Share News

డుప్లెసి ధమాకా

ABN , Publish Date - May 05 , 2024 | 03:27 AM

ప్లేఆఫ్స్‌ ఆశలు అడుగంటిన వేళ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు చెలరేగుతోంది. బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో గుజరాత్‌ టైటాన్స్‌ను స్వల్ప స్కోరుకే కట్టడి చేసిన వేళ.. కెప్టెన్‌ డుప్లెసి (23 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 64) ధనాధన్‌ ఆటతో...

డుప్లెసి ధమాకా

నేటి మ్యాచ్‌లు

పంజాబ్‌ X చెన్నై, మ.3.30 గం. నుంచి

లఖ్‌నవూ X కోల్‌కతా రాత్రి 7.30 గం. నుంచి

  • అదరగొట్టిన బౌలర్లు

  • గుజరాత్‌పై బెంగళూరు గెలుపు

బెంగళూరు: ప్లేఆఫ్స్‌ ఆశలు అడుగంటిన వేళ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు చెలరేగుతోంది. బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో గుజరాత్‌ టైటాన్స్‌ను స్వల్ప స్కోరుకే కట్టడి చేసిన వేళ.. కెప్టెన్‌ డుప్లెసి (23 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 64) ధనాధన్‌ ఆటతో మెరిసింది. అయితే ఓ దశలో పేసర్‌ జోషువా లిటిల్‌ (4/45) ధాటికి తడబడినట్టు కనిపించినా.. మరో 38 బంతులుండగానే ఆర్‌సీబీ మ్యాచ్‌ను ముగించింది. తద్వారా 4 వికెట్లతో ఘనవిజయం సాధించడంతో పాటు 8 పాయింట్లతో ఏడో స్థానానికి ఎగబాకింది. టైటాన్స్‌కిది వరుసగా మూడో ఓటమి. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా గుజరాత్‌ 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. షారుక్‌ ఖాన్‌ (37), రాహుల్‌ తెవాటియా (35), మిల్లర్‌ (30) రాణించారు. యష్‌ దయాల్‌, సిరాజ్‌, వైశాఖ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో బెంగళూరు 13.4 ఓవర్లలో 6 వికెట్లకు 152 రన్స్‌ చేసి గెలిచింది. విరాట్‌ కోహ్లీ (27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 42), దినేశ్‌ కార్తీక్‌ (21 నాటౌట్‌), స్వప్నిల్‌ (15 నాటౌట్‌) ఆకట్టుకున్నారు. నూర్‌ అహ్మద్‌కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా సిరాజ్‌ నిలిచాడు.


మెరుపు ఆరంభం: స్వల్ప ఛేదనలో ఆర్‌సీబీ పరుగుల వరద పారించింది. కెప్టెన్‌ డుప్లెసి బాదుడుకు పవర్‌ప్లేలోనే జట్టు 92 పరుగులతో వహ్వా అనిపించింది. కానీ ఆ తర్వాతే పేసర్‌ లిటిల్‌ ధాటికి టపటపా వికెట్లు కోల్పోవడంతో కాస్త టెన్షన్‌ నెలకొంది. కానీ దినేశ్‌ కార్తీక్‌ అండగా నిలిచి మ్యాచ్‌ను ముగించాడు. తొలి ఓవర్‌లో కోహ్లీ రెండు సిక్సర్లతో ఆకట్టుకోగా, ఆ తర్వాత ఆటంతా డుప్లెసీదే అయ్యింది. రెండో ఓవర్‌లో 4,4,6,4తో 20 రన్స్‌.. నాలుగో ఓవర్‌లోనూ 4 ఫోర్లతో 18 రన్స్‌ అందించాడు. అటు ఈ దూకుడుకు 18 బాల్స్‌లోనే ఫిఫ్టీని కూడా పూర్తి చేసుకున్నాడు. ఇక ఐదో ఓవర్‌లో కోహ్లీ రెండు సిక్సర్లతో 14 రన్స్‌ అందించాడు. పేసర్‌ లిటిల్‌ ఓవర్‌లోనూ డుప్లెసి 4,6,4తో చెలరేగినా నాలుగో బంతికి క్యాచ్‌ అవుటయ్యాడు. దీంతో ఆర్‌సీబీ పరుగుల తుఫాన్‌కు తెరపడగా, తొలి వికెట్‌కు 35 బంతుల్లో 92 పరుగుల భాగస్వామ్యం కూడా ముగిసింది. ఈ దశలో ఆర్‌సీబీ అనూహ్యంగా తడబడి 25 రన్స్‌ వ్యవధిలోనే 6 వికెట్లు కోల్పోయింది. విల్‌ జాక్స్‌ (1), కోహ్లీని స్పిన్నర్‌ నూర్‌ అవుట్‌ చేయగా.. రజత్‌ పటీదార్‌ (2), మ్యాక్స్‌వెల్‌ (4), గ్రీన్‌ (1)లను లిటిల్‌ పెవిలియన్‌ చేర్చాడు. దీంతో ఆర్‌సీబీ 117/6తో నిలిచింది. అయితే అప్పటికే ఛేదనలో బంతులు ఎక్కువ, పరుగులు తక్కువగా ఉండడంతో ఇబ్బంది లేకపోయింది. రషీద్‌ ఓవర్‌లో కార్తీక్‌ 3 ఫోర్లతో 16 రన్స్‌ రాబట్టడంతో ఆర్‌సీబీ గెలుపు ఖాయమైంది.


పేసర్ల హవా: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ బ్యాటర్లు ఒక్కో పరుగు తీసేందుకు చెమటోడ్చారు. అటు ఈ సీజన్‌లో తొలిసారి ఆర్‌సీబీ బౌలర్లు అద్భుత రీతిలో చెలరేగారు. పేసర్లు సిరాజ్‌, యష్‌, గ్రీన్‌ చక్కటి లెంగ్త్‌తో బంతులు వేయడంతో టైటాన్స్‌ ఉక్కిరిబిక్కిరైంది. తన వరుస ఓవర్లలో సాహా (1), గిల్‌ (2) వికెట్లతో సిరాజ్‌ గట్టి షాకే ఇచ్చాడు. ఆరో ఓవర్‌లో సాయిసుదర్శన్‌ (6)ను షార్ట్‌ పిచ్‌ బాల్‌తో గ్రీన్‌ అవుట్‌ చేయగా పవర్‌ప్లేలో గుజరాత్‌ 23/3 స్కోరుతో దీనస్థితిలో నిలిచింది. ఈ దశలో షారుక్‌, మిల్లర్‌ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరూ ఓవర్‌కో బౌండరీ ఉండేలా ఆడుతూ స్కోరును చక్కదిద్దారు. పదో ఓవర్‌లో మిల్లర్‌ 6, షారుక్‌ 4తో 12 రన్స్‌ వచ్చాయి. అయితే ఈ జోడీ ప్రమాదకరంగా మారుతున్న దశలో 12వ ఓవర్‌లో మిల్లర్‌ను కర్ణ్‌ శర్మ అవుట్‌ చేశాడు. అప్పటికి నాలుగో వికెట్‌కు 58 పరుగులు జత చేరాయి. ఇక తర్వాతి ఓవర్‌లోనే చక్కగా కుదురుకున్న షారుక్‌ రనౌటవడం దెబ్బతీసింది. విరాట్‌ నేరుగా విసిరిన మెరుపు త్రోతో అతను పెవిలియన్‌ చేరాడు. ఈ తరుణంలో తెవాటియా హిట్టింగ్‌కు దిగి 16వ ఓవర్‌లో వరుసగా 4,6,4,4తో 19 రన్స్‌ అందించాడు. అటు రషీద్‌ ఖాన్‌ (18) వీలు చిక్కనప్పుడల్లా బౌండరీలతో చెలరేగాడు. వీరి ఆటతో 150 దాటేస్తుందనిపించినా.. 18వ ఓవర్‌లో యష్‌ ఈ ఇద్దరినీ వెనక్కి పంపి ఆర్‌సీబీకి ఊరటనిచ్చాడు. 19వ ఓవర్‌లో విజయ్‌ శంకర్‌ (10) రెండు ఫోర్లతో ఊపు మీద కనిపించాడు. కానీ ఆఖరి ఓవర్‌ తొలి మూడు బంతుల్లోనే టైటాన్స్‌ చివరి 3 వికెట్లు కోల్పోయింది. మానవ్‌ (1), విజయ్‌ వికెట్లను వైశాఖ్‌ తీయగా.. మోహిత్‌ రనౌటయ్యాడు.


స్కోరుబోర్డు

గుజరాత్‌: సాహా (సి) దినేశ్‌ (బి) సిరాజ్‌ 1, గిల్‌ (సి) వైశాఖ్‌ (బి) సిరాజ్‌ 2, సాయి సుదర్శన్‌ (సి) కోహ్లీ (బి) గ్రీన్‌ 6, షారుక్‌ ఖాన్‌ (రనౌట్‌) 37, మిల్లర్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) కర్ణ్‌ శర్మ 30, తెవాటియా (సి) వైశాఖ్‌ (బి) యశ్‌ దయాల్‌ 35, రషీద్‌ ఖాన్‌ (బి) యశ్‌ దయాల్‌ 18, విజయ్‌ శంకర్‌ (సి) సిరాజ్‌ (బి) వైశాఖ్‌ 10, మానవ్‌ సూథర్‌ (సి) స్వప్నిల్‌ (బి) వైశాఖ్‌ 1, మోహిత్‌ శర్మ (రనౌట్‌) 0, నూర్‌ అహ్మద్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 19.3 ఓవర్లలో 147 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-1, 2-10, 3-19, 4-80, 5-87, 6-131, 7-136, 8-147, 9-147, 10-147; బౌలింగ్‌: స్వప్నిల్‌ 1-0-1-0, సిరాజ్‌ 4-0-29-2, యశ్‌ దయాల్‌ 4-0-21-2, గ్రీన్‌ 4-0-28-1, వైశాఖ్‌ 3.3-0-23-2, కర్ణ్‌ శర్మ 3-0-42-1.

బెంగళూరు: కోహ్లీ (సి) సాహా (బి) నూర్‌ 42, డుప్లెసి (సి) షారుక్‌ (బి) లిటిల్‌ 64, విల్‌ జాక్స్‌ (సి) షారుక్‌ (బి) నూర్‌ 1, పటీదార్‌ (సి) మిల్లర్‌ (బి) లిటిల్‌ 2, మ్యాక్స్‌వెల్‌ (సి) మిల్లర్‌ (బి) లిటిల్‌ 4, గ్రీన్‌ (సి) షారుక్‌ (బి) లిటిల్‌ 1, దినేశ్‌ (నాటౌట్‌) 21, స్వప్నిల్‌ (నాటౌట్‌) 15, ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 13.4 ఓవర్లలో 152/6; వికెట్ల పతనం: 1-92, 2-99, 3103, 4-107, 5-111, 6-117; బౌలింగ్‌: మోహిత్‌ శర్మ 2-0-32-0, జోషువా లిటిల్‌ 4-0-45-4, మానవ్‌ 2-0-26-0, నూర్‌ అహ్మద్‌ 4-0-23-2, రషీద్‌ 1.4-0-25-0.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

రాజస్థాన్‌ 10 8 2 0 16 0.622

కోల్‌కతా 10 7 3 0 14 1.098

లఖ్‌నవూ 10 6 4 0 12 0.094

హైదరాబాద్‌ 10 6 4 0 12 0.072

చెన్నై 10 5 5 0 10 0.627

ఢిల్లీ 11 5 6 0 10 -0.442

బెంగళూరు 11 4 7 0 8 -0.049 పంజాబ్‌ 10 4 6 0 8 -0.062

గుజరాత్‌ 11 4 7 0 8 -1.320

ముంబై 11 3 8 0 6 -0.356

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

2

ఆర్‌సీబీ తరఫున రెండో ఫాస్టెస్ట్‌ (18 బంతుల్లో) ఫిఫ్టీ నమోదు చేసిన డుప్లెసి. గేల్‌ (17) టాప్‌లో ఉన్నాడు.

Updated Date - May 05 , 2024 | 03:27 AM