Share News

ఒకరి మరణం.. ఎందరికో శాపం!

ABN , Publish Date - May 04 , 2024 | 12:12 AM

వీమార్ట్‌ అధినేత, దుబ్బాక మున్సిపాలిటీ లచ్చపేట గ్రామానికి చెందిన తడ్కమడ్ల విశ్వంగుప్తా ఉదంతం రేపిన కలకలం ఎందరో వ్యాపారులు, చిన్న సన్నకారు రైతులకు.. కార్మికులకు శాపంగా మారడంతో పాటు నేడు ఓ రైస్‌ మిల్లర్‌ ఆత్మహత్యకు కారణమైనట్లు జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది.

ఒకరి మరణం.. ఎందరికో శాపం!

‘వీ మార్ట్‌’ అధినేతను నమ్మి డబ్బు ముట్టజెప్పి..

7 నెలల క్రితం ఆయన ఆకస్మిక మృతితో రోడ్డున పడ్డ బాధితులు

వారి వేధింపులు తాళలేక తాజాగా సహ వ్యాపారి బలవన్మరణం

సిద్దిపేట జిల్లాలో కలకలం

దుబ్బాక, మే 3: వీమార్ట్‌ అధినేత, దుబ్బాక మున్సిపాలిటీ లచ్చపేట గ్రామానికి చెందిన తడ్కమడ్ల విశ్వంగుప్తా ఉదంతం రేపిన కలకలం ఎందరో వ్యాపారులు, చిన్న సన్నకారు రైతులకు.. కార్మికులకు శాపంగా మారడంతో పాటు నేడు ఓ రైస్‌ మిల్లర్‌ ఆత్మహత్యకు కారణమైనట్లు జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. చిన్న వ్యాపారం నుంచి మొదలై జిల్లాలోనే తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన విశ్వంగుప్తా తాను మోసపోవడంతో పాటు ఎందరినో రోడ్డుపాలు చేసినట్లు చెబుతున్నారు. తాజాగా అతని సహా వ్యాపారి అదే గ్రామానికి చెందిన కాచం నాగార్జున(57) అనే రైస్‌ మిల్లర్‌ తన రైస్‌ మిల్లులోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించగా... విశ్వంగుప్తా ఉదంతం మరోసారి తెరపైకి వచ్చింది..

ఎవరీ విశ్వంగుప్తా

దుబ్బాక మున్సిపాలిటీ లచ్చపేట గ్రామానికి చెందిన తడ్కమడ్ల విశ్వంగుప్తా సొంత గ్రామంలో 33 ఏళ్ల క్రితం చిన్న కిరాణదుకాణంతో వ్యాపారం ప్రారంభించారు. తర్వాత రైస్‌మిల్‌ ఏర్పాటు చేశారు. ఆ రైస్‌మిల్‌ గ్రామంతో పాటు నియోజకవర్గ నాయకుల లావాదేవీలకు వేదికగా మారింది. పనికి ఆహార పథకం బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. డబ్బుతో పాటు పరపతి పెరగడంతో తన వ్యాపారాన్ని రియల్‌ ఎస్టేట్‌ వైపు తిప్పారు. అదే క్రమంలో నిజాం షుగర్స్‌లో వలంటరీ రిటైర్‌మెంట్‌ తీసుకున్న సుమారు 25 మంది కార్మికులు సంస్థ నుంచి వచ్చిన డబ్బును విశ్వంగుప్తా వద్దే దాచుకున్నారు. వడ్డీ ఇస్తుండటంతో మరింత మంది తమ పిల్లల పెళ్లిళ్లకు, ఇళ్లు కట్టుకవడానికి, ఇతర అవసరాలకు దాచుకున్న డబ్బును విశ్వంగుప్తాకు అప్పుగా ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయన సిద్దిపేటలో ఎనిమిదేళ్ల క్రితం వీ మార్ట్‌ పేరిట సూపర్‌ మార్కెట్‌ ప్రారంభించారు. వాటిని గజ్వేల్‌, నర్సాపూర్‌తో పాటు పలు జిల్లాల్లో విస్తరించేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రజల్లో ఇంకా నమ్మకం పెరడగంతో కోట్లాది రుపాయాలు వచ్చిపడ్డాయి. ఈ క్రమంలో దుబ్బాక నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడితో కలిసి తన వ్యాపార సామ్రాజ్యాన్ని ముంబై వరకు విస్తరించాలని భావించాడు. దుబ్బాకకు చెందిన ఆ నాయకుడు విశ్వంగుప్తాతో ముంబైలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టించాడు. వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టగా.. అక్కడి రియల్‌ మాఫియా చేతిలో మోసపోయినట్లు ప్రచారం జరిగింది.

విశ్వంగుప్తా సంచార జాతుల నుంచి కూడా అప్పులు తీసుకోవడంతో వారంతా తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీయడం మొదలు పెట్టారు. అతడి సామ్రాజ్యం కూలిపోతుందన్న సమాచారంతో అతడికి డబ్బులు ఇచ్చిన వారంతా ఒత్తిడి మొదలు పెట్టారు. అన్ని వర్గాల నుంచి ఒక్కసారిగా ఒత్తిడి పెరగడం.. వేధింపులు పెరిగాయి. అయితే, విశ్వంగుప్త ఏడు నెలల క్రితం అకస్మాతుగా చనిపోయారు. దీంతో రెక్కల కష్టాన్ని తమ భవిష్యత్తు కోసం దాచుకున్న వందలాది మంది రోడ్డున పడ్డారు. కొందరు వ్యాపారులు అందిన కాడిన వారి కుటుంబం నుంచి వసూలు చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. ముంబైలో విశ్వంగుప్తా పెట్టిన పెట్టుబడులు తిరిగి ఇచ్చామని అక్కడి వారు చెబుతుండగా.. తమకు డబ్బులు రాలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే, తాజాగా ఆత్మహత్య చేసుకున్న కాచం నాగార్జున సైతం విశ్వంగుప్తాకు అప్పు చేసి మరీ వడ్డీకి ఇచ్చినట్లు సమాచారం. విశ్వంగుప్తా చనిపోవడంతో మరోసారి తమకు ఇలా జరగవద్దని కాచం నాగార్జునకు అప్పులు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి పెంచారు.

Updated Date - May 04 , 2024 | 12:12 AM