Share News

రోహిత్‌ కేసుపై పునర్విచారణ చేపడతాం

ABN , Publish Date - May 05 , 2024 | 05:25 AM

రోహిత్‌ వేముల కుటుంబానికి అండగా ఉంటామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. రోహిత్‌ తల్లి రాధిక వేముల.. శనివారం సీఎం రేవంత్‌ను

రోహిత్‌ కేసుపై పునర్విచారణ చేపడతాం
సీఎం రేవంత్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తున్న రోహిత్‌ తల్లి రాధిక

ఆ కుటుంబానికి అండగా ఉంటాం: సీఎం రేవంత్‌రెడ్డి

న్యాయం చేయాలని సీఎంకు రోహిత్‌ తల్లి రాధిక వినతి

హైదరాబాద్‌/రాయదుర్గం, మే 4 (ఆంధ్రజ్యోతి): రోహిత్‌ వేముల కుటుంబానికి అండగా ఉంటామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. రోహిత్‌ తల్లి రాధిక వేముల.. శనివారం సీఎం రేవంత్‌ను ఆయన నివాసంలో కలిశారు. తన కుమారుడి ఆత్మహత్య కేసు విషయమై పునర్విచారణ చేపట్టి, తగిన విధంగా న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు స్పందించిన సీఎం.. ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో రోహిత్‌ ఆత్మహత్య ఘటన తనను ఎంతగానో కలచి వేసిందని పేర్కొన్నారు. ఆ సమయంలోనే రాహుల్‌ గాంధీ హెచ్‌సీయూని సందర్శించి ఆ కుటుంబానికి అండగా ఉంటామని మాట ఇచ్చారని, ఆ మాటను నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కాగా, గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ మెయిన్‌ గేటు వద్ద వర్సిటీ విద్యార్థి సంఘం నాయకులతో కలిసి రోహిత్‌ తల్లి రాధిక విలేకరులతో మీడియాతో మాట్లాడారు. రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైన వారికి శిక్షపడే వరకూ పోరాడుతానని స్పష్టం చేశారు. కొంతమంది పోలీసులు బీజేపీకి అనుకూలంగా విచారణ చేపట్టారని, రోహిత్‌ కులంపై హైకోర్టుకు తప్పుడు రిపోర్టు ఇచ్చారని మండిపడ్డారు. చదవలేక రోహిత్‌ చనిపోయాడని పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై పునర్విచారణ చేపట్టాలని కోరగా, సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు.

Updated Date - May 05 , 2024 | 05:25 AM