Share News

గొడ్డలి వేటు వేసి.. నంగనాచి కబుర్లు

ABN , Publish Date - Mar 29 , 2024 | 06:23 AM

సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్యపై సీఎం జగన్‌రెడ్డి నంగనాచి కబుర్లు చెబుతుండడం చూస్తుంటే నవ్వొస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పులివెందులలో ఆయన మాట్లాడిన తీరు హాలీవుడ్‌.. బాలీవుడ్‌ స్థాయి నటనను మించిపోయిందని

గొడ్డలి వేటు వేసి.. నంగనాచి కబుర్లు

సీఎంగా తొలి సంతకం మెగా డీఎస్సీపైనే

వివేకా హత్యపై జగన్‌ మాటలకు నవ్వొస్తోంది: చంద్రబాబు

ఆయన నటన హాలీవుడ్‌ను మించిపోయింది.. తొలుత గుండెపోటన్నారు.. తర్వాత రక్తపు వాంతులు

చివరికి గొడ్డలిపోటని తేలినా నారాసుర రక్త చరిత్ర అంటూ దుష్ప్రచారం

ఆయన చెల్లెళ్లను నేను మేనేజ్‌ చేస్తున్నానట!.. కట్టుకథలకు జనం మోసపోరు

జగనాసుర వధకు గడువు 46 రోజులే.. ఈ సీఎం ఓ మానసిక రోగి

బడుగు, బలహీన వర్గాల ద్రోహి.. నిరుద్యోగుల సంఖ్యను పెంచేశాడు

దీంతో వారు డ్రగ్స్‌ బాట పట్టారు.. ఐదేళ్లలో అన్ని వర్గాలకూ అన్యాయం

అందరూ గుర్తుపెట్టుకుని ఓటేయాలి.. సూపర్‌ సిక్స్‌తో అందరికీ న్యాయం

టీడీపీ అధినేత ప్రకటన.. ఉమ్మడి అనంతలో 3 చోట్ల ప్రజాగళం సభలు

ఐదేళ్లలో ఏం కోల్పోయారో, ఎంత నష్టపోయారో ఆడబిడ్డలంతా ఆలోచించుకోవాలి. ఒక అహంకారి విధ్వంసంతో రాష్ర్టాన్ని లూటీ చేసి, పేదలను నిరుపేదలను చేశాడు. ఆ దుర్మార్గుడి అంతుచూసే సమయం వచ్చింది.

మద్యపాన నిషేధం అమలు చేయకపోతే ఓటు అడగనని చెప్పాడా.. లేదా? ఇప్పుడు ఓటు అడుగుతున్నాడా.. లేదా? ఇలాంటి వాళ్లకు ఓట్లు వేస్తారా..? అందుకే నిలదీయమంటున్నా.

నిరుద్యోగుల సంఖ్యను పెంచిన ఘనత జగన్‌దే. ఖాళీగా ఉన్న యువత నిరుత్సాహానికి గురవుతోంది. తద్వారా మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారు. యువతను చెడుదారిలో పెట్టి, జాతిని నిర్వీర్యం చేసిన దుర్మార్గుడు జగన్‌.

అనంతపురం కియ మన బ్రాండ్‌.. పెట్టుబడులు ఆకర్షించి, యువతకు ఉద్యోగాలివ్వడం మన బ్రాండ్‌. జాకీ పారిపోవడం.. పెట్టుబడులను తరిమేయడం జగన్‌రెడ్డి బ్రాండ్‌.

- చంద్రబాబు

అనంతపురం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్యపై సీఎం జగన్‌రెడ్డి నంగనాచి కబుర్లు చెబుతుండడం చూస్తుంటే నవ్వొస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పులివెందులలో ఆయన మాట్లాడిన తీరు హాలీవుడ్‌.. బాలీవుడ్‌ స్థాయి నటనను మించిపోయిందని ఎద్దేవాచేశారు. మనం ‘మహాశక్తి’తో ఆడబిడ్డలను గౌరవిస్తుంటే.. జగన్‌ సొంత చెల్లెళ్ల పుట్టుకనే ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు, శింగనమల, కదిరి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. జగనాసుర వధకు గడువు 46 రోజులేనని.. ప్రజాగళం సభలకు వస్తున్న ప్రజా ఉధృతే ఈ విషయం చెబుతోందని చెప్పారు. మే 13న ఓట్ల సునామీ రాబోతోందని.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్లలో రాష్ర్టానికి, అన్ని వర్గాల ప్రజలకు జరిగిన అన్యాయం ప్రతి ఇంట్లో చర్చ జరగాలని.. ఈ అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుని మరీ ఓటు వేయాలని కోరారు. ఈ ఎన్నికల్లో ప్రజలు గెలవాలని, రాష్ట్రం నిలబడాలని అన్నారు. మీ బిడ్డల జీవితాలు బాగుపడాలంటే వైసీపీ అరాచక పాలనకు అంతం పలకాలని ప్రజలకు పిలుపిచ్చారు. జగన్‌రెడ్డి కట్టుకథలకు మోసపోయేందుకు సిద్ధంగా లేరన్నారు. రాబోయేది ఎన్టీయే ప్రభుత్వమేనని, కేంద్రంలో 410 ఎంపీ సీట్లు, రాష్ట్రంలో 160కిపైగా ఎమ్మెల్యే సీట్లు, 24 ఎంపీ సీట్లు గెలుస్తున్నామని చెప్పారు. ఇంకా ఏమన్నారంటే..

అందరినీ నేనే మేనేజ్‌ చేస్తున్నానట!

2019 మార్చి 15న జగన్‌ టీవీలో వివేకాది గుండెపోటు అని చూపించారు. ఆ తర్వాత గుండెపోటు కాదు.. రక్తపు వాంతులు అన్నారు. అనంతరం గొడ్డలిపోటు అన్నారు. చివరగా నా చేతిలో గొడ్డలిపెట్టి నారాసుర రక్తచరిత్ర అంటూ దొంగ సాక్షిలో నా బొమ్మ వేశారు. తర్వాత బెంగళూరులో ఆస్తికి సంబంధించి సెటిల్‌మెంట్లే హత్యకు కారణమన్నారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదు.. సీబీఐ విచారణ కావాలన్నారు. హైకోర్టుకు వెళ్లి గ్యాగ్‌ ఆర్డర్‌ తెచ్చుకున్నారు. అధికారంలోకి రాగానే సీబీఐ విచారణ అవసరం లేదని పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు. తన తండ్రిని హత్య చేసిన హంతుకులు ఎవరో పట్టుకోవాల్సిందేనని వివేకా కుమార్తె సునీత పోరాడారు. రెండో వివాహమే కారణమని అదే దొంగ సాక్షిలో కథనాలు వచ్చాయి. ఆస్తిలో అల్లుడితో విరోధమే వివేకా హత్యకు కారణమన్నారు. కూతురే హత్య చేసిందని మరో మారు చెబుతారు. సునీల్‌ యాదవ్‌ తల్లిని వివేకా లైంగికంగా వేధించినందునే చంపేశారని అన్నారు. నిన్న పులివెందుల వచ్చిన జగన్‌.. బాబాయిని ఎవరో చంపేసి తన మీదకు నెట్టేస్తున్నారని నంగనాచి కబుర్లు చెప్పాడు. ఆయన ఇద్దరు చెల్లెళ్లను నేను మేనేజ్‌ చేస్తున్నానని కథలు చెబుతున్నాడు.

ప్రజాగళం సూపర్‌ హిట్‌.. సిద్ధం అట్టర్‌ ఫ్లాప్‌

ప్రజాగళం సభలు సూపర్‌ డూపర్‌ హిట్‌ అవుతున్నాయి. మధ్యాహ్నం మండుటెండలో పెద్ద సంఖ్యలో హాజరై.. మనమంతా ఎన్నికల యుద్ధానికి సిద్ధమని జనం చెబుతున్నారు. అటు వైసీపీ సిద్ధం సభలు ఎక్కడ చూసినా అట్టర్‌ ఫ్లాప్‌ అవుతున్నాయి. విధ్వంసమైన రాష్ట్రం పుననిర్మాణం కోసం మాకు మద్దతివ్వండి. వైసీపీ నాయకులు ఇప్పటి వరకు బెదిరించారు. ఇక అవి చెల్లవు. ఎన్నికల కమిషన్‌ వచ్చింది. భయపడాల్సిన పనిలేదు. గత ఎన్నికలకు ముందు కరెంటు చార్జీలు తగ్గిస్తానని జగన్‌ హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే ఇప్పటికి 9 సార్లు చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపాడు. గతంలో రూ.200 కరెంటు బిల్లు ఉండేది. ఇప్పుడు రూ.500 నుంచి రూ.1000 వరకూ వస్తోంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించి రైతు మెడలకు ఉరితాళ్లు వేసిన దుర్మార్గుడు జగన్‌. మద్యం గురించి గతంలో ఎప్పుడూ ఇంత చర్చ జరగలేదు. మీ బలహీనతను జగన్‌ బలంగా మార్చుకున్నారు. ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి ప్రజలను మోసం చేశాడు. మద్యపాన నిషేధం దేవుడికెరుక. జగన్‌ ఆదాయం కోసం నాసిరకం మద్యం ఇస్తున్నాడు. మీ ఆరోగ్యం పాడైపోయింది. కొంత మంది చనిపోతున్నారు. గతంలో క్వార్టర్‌ బాటిల్‌ రూ.60 ఉంది. దానిని రూ.200కు పెంచారు. క్వార్టర్‌పై రోజుకు రూ.140 కొట్టేస్తున్న జలగ జగన్‌రెడ్డి. ఆ డబ్బులు తాడేపల్లి ప్యాలెస్‌ కొంపకు వెళ్తూనే ఉంటాయి.

హోదా తేకపోవడమే విశ్వసనీయతా!

సాగునీటి ప్రాజెక్టుల కోసం టీడీపీ హయాంలో ఐదేళ్లలో రూ.68 వేల కోట్లు ఖర్చుపెట్టాం. రాయలసీమకు రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టాం. జగన్‌ కనీసం రూ.2 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. రాయలసీమ ద్రోహి. 95 శాతం హామీలు అమలు చేశానని అబద్ధాలు వల్లిస్తున్నాడు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తేకపోవడమేనా జగన్‌రెడ్డి విశ్వసనీయత..? మద్యపాన నిషేధం అమలు చేయకపోవడం, వారంలో సీపీఎ్‌సను రద్దు చేయకపోవడం, ఏటా జాబ్‌ కేలెండర్‌ ఇవ్వకపోవడం, ఏ ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వకపోవడం, మెగా డీఎస్సీ ఇవ్వకపోవడం, కరెంట్‌ చార్జీలు పెంచడం.. ఇదేనా విశ్వసనీయత..? పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పి, గోదావరిలో ముంచాడు. దళితులందరికీ న్యాయం చేయాలనే లక్ష్యంతో 1996-97లో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ తీసుకొస్తే.. దాన్ని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నాశనం చేశారు. దళితులకు న్యాయం చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్‌.. వారి గొంతు కోశాడు. దళితుల కోసం అమలు చేసిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేశాడు. సబ్‌ ప్లాన్‌ నిధులను దారి మళ్లించాడు. విదేశాల్లో చదువుకునే వారికి అంబేడ్కర్‌ విదేశీ విద్యను మేం తీసుకొస్తే... అంబేడ్కర్‌ పేరు తీసేసి తన పేరు పెట్టుకున్నాడు. ఆయన పాలనలో దళితులకు స్వాతంత్య్రం లేదు. మాట్లాడే పరిస్థితి లేదు. ఆరు వేల మందికిపైగా దళితులపై తప్పుడు కేసులు పెట్టిన చరిత్ర జగన్‌ది. కాకినాడలో ఏకంగా వైసీపీ ఎమ్మెల్సీ ఓ దళితుడిని చంపి డోర్‌ డెలివరీ చేస్తే, ఆ హంతకుడి భుజాలపై చేతులు వేసి ప్రోత్సహించిన దళిత ద్రోహి జగన్‌. బీసీలకు అమలు చేసిన 30కిపైగా పథకాలు రద్దు చేశాడు. మేమొచ్చాక వాటన్నిటినీ పునరుద్ధరిస్తాం.

రూ.10 ఇచ్చి.. రూ.100 దోచేశాడు...

ఒక్క చాన్స్‌ అన్నాడు. బుగ్గలు నిమిరాడు. నెత్తిన చెయ్యి పెట్టాడు. ముద్దులు పెట్టాడు. అధికారంలోకి రాగానే పిడిగుద్దులు గుద్దుతున్నాడు. రూ.10 ఇచ్చి.. రూ.100 దోచేశాడు. రావణుడు తనకంటే గొప్పోడు లేడన్నాడు. చివరికి రాముడి చేతుల్లో ఏమయ్యాడు? ఈ సీఎం ముసుగు వీరుడు. పరదాల చాటున వచ్చే కరకట్ట కమలహాసన్‌ బుల్లెట్‌ బస్సులో బయల్దేరాడు. నా మాదిరిగా రోడ్డు మీదకు వస్తే వాస్తవాలు తెలుస్తాయి. కదిరిలో కేక వేస్తే పులివెందులలో వినబడుతుంది. పులివెందులలో గొడ్డలి వేటు కదిరికి వినిపించింది. ఆ గొడ్డలి తయారైంది ఈ కదిరిలోనే కదా..?మా చిన్నాన్నను ఎవరో చంపారో దేవుడికి తెలుసంటున్న జగన్‌.. ముద్దాయిని వెంటపెట్టుకుని ప్రచారం చేస్తున్న డ్రామాలరాయుడు. ఇలాంటి సీఎం మనకు అవసరమా..?

రాష్ట్రం కోసమే ఎన్డీయేలోకి

మైనారిటీల హక్కులకు భంగం కలగదు

రంజాన్‌ నెలలో హామీ ఇస్తున్నా: బాబు

కదిరి, మార్చి 28: రాష్ట్రం బాగు కోసమే తాము ఎన్డీయేతో కలిశామని.. అయినా మైనారిటీల హక్కులకు ఢోకా ఉండదని టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరి డిగ్రీ కళాశాల మైదానంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో ఆయన పాల్గొన్నారు. తమ హయాంలో మైనారిటీల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశామన్నారు. ‘రంజాన్‌ మాసంలో హామీ ఇస్తున్నా.. ఒక కులం, ఒక మతం, ఒక వర్గానికి చెందిన వ్యక్తిని కాను. నేను అందరివాడిని’ అని స్పష్టం చేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

జాబ్‌ కేలెండర్‌ ఇవ్వకుండా..

బటన్‌ నొక్కానని చెప్పే జగన్‌రెడ్డి.. బటన్‌ నొక్కి వేస్తున్నదెంత..? బొక్కుతున్నదెంత..? చెత్తపై పన్నువేసే చెత్త ముఖ్యమంత్రి. రాష్ర్టాన్ని సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకున్న మానసిక రోగి. జాబ్‌ కేలెండర్‌ ఇవ్వలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా అర్హుడా? టీడీపీ వస్తేనే పెట్టుబడులు... ఉద్యోగాలు వస్తాయి. వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి, ఫ్యాన్‌ను డస్ట్‌ బిన్‌లో వేయాలి. ఎన్నికలకు ముందే రిజల్ట్‌ వచ్చేసింది. ఈ అన్‌స్టాపబుల్‌ను ఎవరూ ఆపలేరు.

Updated Date - Mar 29 , 2024 | 06:23 AM