Share News

రేవంత్‌వి పచ్చి అబద్ధాలు

ABN , Publish Date - May 04 , 2024 | 12:10 AM

సిద్దిపేట నడిగడ్డపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

రేవంత్‌వి పచ్చి అబద్ధాలు
సిద్దిపేటలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు

సిద్దిపేటలో అభివృద్ధి జరగలేదంటావా?

సీఎంగా ఈ ప్రాంతానికి నువ్వేమి చేస్తావో చెప్పలేదు

మా వెటర్నరీ కాలేజీని కొడంగల్‌కు ఎత్తుకెళ్లావు

రూ.150 కోట్ల అభివృద్ధి నిధులను రద్దు చేయించావు

ఇప్పుడేమో సిద్దిపేట జిల్లాను తొలగించే కుట్ర

నేను నర్సాపూర్‌లో ఉంటే ఇంట్లో ఉన్నట్లు చిల్లరమాటలు

ప్రజలారా కాంగ్రెస్‌, బీజేపీకి బుద్ధి చెప్పండి

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మే 3 : సిద్దిపేట నడిగడ్డపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. సిద్దిపేటలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గడిచిన పదేళ్లలో నిధులన్నీ సిద్దిపేటకే తీసుకెళ్తున్నారని మాట్లాడిన రేవంత్‌రెడ్డి ఇప్పుడేమో మతిమరుపు వ్యాఖ్యలు చేయడం అర్ధరహితమన్నారు. సిద్దిపేటకు తాను, కేసీఆర్‌ ఏమి చేయలేదో చెప్పాలన్నారు. జాతీయ, రాష్ట్రస్థాయిలో సిద్దిపేట పేరు లేకుండా అవార్డుల జాబితా ఉండేది కాదని చెప్పారు. దేశవిదేశాలు, ఇతర రాష్ర్టాలు, జిల్లాల నుంచి వేలాది మంది సందర్శకులు ఇక్కడి అభివృద్ధిని వేనోళ్ల పొగిడారని గుర్తుచేశారు. కొత్త జిల్లా, గోదావరి నీళ్లు, పోలీస్‌ కమిషనరేట్‌, మెడికల్‌ కాలేజీ, కోమటిచెరువు పర్యాటకం, ఐటీ హబ్‌, రోడ్లు, పచ్చదనం, విస్తృతమైన ప్రగతిని ఎవరు సాధించారో ప్రజలకు తెలుసన్నారు. నీ అబద్ధాలు చూసి ప్రజలు నవ్వుకున్నారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.

సీఎం కాగానే సిద్దిపేటకు అన్యాయం

రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నించారని గుర్తుచేశారు. ప్రగతిలో ఉన్న వెటర్నరీ కళాశాల పనులను ఆపించి కొడంగల్‌కు తరలించడం నిజం కాదా? అని ప్రశ్నించారు. సిద్దిపేట ప్రాంతానికి సంబంధించి రూ.150 కోట్ల అభివృద్ధి నిధులను రద్దు చేసింది నిజం కాదా? అని అడిగారు. ఈ ప్రాంత విద్యార్థులకు, ప్రజలకు అన్యాయం చేసేలా రేవంత్‌రెడ్డి చర్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. సీఎం హోదాలో మొదటిసారి సిద్దిపేటకు వచ్చి ఏమిస్తావో, ఏం చేస్తారో చెప్పకుండా అబద్దాలు మాట్లాడి వెళ్లిపోవడమేమిటని దుయ్యబట్టారు. .

జిల్లా రద్దవుతుంది

రాష్ట్రంలోని కొత్త జిల్లాలను రద్దు చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి కుట్రకు పాల్పడుతున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. అందులో భాగంగానే సిద్దిపేట జిల్లాను కూడా రద్దు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. నాలుగు దశాబ్దాల కలను కేసీఆర్‌ సాకారం చేస్తే కొత్త సీఎం మాత్రం సిద్దిపేట కడుపుకొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహించారు. జిల్లాను రద్దు చేస్తే సహించేది లేదని మాట్లాడారు. కాంగ్రె్‌సకు ఓటేసినట్లయితే తప్పనిసరిగా రద్దు చేస్తారని, బీజేపీకి ఓటేసినా జిల్లాకు గ్యారంటీ ఉండదని వివరించారు. అందుకే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామారెడ్డిని గెలిపించుకుంటే మన జిల్లా భద్రంగా ఉంటుందని తెలిపారు. కొత్త జిల్లాకు కలెక్టర్‌గా ఈ ప్రాంత అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి వెంకట్రామారెడ్డి అని గుర్తు చేశారు.

ఆ టైంలో నేను ఇంట్లో లేను

సీఎం రేవంత్‌రెడ్డి గురువారం రాత్రి సిద్దిపేట పాత బస్టాండ్‌ చౌరస్తా వద్ద ఓ విషయంలో తనస్థాయి దిగజారి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఎంత పచ్చి అబద్ధాలు, చిల్లర మాటలు మాట్లాడారో ఈ ఒక్క విషయంతోనే అర్థం చేసుకోవాలని సూచించారు. సిద్దిపేటలో రేవంత్‌ మాట్లాడుతూ క్యాంపు ఆఫీస్‌లోనే హరీశ్‌రావు ఉన్నాడని వ్యాఖ్యలు చేయడం విడ్డూరమని చెప్పారు. ఆ సమయంలో తాను నర్సాపూర్‌ నియోజకవర్గంలోని హత్నూర మండలం దౌల్తాబాద్‌ రోడ్‌షోలో భారీ జనసందోహం నడుమ ఉన్నానని వివరించారు. ఒక సీఎం స్థాయిలో ఆయనకు ఆ మాత్రం ఇంటెలిజెన్సీ కూడా లేదా అని ఎద్దేవా చేశారు. తాను ఎక్కడున్నానో తెలుసుకోవడం రేవంత్‌రెడ్డికి కష్టమైన పనా అంటూ వ్యాఖ్యానించారు. ఇటు రేవంత్‌రెడ్డి, అటు రఘునందన్‌రావు ఇద్దరు కూడా సిద్దిపేట అభివృద్ధిని ఓర్వలేని వాళ్లేనని, అందుకే ఇరు పార్టీలకు తగిన బుద్ది చెప్పాలని కోరారు.

Updated Date - May 04 , 2024 | 12:11 AM