Share News

కాంగ్రెస్‌ నాయకులపై కత్తితో దాడి

ABN , Publish Date - May 05 , 2024 | 05:45 AM

ఎన్నికల వేళ పాతబస్తీలో అలజడి రేగింది. వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఎంఐఎం నాయకుడొకరు.. ఇద్దరు కాంగ్రెస్‌ నాయకులపై కత్తితో దాడి

కాంగ్రెస్‌ నాయకులపై కత్తితో దాడి

ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

పాత కక్షలతో ఎంఐఎం నేత దుర్మార్గం

హైదరాబాద్‌లో నడిరోడ్డుపై ఘటన

రాజేంద్రనగర్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల వేళ పాతబస్తీలో అలజడి రేగింది. వ్యక్తిగత కక్షల నేపథ్యంలో ఎంఐఎం నాయకుడొకరు.. ఇద్దరు కాంగ్రెస్‌ నాయకులపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఒకరు చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సులేమాన్‌ నగర్‌లో కాంగ్రెస్‌ కార్యాలయం ముందు వందలాది మంది కార్యకర్తలు ఉండగానే నిందితుడు ఈ దారుణానికి తెగబడ్డాడు. సులేమాన్‌ నగర్‌ డివిజన్‌ ఇంద్రానగర్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ కార్యాలయం ఉంది. చేవెళ్ల పార్లమెంటు పరిధిలోకి వచ్చే రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలోని సులేమాన్‌నగర్‌, శాస్త్రీపురం డివిజన్లలో శనివారం రాత్రి చేవెళ్ల కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి రోడ్‌ షో ఉంది. ఈ సందర్భంగా ఇంద్రానగర్‌ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు మక్బూల్‌(55), ఎన్‌టీఆర్‌ నగర్‌ నివాసి మనోజ్‌ కుమార్‌(45) కాంగ్రెస్‌ కార్యాలయం ముందు జెండాలు కట్టి, కార్యకర్తలను పోగుచేసి, రంజిత్‌ రెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన మజ్లిస్‌ పార్టీ నాయకుడు అమ్జద్‌.. మక్బూల్‌, మనోజ్‌లపై కత్తితో దాడి చేశాడు. దీంతో వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. కడుపులో కత్తిపోట్లతో మక్బూల్‌కు తీవ్ర రక్తస్రావం జరిగిందని స్థానికులు తెలిపారు. దాడి జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తలు భయంతో పరుగులు పెట్టారు. దాడి అనంతరం అమ్జద్‌ పరారయ్యాడు. కత్తిపోట్లకు గురైన ఇద్దరిని చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్‌ డీసీపీ చింతమనేని శ్రీనివాస్‌ ఘటనా స్థలాన్ని సందర్శించారు.

ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మక్బూల్‌ మృతి చెందాడని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. మజ్లిస్‌ నేతఅమ్జద్‌కు కాంగ్రెస్‌ నేతలు మక్బూల్‌, మనోజ్‌కుమార్‌ మధ్య పాత కక్షలున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ వారు గొడవ పడ్డారని అంటున్నారు. అది మనసులో పెట్టుకుని అమ్జద్‌ వారిపై దాడి చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇంద్రానగర్‌ ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్‌, కాంగ్రెస్‌ నేత హాజీకి మక్బూల్‌, మనోజ్‌కుమార్‌ మొదటి నుంచి అనుచరులుగా ఉన్నారు. హాజీ పదేళ్ల క్రితం హత్యకు గురయ్యాడు. అప్పటి నుంచి వీరిద్దరూ రాజకీయాలకు దూరంగా ఉంటూ తమ తమ పనులు చేసుకుంటున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

Updated Date - May 05 , 2024 | 05:45 AM