Share News

4 రోజుల్లో రూ.2 వేల కోట్లు!

ABN , Publish Date - May 05 , 2024 | 05:28 AM

రైతుబంధు పథకంలో మిగిలిపోయిన లబ్ధిదారులకు నగదు బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. గత వానాకాలం సీజన్‌లో

4 రోజుల్లో రూ.2 వేల కోట్లు!

3 వేల కోట్ల రుణానికి ఆర్బీఐకి ఇండెంట్‌

7న మంజూరు కాగానే రైతుల ఖాతాల్లోకి

సగం మందికి ఆసరాపెన్షన్ల చెల్లింపు

మిగతా సగం మందికి నేడు పంపిణీ

రైతుబంధు పథకంలో మిగిలిన 39 లక్షల ఎకరాలకూ చెల్లింపు

హైదరాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): రైతుబంధు పథకంలో మిగిలిపోయిన లబ్ధిదారులకు నగదు బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. గత వానాకాలం సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 68.99 లక్షల మంది రైతులకు రైతుబంధు నిధులు పంపిణీ చేశారు. ఈ యాసంగి సీజన్‌కు వచ్చేసరికి ఇప్పటివరకు 64,75,319 మంది రైతులకు రైతుబంధు నగదు బదిలీ పూర్తిచేశారు. మొత్తం కోటిన్నర ఎకరాల విస్తీర్ణానికి రైతుబంధు చెల్లించాల్సి ఉండగా... ఇప్పటివరకు 111.50 లక్షల ఎకరాల వరకు ఎకరానికి రూ.5 వేల చొప్పున పంపిణీ పూర్తిచేశారు. రూ. 5574.77 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 39 లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సుమారు రూ. 2 వేల కోట్ల నిధులు అవసరమవుతాయి. ఈ నిధులను సర్దుబాటు చేసి ఈ నెల 8వ తేదీలోపు పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు. అయితే రైతుబంధు నగదు బదిలీ మొదలుపెట్టినప్పటి నుంచి పరిశీలిస్తే కొంత జాప్యం జరిగింది. పూర్తిస్థాయిలో నిధులు సర్దుబాటు కాలేదు. దీంతో కొద్దిరోజులుగా రైతులకు చెల్లింపులు నిలిపివేశారు. రైతుబంధు అందాల్సిన రైతులు సుమారు 4 - 5 లక్షల మంది వరకు ఉన్నారు. వీరికి కూడా నగదు బదిలీ పూర్తిచేస్తే ఈ యాసంగి బకాయిలు క్లియర్‌ అయిపోతాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల కొరత ఉండటంతో అప్పులు తీసుకుంటోంది. శనివారం మరో రూ.3 వేల కోట్ల కోసం ఆర్‌బీఐకి ఇండెంట్‌ పెట్టింది. ఈ నిధులు 7న ప్రభుత్వ ఖాతాలోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు ఖజానాలో ఉన్న కొన్ని నిధులను సర్దుబాటుచేసి, ఆ తర్వాత అప్పు మంజూరు కాగానే మొత్తానికి మొత్తం చెల్లింపులు పూర్తి చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉండటం గమనార్హం.


సామాజిక పెన్షన్ల విషయానికొస్తే శనివారం సగం మంది లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్‌ సొమ్ము జమ చేశారు. మిగతా సగం మందికి ఆదివారం జమ చేయనున్నారు. కాగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగుల వేతన చెల్లింపులపై దృష్టి పెట్టింది. గతంలో వేతనాలు పొందటానికి వారం రోజులు, పక్షం రోజులు ఎదురుచూసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు అంతా కలిపి 1న చెల్లిస్తున్నారు. ఆ తర్వాత 6 గ్యారెంటీలపై ఫోకస్‌ పెట్టారు. ఉచిత బస్సు ప్రయాణం, వంటగ్యాస్‌ సబ్సిడీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కు సబ్సిడీ నిధులు సర్దుబాటు చేయాల్సి వస్తోంది. ఈక్రమంలోనే రైతుబంధు చెల్లింపులు కాస్త జాప్యమయ్యాయి. ఇప్పుడు పూర్తిగా చెల్లించాలని నిర్ణయించారు. రైతుబంధు పథకం అమలుకు ఎన్నికల కమిషన్‌ నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉండదు. ‘ఆన్‌గోయింగ్‌ స్కీమ్‌’ కావటంతో ఆంక్షలు ఉండవు. అందుకే నిధులు సర్దుబాటు చేసి రైతుబంధు పథకం అమలును పూర్తిచేయాలనే ఆలోచనతో ప్రభత్వం ఉండటం గమనార్హం.

Updated Date - May 05 , 2024 | 05:28 AM