Share News

అన్నీ తానే చేసినట్లుగా..!

ABN , Publish Date - Apr 29 , 2024 | 04:25 AM

రాష్ట్రంలో ఇంతకుముందు ఉన్న ఏ ప్రభుత్వమూ చేయని విధంగా... అన్నీ తానే చేసినట్లుగా సీఎం జగన్‌ గొప్పలు పోయారు.

అన్నీ తానే చేసినట్లుగా..!

శ్రుతి మించిన జగన్‌ సొంత గొప్పలు

చంద్రముఖి, వదల బొమ్మాళీ డైలాగులను ఏ మాత్రం పట్టించుకోని జనం

తాడిపత్రి, కందుకూరు, వెంకటగిరిలో ప్రచార సభలు

అనంతపురం, వెంకటగిరి, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి)/ కందుకూరు: రాష్ట్రంలో ఇంతకుముందు ఉన్న ఏ ప్రభుత్వమూ చేయని విధంగా... అన్నీ తానే చేసినట్లుగా సీఎం జగన్‌ గొప్పలు పోయారు. సాధ్యంకాని హామీలతో చంద్రబాబు ఎన్నికల ప్రచారానికొస్తున్నారని, బాబును నమ్మడమంటే పులి నోట్లో తలకాయ పెట్టడమేనని, చంద్రముఖిని నిద్రలేపడమేనని.. వదల బొమ్మాళీ... వదల అంటూ ఆయన చెప్పిన డైలాగులకు జనం నుంచి స్పందన లేదు. దేవుడి దయతో గత మేనిఫెస్టోలో పెట్టిన 99 శాతం పథకాలు అమలు చేశామని అబద్ధాలు చెప్పుకొచ్చారు. ఆదివారం అనంతపురం జిల్లా తాడిపత్రి, నెల్లూరు జిల్లా కందుకూరు, తిరుపతి జిల్లా వెంకటగిరిలో జరిగిన సభల్లో ఆయన ప్రసంగాలు సొంత గొప్పలతో నిండిపోయాయి. 2.31 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశానని, మహిళా సాధికారతను తానే సాధించినట్లు గొప్పలుపోయారు. ఎన్డీయే కూటమిని 2014లో గెలిపిస్తే... ప్రత్యేక హోదా తీసుకురాలేదని అన్నారు.

హెలిప్యాడ్‌ వద్ద యువకుడి హల్‌చల్‌

ఇటీవల విజయవాడ ర్యాలీలో గులకరాయి ఘటన మరువకముందే తిరుపతి జిల్లా వెంకటగిరిలో సీఎం తిరుగుప్రయాణమవుతుండగా, హెలిప్యాడ్‌ వద్దకు ఓ యువకుడు దూసుకొచ్చాడు. గమనించిన పోలీసు అధికారులు అతడిని గట్టిగా పట్టుకున్నారు. హెలిప్యాడ్‌ నుంచి దూరంగా తీసుకొచ్చి బాంబ్‌స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జగన్‌తో సెల్ఫీ కోసం ఆయన ఉన్న హెలిప్యాడ్‌ వద్దకు పరుగు తీశానని పెంచలయ్య.. పోలీసులకు తెలిపినట్టు సమాచారం.

మండే ఎండలో.. నడి రోడ్డుపై...

జగన్‌ తాడిపత్రి పర్యటన... ప్రజల ఓపికకు పరీక్ష పెట్టింది. పట్టణ నడిబొడ్డున సభ ఏర్పాటు చేయడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు గంటలకొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. ట్రాఫిక్‌లో ఇరుక్కున్న వారి పరిస్థితి మరీ దయనీయం. మండే ఎండలో.. ఎటూ వెళ్లలేక నరకం చూశారు. జగన్‌ సభకు హాజరైన ఆ పార్టీ కార్యకర్తలు జగన్‌ ప్రసంగం మొదలుపెట్టగానే వెనుదిరిగిపోయారు. సీఎం సభను విజయవంతం చేయాలని మండలస్థాయి నాయకులకు రూ.30 లక్షలు ఎమ్మెల్యే అభ్యర్థి అందించినట్టు సమాచారం. ఇక కందుకూరులో పట్టణాన్ని పోలీసులు తమ చేతుల్లోకి తీసుకుని ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

‘మహీధరన్న ఏడీ.. పిలుచు రండి!’

కందుకూరు సీటును వేరే వారికి కేటాయించడంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యే మహీధరరెడ్డి కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో కందుకూరు వచ్చిన జగన్‌ను మర్యాదపూర్వకంగా హెలిప్యాడ్‌ వద్ద కలిసి.. వెనుదిరిగారు. జగన్‌ కారు ఎక్కుతూ మహీధరరెడ్డి గురించి ఆరా తీశారు. ఆయన వెళ్లిపోయారని ఎవరో చెప్పడంతో కారు ఆపారు. మహీధరన్నను వెతికి తీసుకుని రావాలని తన సెక్యూరిటీని పరుగు పెట్టించారు. మొహమాటం మీద కారు ఎక్కిన మహీధర్‌తో ‘మహీ ద గ్రేట్‌..’ అని వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ సమాచారం. తాను ఏం గ్రేట్‌ అని మహీధరరెడ్డి అనగా ‘అడగ్గానే టికెట్‌ త్యాగం చేసి పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నా’వని అన్నారట. ‘బుర్రా (బుర్రా మధుసూదన్‌ యాదవ్‌, కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి) పికప్‌ అయ్యాడా’ అని అడగ్గా, మహీధర్‌రెడ్డి ముక్తసరిగా స్పందించారని సమాచారం.

కేతిరెడ్డి మనసు వెన్నట: తాడిపత్రి సిటింగ్‌ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట కటువవని, మనసు మాత్రం వెన్న అని సీఎం జగన్‌ తాడిపత్రి సభలో కితాబు ఇచ్చారు.

Updated Date - Apr 29 , 2024 | 04:25 AM