Share News

5 నెలల్లోనే అందోలుకు రూ.500 కోట్లు

ABN , Publish Date - May 05 , 2024 | 12:04 AM

అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే అందోలు అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.500 కోట్ల నిధులు మంజూరు చేయించానని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సీ.దామోదర్‌ రాజనర్సింహ పేర్కొన్నారు.

5 నెలల్లోనే అందోలుకు రూ.500 కోట్లు

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తాం

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ

పుల్‌కల్‌, మే 4: అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే అందోలు అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.500 కోట్ల నిధులు మంజూరు చేయించానని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సీ.దామోదర్‌ రాజనర్సింహ పేర్కొన్నారు. పుల్కల్‌, చౌటకూర్‌ మండలాల కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశాలు శనివారం నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేస్తున్నామని తెలిపారు. రైతు రుణమాఫీని ఆగస్టు 15 లోపు అమలు చేస్తామని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే సింగూరు ప్రాజెక్టు పంటకాల్వలకు సిమెంట్‌ లైనింగ్‌ చేయడానికి నిధులు మంజూరు చేయించానని, మూడు నెలల్లో పనులను ప్రారంభిస్తామని తెలిపారు. దీంతో మరో 5వేల ఎకరాలు సాగులోకి వస్తుందని వివరించారు. సదాశివపేట మండలం కొల్కూరు-పుల్కల్‌, మిన్‌పూర్‌ గ్రామాల మధ్య మంజీర నదిపై కొత్త వంతెన నిర్మాణం చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తద్వారా సదాశివపేట నుంచి జోగిపేటకు నేరుగా కనెక్టివిటీ ఏర్పడుతుందని పేర్కొన్నారు. జోగిపేట-శివ్వంపేట మధ్య 161 జాతీయ రహదారి పక్కన పరిశ్రమలు ఏర్పాటు చేసి, నిరుద్యోగుల రుణం తీర్చుకుంటానని అన్నారు. సుల్తాన్‌పూర్‌ జేఎన్టీయూలో 30 ఎకరాల్లో సైన్స్‌ సెంటర్‌ను మంజూరు చేశానని వెల్లడించారు. చౌటకూర్‌ నుంచి కొన్యాల వంతెన వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు ప్రకటించారు. అనంతరం చౌటకూర్‌ మండలం గంగోజిపేటకు చెందిన మాజీ సర్పంచ్‌ శ్రీనివా్‌సరెడ్డి, ఉప సర్పంచ్‌ పుష్పలనగేష్‌, వార్డు సభ్యులు మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో పుల్కల్‌, చౌటకూర్‌ మండలాల కాంగ్రెస్‌ అధ్యక్షులు దుర్గారెడ్డి, నత్తి దశరత్‌, నాయకులు రామచంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి, గోవర్ధన్‌, మల్లారెడ్డి, రాములు, ఎస్‌.రామచంద్రారెడ్డి, రామాగౌడ్‌, ఈశ్వర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2024 | 12:04 AM