Share News

మల్లన్నసాగర్‌లో అడుగంటుతున్న జలాలు

ABN , Publish Date - May 02 , 2024 | 11:50 PM

తొగుట మండలం తుక్కాపూర్‌ గ్రామశివారులో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌లో నీటినిల్వలు రోజురోజుకూ అడుగంటుతున్నాయి

మల్లన్నసాగర్‌లో అడుగంటుతున్న జలాలు
తొగుట మండలం తుక్కాపూర్‌ గ్రామశివారులోని మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌లోని నీటి నిల్వలు

ప్రస్తుతం నీటి నిల్వ 9.25 టీఎంసీలు

రిజర్వాయర్‌ డెడ్‌స్టోరేజ్‌ 5 టీఎంసీలు మాత్రమే

ఉన్న నీటిని తాగునీటి కోసం పంపింగ్‌

ఖరీఫ్‌ సాగుకు నీటి విడుదల కష్టమే!?

తొగుట, మే 2 : తొగుట మండలం తుక్కాపూర్‌ గ్రామశివారులో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌లో నీటినిల్వలు రోజురోజుకూ అడుగంటుతున్నాయి. ప్రస్తుతం 9.25 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ డెడ్‌ స్టోరేజీ 5 టీఎంసీలు కాగా అంతకు మించి ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసం మిషన్‌ భగీరథకు, హైదరాబాద్‌ వాటర్‌ బోర్టుకు పంపింగ్‌ చేస్తున్నారు. దీంతో ఖరీఫ్‌ సాగుకు నీరు విడుదల చేస్తారోలేదోన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతున్నది. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ ప్రారంభించినప్పటి నుంచి గతేడాది వరకు గత ప్రభుత్వ హయాంలో కొండపోచమ్మ రిజర్వాయర్‌, అప్పర్‌మానేర్‌, సిద్దిపేట, దుబ్బాక, సిరిసిల్ల నియోజకవర్గాల్లోని గొలుసుకట్టు చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలకు 27.24 టీఎంసీల నీటిని అధికారులు విడుదల చేశారు. గత సెప్టెంబరు 6 వరకు రిజర్వాయర్‌లో 10.67 టీఎంసీల నీరు నిల్వ ఉండగా సెప్టెంబరు 7 నుంచి అధికారులు ఆరు బాహుబలి మోటార్ల ద్వారా 16 రోజుల పాటు రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి 4.50 టీఎంసీల నీటిని అధికారులు మల్లన్నసాగర్‌లోకి ఎత్తిపోశారు. మల్లన్నసాగర్‌లో నీటినిల్వలు 15.17 టీఎంసీలకు చేరాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి 23న మల్ల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండాసురేఖ సిద్దిపేట, దుబ్బాక, సిరిసిల్ల నియోజకవర్గాల్లో గొలుసుకట్టు చెరువులకు 4.50 టీఎంసీల నీటిని విడుదల చేశారు. దాంతో పాటు మరో 1 టీఎంసీ నీటిని తాగునీటి అవసరాల కోసం మిషన్‌ భగీరఽథకు పంపింగ్‌ చేస్తున్నారు. వారం రోజులలో హైదరాబాద్‌ ప్రజల దాహర్తి తీర్చడానికి మరో టీఎంసీ నీటిని వాటర్‌ బోర్టుకు పంపింగ్‌ ప్రారంభించనున్నట్లు మల్లన్నసాగర్‌ ఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. ఎండల తీవ్రతకు రిజర్వాయర్‌లో సుమారు అర టీఎంసీ నీరు ఆవిరి కాగా ప్రస్తుతం మల్లన్నసాగర్‌లో 9.25 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నట్లు స్పష్టం చేశారు. అయితే ఖరీ్‌ఫకు సాగునీరు విడుదల చేస్తారా? అన్న ప్రశ్నకు ప్రస్తుతం మాత్రం కష్టమేనని చెప్పడం గమనార్హం.

Updated Date - May 02 , 2024 | 11:50 PM