Share News

Election Commission: అభ్యర్థుల కంటే అధికారుల ఖర్చే ఎక్కువ!

ABN , Publish Date - May 18 , 2024 | 04:02 AM

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చేసే ఖర్చుపై ఎన్నికల సంఘం పర్యవేక్షణ, నియంత్రణ ఉంటాయి.. కానీ, ఎన్నికల్ని పర్యవేక్షించాల్సిన అధికారులు చేసే ఖర్చుపై పర్యవేక్షణ ఎవరికి ఉంటుంది? ఎవరికీ ఉండదు. ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. ఎన్నికల ప్రక్రియలో అధికారులు చేసే వ్యయంపై ఎటువంటి తనిఖీగానీ, అడిటింగ్‌ కానీ ఉండదు. అందుకే, అధికారుల ఇష్టారాజ్యం నడుస్తోందని తాజాగా వెల్లడైంది.

Election Commission: అభ్యర్థుల కంటే అధికారుల ఖర్చే ఎక్కువ!

  • అసెంబ్లీ ఎన్నికల వ్యయం 701కోట్లు

  • నియోజకవర్గానికిసగటున 5.9 కోట్లు

  • కొన్ని చోట్ల ఏకంగా రూ.10కోట్ల ఖర్చు

  • కలెక్టర్ల అదనపు నిధులకైతే లెక్కేలేదు

  • ఆడిటింగ్‌లేకపోవడంతో ఇష్టారాజ్యం

  • ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ వెల్లడి

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చేసే ఖర్చుపై ఎన్నికల సంఘం పర్యవేక్షణ, నియంత్రణ ఉంటాయి.. కానీ, ఎన్నికల్ని పర్యవేక్షించాల్సిన అధికారులు చేసే ఖర్చుపై పర్యవేక్షణ ఎవరికి ఉంటుంది? ఎవరికీ ఉండదు. ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. ఎన్నికల ప్రక్రియలో అధికారులు చేసే వ్యయంపై ఎటువంటి తనిఖీగానీ, అడిటింగ్‌ కానీ ఉండదు. అందుకే, అధికారుల ఇష్టారాజ్యం నడుస్తోందని తాజాగా వెల్లడైంది. గత ఏడాది నవంబరు 30వ తేదీన జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అక్షరాలా రూ.701 కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారు. అంటే, సగటున ఒక్కో నియోజకవర్గానికి రూ.5.9 కోట్లు అధికారులు ఖర్చు చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ఏకంగా రూ.10కోట్లకు చేరింది. విశేషమేమిటంటే, ఒక్కో నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల (కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌,బీజేపీ) అభ్యర్థులు ముగ్గురు చేసిన వ్యయం (గరిష్ఠంగా రూ.1.2 కోట్లు) కన్నా అధికారులు చేసిన వ్యయం ఎన్నో రెట్లు ఎక్కువ ఉండటం గమనార్హం. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థులు, అధికారులు చేసిన వ్యయాన్ని ‘ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌’ సంస్థ విశ్లేషించింది. ఆ వివరాలను సంస్థ కార్యదర్శి పద్మనాభరెడ్డి వెల్లడించారు.


శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి గరిష్ఠంగా రూ.40 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో మూడు ప్రధాన పార్టీల నుంచి రాష్ట్రవ్యాప్తంగా 357 మంది అభ్యర్థులు పోటీ చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎంఐఎం పోటీచేసిన 9 స్థానాలనూ లెక్కలోకి తీసుకుంటే మొత్తం అభ్యర్థుల సంఖ్య 366. ఈసీకి వీరు సమర్పించిన వివరాల ప్రకారం సగటున వీరి ఎన్నికల ఖర్చు రూ.30 లక్షలు దాటలేదని ఎఫ్‌జీజీ తెలిపింది. అనేకమంది కోట్లలో చేసిన ఖర్చుకు.. ఈసీకి సమర్పించిన లెక్కలకు ఏమాత్రం పొంతన లేదని పేర్కొంది. అయితే, ఎన్నికల వేళ అధికారులు ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేశారని వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.701 కోట్లు విడుదల చేసింది. దీనికి తోడు జిల్లాల కలెక్టర్లు కేటాయించిన నిధులను అదనంగా ఖర్చు చేశారని తేలింది.


ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వపరంగా అయిన వ్యయం వివరాలను అందించాలని తాము ఆర్టీఐ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లను కోరినా.. వారినుంచి సమాధానం రాలేదని పద్మనాభరెడ్డి తెలిపారు. ఖర్చు సమాచారం అందించాలని కలెక్టర్లు ఆర్డీవోలకు, ఆర్డీవోలు తహశీల్దార్లకు ఆదేశాలు పంపించారని, కానీ దరఖాస్తు చేసి మూడు నెలలు గడుస్తున్నా ఎలాంటి సమాచారం రాలేదన్నారు. చివరికి రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శిని దీనిపై అడిగినప్పుడు.. బడ్జెట్‌ నుంచి రూ.701కోట్లు విడుదల చేసినట్లు తెలిపారని వెల్లడించారు. ఈ వ్యయం ఎలా జరిగిందని తాము పరిశీలించామని తెలిపారు. ఎన్నికల పరిశీలకులు, ఎన్నికల విధుల్లో ఉన్న ఇతర ఉన్నతాధికారులు ఇష్టారీతిన ఖర్చు చేశారని, ఆడిట్‌ లేకపోవడంతో ప్రశ్నించేవారే లేకుండా పోయారన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అధికారుల ఖర్చు రూ.8-10 కోట్ల వరకు చేరిందని తెలిపారు. ఎన్నికల వ్యయంలో పారదర్శకతను పాటించేందుకు ఆడిట్‌ నిర్వహించాలని, ఆ వివరాలను వెబ్‌సైట్లో ఉంచాలని ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - May 18 , 2024 | 04:02 AM