Share News

ఖాకీ కన్ను

ABN , Publish Date - May 04 , 2024 | 11:32 PM

సోషల్‌ మీడియాపై గట్టి నిఘా

ఖాకీ కన్ను

ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు

నిరంతరం పర్యవేక్షిస్తున్న ఐటీ కోర్‌ బృందం

నెట్టింట పార్టీల ప్రచారశైలిపైనా దృష్టి

ఫిర్యాదులు చేస్తే చర్యలకు సన్నద్ధం

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మే 4 : ‘ఇటీవల సిద్దిపేట వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మాట్లాడినట్లుగా కొన్ని వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. రిజర్వేషన్ల అంశం గురించి ఆయన మాటలను మార్ఫింగ్‌ చేసి దుష్ప్రచారం చేశారని బీజేపీ నేతలు మండిపడ్డారు. పలువురు కాంగ్రెస్‌ నేతలపై కేసులు కూడా నమోదు చేశారు. ఈ సంఘటనతో సిద్దిపేట పేరు మార్మోగింది.’

‘తాజాగా మెదక్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామారెడ్డి మాట్లాడినట్లుగా ఒక ఫేక్‌ ఆడియో వైరల్‌గా మారింది. ప్రత్యేక టెక్నాలజీతో ఆయన గొంతును, మాటలను మిక్స్‌ చేసి దుష్ప్రచారం చేస్తున్నట్లు ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.’

మెదక్‌ లోక్‌సభ సెగ్మెంట్‌ల పరిధిలోనే చోటుచేసుకున్న ఈ రెండు సంఘటనలు చర్చనీయాంశంగా మారాయి. అధునాతన టెక్నాలజీతో, గ్రాఫిక్స్‌ ద్వారా మార్ఫింగ్‌ చేసి రాజకీయ పార్టీల నడుమ వివాదాలను సృష్టిస్తున్నారు. బరిలో ఉన్న అభ్యర్థులకు సంబంధించి విద్వేషకర పోస్టులు, తప్పుడు ఫొటోలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సాధారణంగా మారింది. దీంతో పోలీస్‌ యంత్రాంగం సోషల్‌ మీడియాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.

ఎన్నికలయ్యేదాకా స్పెషల్‌ టీం

పార్లమెంటు ఎన్నికలు ముగిసేదాకా సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌లో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో సోషల్‌ మీడియాను నిరంతరం పర్యవేక్షించడానికి ఐటీ కోర్‌ బృందాన్ని నియమించారు. 24 గంటల పాటు సోషల్‌ మీడియాలో పెడుతున్న పోస్టులను పరిశీలించడం వీరి ప్రధాన బాధ్యత. ముఖ్యంగా ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తల పోస్టులపై దృష్టి పెడుతున్నారు. ప్రత్యర్థులను కించపరిచేలా, ఓటర్లలో విద్వేషం సృష్టించేలా ఉంటే గుర్తిస్తున్నారు. అదే విధంగా ఎవరైనా తప్పుడు పోస్టుల గురించి ఫిర్యాదు చేస్తే వెంటనే విచారణ జరుపుతున్నారు. గతంలో ఫేక్‌ ఖాతాలు, వాట్సాప్‌ పోస్టుల వ్యవహారం గురించి తెలుసుకోవాలంటే హైదరాబాద్‌లోని ఐటీ సెల్‌ను ఆశ్రయించాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ టెక్నాలజీ సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌లోనూ అందుబాటులోకి తెచ్చారు. దీంతో ఫేక్‌ ఖాతాలను గుర్తించడం సులభతరమైంది.

ఆ ఖాతాలపై ఫోకస్‌..

వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, ఎక్స్‌ ఖాతాలతోపాటు యూట్యూబ్‌, రీల్స్‌ వీడియోలు, పోస్టులపై ఐటీ కోర్‌ విభాగం నిఘా సారించింది. అన్ని మండలాల్లోని సోషల్‌ మీడియా గ్రూపులను పరిశీలిస్తున్నారు. సొంత పార్టీ గురించి, వారి అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడంలో ఎలాంటి తప్పులేదని, ప్రత్యర్థులపై అసభ్యంగా ప్రచారం చేస్తేనే పరిగణనలోకి తీసుకునేలా పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తోంది. రెచ్చగొడుతూ పోస్టులు పెట్టే ఫేక్‌ ఖాతాలపైనా దృష్టి పెట్టారు. సంబంధిత ఫేస్‌బుక్‌లో వారి వివరాలేవీ లేకున్నా ఇతరుల గురించి ఇష్టారాజ్యంగా ప్రచారం చేసేవారిని గుర్తిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ‘వార్‌’

ఓవైపు ఎండలు మండుతుండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను నేరుగా కలవలేకపోతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో మాత్రమే ప్రచారం చేస్తున్నారు. మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో కాలు బయటపెట్టడం లేదు. అందుకే సోషల్‌ మీడియాను తమ ప్రచారానికి వేదికగా ఎంచుకుంటున్నారు. యూట్యూబ్‌ వీడియోలు ఓపెన్‌ చేసినా, ఫేస్‌బుక్‌ ఖాతాలు తెరిచినా, వాట్సాప్‌ గ్రూపుల్లో తొంగిచూసినా అభ్యర్థుల ప్రచారమే కనిపిస్తోంది. సోషల్‌ మీడియా ఖాతాలు తెరవగానే ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల ప్రచార వీడియోలు, ఫొటోలు ప్రత్యక్షమవుతున్నాయి. అంతేగాకుండా ఫేస్‌బుక్‌ ద్వారా అభ్యర్థులు తమ ప్రచారాన్ని లైవ్‌లో చూసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇక గ్రామాలు, పట్టణాల్లోని వాట్సాప్‌ గ్రూపుల్లో పోటాపోటీగా పోస్టులు పెట్టుకుంటూ నెట్టింట్లోనే వాగ్వాదాలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొన్నది. ఫేస్‌బుక్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రచారానికి వారం రోజులు మాత్రమే సమయం ఉండడంతో సోషల్‌ మీడియాను విస్తృతంగా వినియోగించేలా కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఒకరిపై ఒకరు సోషల్‌ మీడియా వేదికగా బురద చల్లుకుంటున్నారే తప్ప పోలీసులకు ఎలాంటి ఫిర్యాదులు చేయకపోవడం కొసమెరుపు.

Updated Date - May 04 , 2024 | 11:32 PM