Chirala Politics: జగన్‌ను బెంబేలెత్తించారు కదయ్యా.. ఒక్క ఫ్లెక్సీతో వైసీపీని టెన్షన్ పెట్టిన ఇద్దరు కుర్రాళ్లు..!
ABN , First Publish Date - 2023-02-11T11:56:19+05:30 IST
చీరాల రాజకీయం (Chirala Politics) ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి. గతంలో నెలకొన్న పరిస్థితులు అందుకు దర్పణంపడుతున్నాయి. తాజాగా అలాంటి మరో వ్యవహారం రాజకీయ వర్గాల్లో..
చీరాల రాజకీయం (Chirala Politics) ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి. గతంలో నెలకొన్న పరిస్థితులు అందుకు దర్పణంపడుతున్నాయి. తాజాగా అలాంటి మరో వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ (Chirala Ex MLA Amanchi Krishna Mohan) వైసీపీ పర్చూరు సమన్వయకర్తగా (YCP Parchuru ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన అన్న ఆమంచి స్వాములు ఫొటోతో జనసేన ఫ్లెక్సీ ఏర్పాటు కావడం అనేక అనుమానాలకు తావి స్తోంది. వేటపాలెం మండలం పందిళ్లపల్లి సమీపంలో 216 జాతీయ రహదారి కూడలి (వై జంక్షన్) వద్ద జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌తో కాపునేత ఆమంచి స్వాములు కలిసి పార్టీ గుర్తులతో ఉన్న ఫ్లెక్సీ దర్శనమిచ్చింది. గురువారం రాత్రి దీన్ని ఇద్దరు యువకులు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అది శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
వైసీపీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, కాపునేతగా గుర్తింపు పొందిన ఆమంచి స్వాములు (శ్రీనివాసరావు) అన్నదమ్ములు. కృష్ణమోహన్ రాజకీయ రంగ ప్రవేశం నుంచి స్వాములు వెనకుండి సహకరిస్తూ వస్తున్నారు. అయితే కొంతకాలంగా ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేవనే ప్రచారం జరుగుతోంది. తర్వాత వారిద్దరూ వేసే అడుగులు కూడా అందుకు బలాన్నిస్తూ సాగుతున్నాయి. వైసీపీ పర్చూరు సమన్వయకర్తగా కృష్ణమోహన్ బాధ్యతలు తీసుకునే క్రమంలో కూడా వారి మధ్య ఆ దూరం ప్రస్ఫుటమైంది. టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందన్న తరుణంలో పవన్ కల్యాణ్, స్వాములు ఫొటోలను కలిపి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం అందరిలోనూ చర్చనీయాంశమైంది. స్వాములు జనసేనలో చేరుతున్నారా, లేదా పవన్ కల్యాణ్‌పై ఉన్న అభిమానంతో కాపు నేత హోదాలో ఆయన ఫొటో వేశారా అన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ ఫ్లెక్సీకి, తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని జనసేనలో క్రియశీలకంగా పని చేస్తున్న కొందరు చెప్తున్నారు. ఒకవేళ కాపు నేతగా ఆ ఫొటో వేసి ఉండొచ్చని వారు అంటున్నారు. ప్రస్తుతం తాను ఏ రాజకీయ పార్టీలో క్రియాశీలకంగా లేనని స్వాములు తన సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. వైసీపీ తమకు ఒరగబెట్టిందేమీ లేదని, రెండు, మూడు నెలలు కొన్ని వ్యక్తిగత పనులున్నాయని ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటానని వారితో అన్నట్లు తెలిసింది. ఫ్లెక్సీలో ఫొటో అనేది తనపై ప్రేమ ఉన్నవాళ్లు పలుచోట్ల పలురకాలుగా వేసుకున్న సందర్భాలను ఆయన గుర్తు చేసినట్లు చెప్తున్నారు.