైంది.

సీఎం ‘ఇంటర్‌’ ఫెయిల్‌!

కేవలం సీఎం జగన్‌ మాటిచ్చారన్న కారణంతో.. తగిన కార్యాచరణ.. ముందు చూపూ లేకుండా ప్రారంభించిన ‘హైస్కూల్‌ ప్లస్‌’లతో ప్రభుత్వం పేద విద్యార్థినుల జీవితాలను పణంగా పెట్టింది!. ఈ ఏడాది హైస్కూల్‌ ప్లస్‌లలో ఇంటర్‌ ఫలితాలు దిగజారడానికి అదే కారణమైంది. ప్రతి మండలంలో బాలికల జూనియర్‌ కాలేజీని ఏర్పాటు చేస్తామని సీఎం జగన్‌ గతంలో హామీ ఇవ్వడంతో.. అప్పటికే బాలికల కోసం కాలేజీలున్న మండలాలు మినహాయించి, మిగిలిన చోట్ల ప్రత్యేకంగా కాలేజీలు నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే దానికి నిధులు వెచ్చించకుండా ఉన్నత పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను ఇంటర్మీడియట్‌కు అప్‌గ్రేడ్‌ చేసి వాటికి హైస్కూల్‌ ప్లస్‌ అనే పేరు పెట్టి పేద పిల్లల చదువులపై ప్రయోగం చేశారు. కనీస వసతులు లేకుండా హడావుడిగా కాలేజీలు ప్రారంభించి అధికశాతం మంది విద్యార్థినులు ఫెయిల్‌ అవ్వడానికి కారణమయ్యారు.

జగన్‌ మాట కోసం పాఠశాలల్లో బాలికలకు ఇంటర్‌ విద్య.. లెక్చరర్లు, ల్యాబ్‌లు లేకుండా ‘హైస్కూల్‌ ప్లస్‌’లు

ఫలితంగా ఎక్కువ మంది బాలికలు ఫెయిల్‌

25శాతం ఉత్తీర్ణతా సాధించలేని బడులే ఎక్కువ

అల్లూరి జిల్లాలో ఫస్టియర్‌లో ఆల్‌ ఫెయిల్‌

కడప జిల్లాలోనే 20శాతం ఉత్తీర్ణత లేదు

అంతా అయ్యాక సప్లిమెంటరీకి చర్యలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జగన్‌ చెప్పిన ఒక్క మాట కోసం లెక్చరర్లు, సౌకర్యాలు, పుస్తకాలు లేకుండా ఉన్నత పాఠశాలల్లో ‘హైస్కూల్‌ ప్లస్‌’ల పేరిట ఇంటర్మీడియట్‌ కోర్సులు ప్రారంభించి అక్కడ చదివిన విద్యార్థులు ఘోరమైన ఫలితాలు పొందడానికి కారణమైంది. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్‌ ఫలితాలను చూస్తే హైస్కూల్‌ ప్లస్‌లలో చదివిన వారిలో... ఫస్టియర్‌లో 4542 మంది పరీక్షలు రాస్తే కేవలం 1262 మంది (27.79శాతం) ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో 2024 మంది పరీక్షలు రాయగా 690 మంది(34.09శాతం) మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. కేవలం సీఎం జగన్‌ ఇచ్చిన ఒకే ఒక్క హామీ ఇలా వేలాది మంది బాలికలు ఫెయిల్‌ చేసింది. హైస్కూల్‌ ప్లస్‌లు ప్రారంభించే సమయంలో విద్యపై దృష్టి పెట్టని పాఠశాల విద్యాశాఖ అంతా అయ్యాక ఇప్పుడు నష్టనివారణ చర్యలకు దిగింది. సబ్జెక్టు టీచర్లను ఇచ్చినప్పటికీ చాలా తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదైందని, అందువల్ల మే 24 నుంచి జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం కావాలని ఆదేశించింది. ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ప్రత్యేకంగా వేసవి క్యాంపులు నిర్వహించాలని, రోజువారీ టెస్ట్‌లు పెట్టాలని స్పష్టంచేసింది. అయితే అసలు సౌకర్యాల లేమితో హడావుడిగా ఇంటర్మీడియట్‌ కోర్సులు ప్రారంభించి, ఎక్కువ మంది ఫెయిల్‌ కావడానికి కారణమై, ఇప్పుడు సమ్మర్‌ క్యాంపులు నిర్వహించడం వల్ల ప్రయోజనం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఏ జిల్లా చూసినా అంతే..

ఈ ఏడాది ఇంటర్‌ ఫలితాల్లో ఫస్టియర్‌లో 67శాతం, సెకండియర్‌లో 78శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్ర సగటు ఇలా ఉంటే హైస్కూల్‌ ప్లస్‌లు మాత్రం అందులో సగం మేర సాధించడంలో కూడా చాలా దూరంలో నిలిచిపోయాయి. జిల్లాల వారీగా చూస్తే సీఎం సొంత జిల్లా కడపలో ఫస్టియర్‌లో 17.98శాతం, సెకండియర్‌లో 19.7శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. శ్రీసత్యసాయి జిల్లాలో ఫస్టియర్‌లో 53 మంది రాస్తే 13 మందే పాసయ్యారు. ఇక సెకండియర్‌లో ఇద్దరు రాస్తే ఇద్దరూ ఫెయిలయ్యారు. నంద్యాల జిల్లాలో ఫస్టియర్‌ విద్యార్థులు 26 మంది పరీక్షలు రాస్తే ముగ్గురే పాసయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఫస్టియర్‌లో ఎనిమిది మందికి మొత్తం ఫెయిల్‌ అయ్యారు. సెకండియర్‌లో 31 మందికి ఆరుగురే ఉత్తీర్ణులయ్యారు. విశాఖపట్నంలో 278 మంది విద్యార్థుల్లో 47మంది పాసయ్యారు. చిత్తూరు జిల్లాలో ఫస్టియర్‌లో 366 మందిలో 73 మంది, సెకండియర్‌లో 165 మందిలో 44 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇలా ఏ జిల్లాలో చూసినా దారుణమైన ఫలితాలే వచ్చాయి. 294 హైస్కూల్‌ ప్లస్‌లు ప్రారంభించినా అన్నిట్లో విద్యార్థులు చేరలేదు. దీంతో ఈ ఏడాది ఫస్టియర్‌లో 249 పాఠశాలల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు. వాటిలో 132 పాఠశాలలు 25శాతం కంటే తక్కువ ఉత్తీర్ణత సాధించాయి. 89 పాఠశాలల్లో 26 నుంచి 50శాతం, 19 పాఠశాలల్లో 51 నుంచి 75శాతం, 5 పాఠశాలల్లో 75 నుంచి 99శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు ఫస్టియర్‌లో 4, సెకండియర్‌లో 10 మాత్రమే ఉన్నాయి.

జగన్‌ మాట కోసం..

2022-23 విద్యా సంవత్సరంలో 294 హైస్కూల్‌ ప్లస్‌లు ప్రారంభించారు. ఆ విద్యా సంవత్సరంలో సుమారు 3వేల మంది బాలికలు వాటిలో చేరగా, కేవలం 12శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. దీంతో సెకండియర్‌లో చాలా మంది వాటి నుంచి బయటికొచ్చేశారు. అయితే ఇంటర్మీడియట్‌ కోర్సులైతే ప్రారంభించిన ప్రభుత్వం మొదటి సంవత్సరం అసలు లెక్చరర్లనే ఇవ్వలేదు. అవే పాఠశాలల్లో ఉన్న సీనియర్‌ టీచర్లనే పాఠాలు చెప్పాలని ఆదేశించింది. దీంతో చదువు సక్రమంగా సాగలేదు. ఈ సీనియర్‌ టీచర్లకు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌గా పదోన్నతి కల్పిస్తామని మాట తప్పింది. తీరా 2023-24 విద్యా సంవత్సరంలో 1754 మందిని పీజీటీలుగా హైస్కూల్‌ ప్లస్‌లలో నియమించింది. అంటే ఒక ఏడాది టీచర్లు, లెక్చరర్లు లేకుండానే బోధన చేయించిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. ఇక ఇంటర్మీడియట్‌ కోర్సులకు కచ్చితంగా అవసరమైన ల్యాబ్‌లు ఒక్క పాఠశాలలో కూడా ఏర్పాటుచేయలేదు. హైస్కూల్‌ ప్లస్‌లలో చదివిన బాలికలకు అసలు ల్యాబ్‌లు అంటే ఏంటో చివరి ఏడాది ప్రాక్టికల్స్‌ వరకూ తెలియదు. ఇక పుస్తకాలను కూడా సక్రమంగా పంపిణీ చేయలేదు. ఇలా బోధన నుంచి సౌకర్యాల వరకు ఏవీ లేకుండానే ఇంటర్మీడియట్‌ కోర్సులు ప్రారంభించి జగన్‌ దృష్టిలో మెప్పు పొందిన పాఠశాల విద్యాశాఖ, విద్యార్థులను ఉతీర్ణులు చేయడంలో విఫలమైంది. సీఎం మాట కోసం ప్రారంభించిన హైస్కూల్‌ ప్లస్‌లు ఫలితాల్లో ఘోరంగా విఫలం కావడంతో ఇది జగన్‌ ఫెయిల్యూర్‌గా విద్యార్థుల తల్లిదండ్రులు అభివర్ణిస్తున్నారు.

Updated Date - Apr 29 , 2024 | 04:22 AM