Share News

కొత్త జిల్లాలు ఉండాలంటే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలవాలి

ABN , Publish Date - May 04 , 2024 | 11:00 PM

కొత్త జిల్లాలు అలాగే కొనసాగాలంటే బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో శనివారం రాత్రి నిర్వహించిన రోడ్‌ షోలో కేసీఆర్‌ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

కొత్త జిల్లాలు ఉండాలంటే   బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలవాలి

మంచిర్యాల, మే 4 (ఆంధ్రజ్యోతి): కొత్త జిల్లాలు అలాగే కొనసాగాలంటే బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులు గెలవాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో శనివారం రాత్రి నిర్వహించిన రోడ్‌ షోలో కేసీఆర్‌ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మాజీ మంత్రి, పెద్దపల్లి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ 26 ఏళ్లపాటు సింగరేణి కార్మికుడిగా ప్రజలందరికి తెలిసిన వ్యక్తి అని, గని కార్మికుల సమస్యలేంటో తెలిసిన వ్యక్తికి ప్రజలు మద్దతు పలకాలన్నారు. బీఆర్‌ఎస్‌ పథకాలను రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసిందని, పల్లె, పట్టణ ప్రగతి పథకాలు మాయమయ్యాయని అన్నారు. పల్లెల్లో, మున్సిపాలిటీల్లో రోడ్లు ఊడ్చే పరిస్థితి కూడా లేదని, క్రీడాప్రాంగణాల్లో పిచ్చి మొక్కలు కొట్లాడుతున్నాయని అన్నారు. చెన్నూరు డివిజన్‌లో బీఆర్‌ఎస్‌ హయాంలో రైతులకు సాగునీరు అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎత్తేసిందని అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ భవనం మొండి గోడలతో ఉందన్నారు. ఆ భవనాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ కారణంచేత ఆపివేసిందని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాను విభజించి ప్రజల సౌకర్యార్థం మరో మూడు జిల్లాలుగా మార్చామని, ప్రస్తుత ప్రభుత్వం మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాలను రద్దు చేస్తానని అంటోందన్నారు. మంచిర్యాల జిల్లా ప్రజల చిరకాల వాంఛ అని, అది ఉండాల్నా ? పోవాల్నా ? అని ప్రశ్నించారు. జిల్లా ఉండాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని కేసీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ మూర్ఖపు ప్రభుత్వమని, ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. సింగరేణి తెలంగాణ కొంగుబంగారమని, కొప్పుల ఈశ్వర్‌ను గెలిపిస్తే దానిని కాపాడుతారని అన్నారు. ముఖ్యమంత్రి నీ గుడ్లు పీకుతా, పేగులు మెడలో వేసుకుంటా, జైలుకు పంపుతా అని పదే, పదే నన్ను ఉద్దేశించి అంటున్నాడని, జైళ్లకు కేసీఆర్‌ భయపడతాడా అని అన్నారు. 15 ఏళ్లు రాజీలేని పోరాటం చేసి తెలంగాణ తెచ్చానని, రాష్ర్టాన్ని కాపాడేందుకు ప్రాణాలు బలి పెట్టయినా పోరాడుతానని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ బలం తెలంగాణ బలమని, కాంగ్రెస్‌, బీజేపీలు రాష్ర్టాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు పన్నుతున్నాయని అన్నారు. ప్రజల ఖాతాల్లో రూ.15 లక్షలు జమ చేస్తానని, రైతుల ఆదాయం పెరిగేలా చేస్తానన్న మోదీ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మోదీది ఉత్త గ్యాస్‌ కంపెనీ అని అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ ఆగర్భ శ్రీమంతుడు, భూగర్భ కార్మికుడి మధ్యే ఉందని, కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను ఉద్దేశించి అన్నారు. కార్మికుడైతే ప్రజల పక్షాన ఉంటాడని, ఇద్దరిలో ఎవరు గెలవాలో ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు. ఈ రోడ్‌ షోలో చెన్నూర్‌, మంచిర్యాల, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌, నడిపెల్లి దివాకర్‌ రావు, దుర్గం చిన్నయ్యతో పాటు స్థానిక నాయకులు సీపతి శ్రీనివాస్‌, సందెల వెంకటేష్‌, యవ నాయకుడు నడిపెల్లి విజిత్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. రోడ్‌ షో సందర్భంగా ప్రముఖ కళాకారుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు మానుకోట ప్రసాద్‌ బృందం ఆలపించిన గీతాలు ప్రజలను ఆద్యంతం ఆకట్టుకున్నాయి.

Updated Date - May 04 , 2024 | 11:00 PM