Share News

99% మోసం

ABN , Publish Date - Apr 29 , 2024 | 04:26 AM

‘‘మనందరి ప్రభుత్వం 99శాతం హామీలు అమలుచేసింది. మేనిఫెస్టోలో పెట్టిన వాటిలో దాదాపుగా అన్నీ పూర్తిచేశాం. అక్కడక్కడ చిన్నాచితక హామీలు మాత్రమే చేయలేకపోయాం.

99% మోసం

హామీల్లో 99శాతం నెరవేర్చామన్న జగన్‌

హోదా సహా పెద్ద హామీలన్నీ ఒక్క శాతమేనట

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘‘మనందరి ప్రభుత్వం 99శాతం హామీలు అమలుచేసింది. మేనిఫెస్టోలో పెట్టిన వాటిలో దాదాపుగా అన్నీ పూర్తిచేశాం. అక్కడక్కడ చిన్నాచితక హామీలు మాత్రమే చేయలేకపోయాం. మన ప్రభుత్వం వల్ల అందరికీ మేలు జరిగింది’’.. 2019 ఎన్నికల మేనిఫెస్టోపై జగన్‌ మాటిదీ. ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలుచేసి చూపించామని ఘనంగా ప్రకటించుకున్నారాయన. కానీ ఆ 99శాతం లెక్క ఎలా తీశారు? ఏ హామీకి ఎంత వెయిటేజీ ఇచ్చారు? ఆ ఒక్కశాతంలోనే మహిళలకు చేసిన ప్రధాన వాగ్దానం.. మద్యనిషేధం ఉంది. యువతకు చెప్పిన మెగా డీఎస్సీ భరోసా ఉంది. నిజానికి, ఇలాంటి హామీలే 2019 ఎన్నికల్లో జగన్‌కు అధికారాన్ని కట్టబెట్టాయి. అయితే, అంత పెద్ద హామీలను జగన్‌ చిన్నవిగా మార్చేశారు. ఒక్కో హామీకి ఒక్క శాతం కూడా తన అంచనాలో వెయిటేజీ ఇవ్వలేదు. మొత్తం కలిపినా కేవలం ఒక్క శాతమేనని, అసలు అవి కూడా ఒక హామీలేనా? అన్నట్టు కూరలో కరివేపాకులా తీసిపారేశారు.

అమలు చేసిన 99శాతం ఏంటి?

వైసీపీ ఇచ్చిన హామీల్లో నెరవేర్చిన వాటికంటే నెరవేర్చనవే ఎక్కువ ఉన్నాయి. ఆ నెరవేర్చినవి కూడా పెద్దగా ప్రభుత్వంపై భారం పడనివే. తెలుగుదేశం ప్రభుత్వంలో సామాజిక పెన్షన్లను ఒకేసారి రూ.వెయ్యి పెంచితే, జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లలో నాలుగు విడతలుగా రూ.వెయ్యి పెంచింది. అది కూడా చివరి ఏడాది వరకూ పెంచుతూనే ఉంది. ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం ఉండని అర్చకులకు రిటైర్‌మెంట్‌ విధానాన్ని ఈ ప్రభుత్వం రద్దుచేసింది. ఆర్టీసీలో ఎక్కువ ప్రయోజనాలు పొందే కార్పొరేషన్‌ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి వారికి ఇచ్చే ఆర్థిక ప్రయోజనాలను కుదించింది. చేయూత, కాపునేస్తం, అమ్మఒడి పథకాలను ఐదేళ్లు ఇస్తామని హామీ ఇచ్చి, నాలుగేళ్లు ఇచ్చి చేతులు దులుపుకొంది. కేంద్రం ఇచ్చే రూ.6వేలతో కలిపి రైతుభరోసా అమలుచేస్తోంది. 2.3లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని, కేవలం 5వేల ఉద్యోగాలు ఇచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంద శాతం ఇస్తామని హామీ ఇచ్చి, ఏటా మూడు త్రైమాసికాలు పెండింగ్‌ పెడుతోంది. వసతి దీవెన నగదు ఏటా రెండు విడతలకుగాను ఒక్క విడతే ఇచ్చింది. ఏటా 5లక్షలు చొప్పున 25లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి, ఐదేళ్లలో 5లక్షల ఇళ్లు కూడా కట్టలేకపోయింది. ఇలా ఏ హామీని సక్రమంగా అమలుచేయని జగన్‌ ప్రభుత్వం 99శాతం హామీల అమలు అని ఎలా ప్రకటించుకుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. పోనీ జగన్‌ చెప్పినట్లుగా 99శాతం హామీలు నెరవేర్చారు అనుకుంటే అమలుచేసిన హామీల్లో దేనికెంతో జగన్‌ స్పష్టంగా చెప్పి ఉండాల్సింది. అలా చెప్తే అసలు గుట్టు బయటపడుతుంది కాబట్టే 99శాతం అని పాట పాడుతున్న ఆయన వాటిలో చేసినవేంటి అనేది మాత్రం చెప్పడం లేదు.

చిన్నబోయిన మద్య నిషేధం

సంపూర్ణ మద్య నిషేధం హామీ 2019 ఎన్నికల్లో అత్యంత కీలకంగా పనిచేసింది. మద్యం లేకుండా చేస్తానన్న జగన్‌ హామీ మహిళలను ఆకట్టుకుంది. మద్యంతో కుటుంబాలు ఛిద్రమౌతున్న నేపథ్యంలో దాని నుంచి బయటపడొచ్చని లక్షలాది మంది మహిళలు ఆశించారు. అలాంటి హామీని అధికారంలోకి రాగానే జగన్‌ తుంగలో తొక్కారు. ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపట్టి నిషేధిస్తుందని ప్రకటించిన ఆయన.. దశల వారీగా అమ్మకాలు పెంచారు. ఉమ్మడి ఏపీలోనూ లేనివిధంగా 1.24లక్షల కోట్ల మద్యాన్ని విక్రయించిన తొలి సీఎంగా రికార్డుకెక్కారు. మద్యనిషేధం చేశాకే ఓట్లు అడుగుతానన్న జగన్‌ మాటతప్పి, మళ్లీ ఓట్లు అడుగుతున్నారు. ఇప్పుడు ఈ హామీని అతి చిన్న హామీగా తీసిపారేశారు. అసలు ఇది హామీనే కాదన్నట్టుగా ఒక శాతంలో పడేశారు.

మొత్తం జీతాలు ఇస్తున్నారా?

ఏపీఎ్‌సఆర్టీసీ సిబ్బంది 2020 జనవరి నుంచి విలీనమైనా 2022 సెప్టెంబరు నుంచే 49 వేల మందికి ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు వస్తున్నాయి. అయితే ఆర్టీసీ ఆదా యం నుంచి సుమారు రూ.125 కోట్లు ప్రతినెలా ప్రభుత్వం తీసుకుంటోంది. సిబ్బంది జీతాలకు నెలకు రూ.285 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది. ఆ రూ.125 కోట్లు పోను ప్రతి నెలా రూ.160కోట్లు మాత్రమే చెల్లిస్తోంది. అయితే ప్రతినెలా 300 కోట్లు చొప్పున ఏడాదికి 3,600 కోట్లు తానే భరిస్తున్నట్లు జగన్‌ చెప్పారు. ‘మీరిచ్చేది ఎక్కువ చేసి చెబుతారు. మా నుంచి తీసుకునేది కూడా చెప్పాలిగా. దీన్ని అబద్ధం గాక మరేమంటారు’ అంటూ ఆర్టీసీ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.

ఒక్క వారంలో ఓపీఎస్‌ అన్నావే!

‘అధికారంలోకి వచ్చాక ఒక్క వారంలో సీపీఎస్‌ రద్దుచేస్తానన్నా. దాని గురించి నాకు వదిలేయండి. ఒక్క వారంలో అయిపోతుంది’ అని 2019 ఎన్నికల సమయంలో బహిరంగంగా అనేకసార్లు ప్రకటించిన జగన్‌ దానిపై మాట తప్పారు. నాలుగున్నరేళ్లు దానిపై మౌన వ్రతం చేశారు. ఇక ఎన్నికలు వస్తున్నాయన్న తరుణంలో పాత పెన్షన్‌ విధానం(ఓపీఎస్‌) స్థానంలో గ్యారెంటీడ్‌ పెన్షన్‌ విధానం(జీపీఎస్‌) తెరపైకి తెచ్చారు. ఓపీఎస్సే కావాలని రోడ్డెక్కిన ప్రభుత్వ ఉద్యోగులపై నిర్దాక్షిణ్యంగా కేసులు పెట్టించారు. ఓపీఎస్‌ డిమాండ్‌తో విజయవాడలో భారీ ర్యాలీ చేసిన ఉద్యోగ సంఘాల నేతలపై ఉక్కుపాదం మోపారు. చివరికి ‘అవగాహన లేక అప్పట్లో ఓపీఎస్‌ హామీ ఇచ్చాం’ అని ఒక్క మాటతో తేల్చేశారు. లక్షలాది మంది ఉద్యోగులకు ఇచ్చిన ఓపీఎస్‌ హామీని ఒక్క శాతంలో ఒక మూలన పడేశారు.

25లక్షల ఇళ్లు ఎక్కడ కట్టావు?

‘ఐదేళ్లలో 25లక్షల పక్కా ఇళ్లు కట్టిస్తాం. ఒక్కో కుటుంబానికి రూ.2లక్షల నుంచి రూ.5లక్షల లబ్ధి చేకూరుస్తాం’ అని 2019 మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన వైసీపీ అందులో ఐదోవంతు కూడా నెరవేర్చలేకపోయింది. ఐదేళ్లలో పట్టుమని 5లక్షల ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తిచేయలేదు. ఎన్నికలకు ముందు ప్రభుత్వమే ఇళ్లు కట్టిస్తుందని చెప్పి, తర్వాత వృద్ధులకు మాత్రమే ప్రభుత్వం కట్టించి ఇస్తుందని, మిగిలినవారు ఎవరికి వారు కట్టుకోవాలని మాట మార్చింది. పలు పథకాల కింద కేంద్రప్రభుత్వమే పెద్దఎత్తున ఇళ్లు మంజూరుచేసినా వాటిని లబ్ధిదారులకు ఇచ్చి కట్టుకునేలా చేయడంలోనూ విఫలమైంది. ఇళ్ల స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకొంది.

జాబ్‌ కేలెండర్‌ ఎక్కడ?

గత ఎన్నికల్లో మరో ఆకర్షణీయమైన హామీ జాబ్‌ కేలెండర్‌. ఏటా జనవరి 1న జాబ్‌ కేలెండర్‌ విడుదల చేస్తామని మేనిఫెస్టోలో జగన్‌ పెట్టారు. కానీ ఐదేళ్లలో ఒక్కసారి కూడా జాబ్‌ కేలెండర్‌ విడుదల కాలేదు. ఒక ఏడాది జూన్‌లో జాబ్‌ కేలెండర్‌ విడుదల చేసినా దానిని పూర్తిచేయలేదు. కనీసం ఎన్నికల సంవత్సరంలోనూ జాబ్‌ కేలెండర్‌ ప్రస్తావన తేలేదు. ప్రభుత్వంలో 2.3 లక్షల ఖాళీలు భర్తీ చేస్తానన్న జగన్‌ అధికారంలోకి వచ్చాక ఏపీపీఎస్సీ ద్వారా ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 5వేలు. గ్రూప్‌2 ఉద్యోగం ఒక్కటీ ఇవ్వని తొలి ప్రభుత్వం కూడా ఇదే. ఇక మెగా డీఎస్సీ వేసి 23వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తానన్న జగన్‌... ఎన్నికల ముందు హడావిడిగా 6,100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వగా, కోడ్‌ వల్ల అది ఆగిపోయింది. లక్షలాది మంది నిరుద్యోగులకు సంబంధించిన ఇంత పెద్ద హామీని జగన్‌ ఆ నెరవేర్చని ఒక్క శాతం హామీల్లో పెట్టి, ఇది హామీయే కాదన్నట్టుగా అప్రాధాన్యంగా మార్చేశారు.

పోలవరం, ప్రత్యేక హోదా

రాష్ర్టానికి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రం దిశ మార్చేస్తుందనుకున్న ప్రత్యేక హోదా హామీలను జగన్‌ అత్యంత చిన్న హామీలుగా మార్చేసి పక్కనపెట్టారు. పోలవరంపై అనేకసార్లు అసెంబ్లీ సాక్షిగా టార్గెట్లు ప్రకటించిన ఆయన చివరికి మాట తప్పారు. ఇక తమవల్ల కాదనుకున్నారో ఏమోగానీ ఎప్పటికి పూర్తిచేస్తామో నిర్దిష్టంగా చెప్పలేం అని ప్రకటించేశారు. ఇక ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష నేతగా రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టిన అధికారంలోకి వచ్చిన జగన్‌.. రెండో రోజే కాడి వదిలేశారు.

Updated Date - Apr 29 , 2024 | 04:26 AM