Share News

సీఎం రేవంత్‌ మాటల్లో పగ, ప్రతీకారం

ABN , Publish Date - May 05 , 2024 | 05:23 AM

ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి, మంత్రులు వాడుతున్న భాష అసభ్యకరంగా ఉందని, సీఎం రేవంత్‌ రెడ్డి మాటల్లో పగ, ప్రతీకారమే కనిపిస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు

సీఎం రేవంత్‌ మాటల్లో పగ, ప్రతీకారం

సీఎం, మంత్రులది బూతు భాష

ప్రజలు అసహ్యించుకుంటున్నారు

హామీలను అమలు చేయకపోవడమే మార్పా?

మీట్‌ ద ప్రెస్‌లో బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌ రావు

హైదరాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి, మంత్రులు వాడుతున్న భాష అసభ్యకరంగా ఉందని, సీఎం రేవంత్‌ రెడ్డి మాటల్లో పగ, ప్రతీకారమే కనిపిస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. వాళ్ల భాషను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒక్కటే అమలు చేస్తున్నారని, ఇంకా అయిదు హామీలు అమలు కావడం లేదని, హామీలను అమలు చేయకపోవడమే మార్పా? అని ప్రశ్నించారు. ప్రజల్లో కాంగ్రెస్‌ పాలనపై అప్పుడే విరక్తి ఏర్పడిందన్నారు. శనివారం బషీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రైతులకు పెట్టుబడి సాయం అందేదని, ప్రస్తుతం రైతులకు ఇంకా రైతు భరోసా అందలేదన్నారు. గతంలో 80ు ప్రసవాలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగేవని, కేసీఆర్‌ కిట్లు అందేవని, ఇప్పుడు ఆవేమీ లేవని విమర్శించారు. పలు జిల్లాల్లో తాగునీటి సమస్య ఉందని, హైదరాబాద్‌లోనూ నీటి ట్యాంకర్లు కొనుక్కునే పరిస్థితి ఏర్పడిందని, కరెంటు కోతలు పెరిగాయని, ఇలా అన్నీ రంగాల్లోనూ మార్పు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను నమ్మించి మోసం చేస్తున్న కాంగ్రె్‌సను పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు శిక్షిస్తారన్నారు. చెక్‌బౌన్స్‌ అయితే శిక్ష పడుతుందని, ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఇచ్చిన బాండ్‌ పేపర్లు ఇప్పుడు బౌన్స్‌ అయ్యాయని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్‌ చేపట్టిన పనులకు వ్యతిరేకంగా పోవడమే రేవంత్‌ పనిగా పెట్టుకున్నారని, ఇప్పుడున్న జిల్లాల్లో మార్పులు చేస్తే ప్రజల నుంచి ఆగ్రహం తప్పదన్నారు.


పార్టీలు మారితే రాళ్లతో కొట్టాలన్నారు కదా!

ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారే వారిని రాళ్లతో కొట్టాలి అన్న సీఎం రేవంత్‌ రెడ్డి.. ఇప్పుడు తన పార్టీలోకి వస్తున్న వారికి కండువాలు కప్పి ఆహ్వానిస్తున్నారని, దీనికి ఏం సమాధానం చెబుతారని హరీశ్‌రావు ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన దానం నాగేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌ ఎంపీగా ఎలా పోటీ చేస్తారని నిలదీశారు. కేసీఆర్‌ బస్సు యాత్ర తరువాత ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని, ఎక్కువ పార్లమెంట్‌ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని హరీశ్‌ ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - May 05 , 2024 | 06:49 AM