Share News

వేసవి పానీయం... ‘రసాల’

ABN , Publish Date - May 04 , 2024 | 06:23 AM

రసాల అనగానే ఎవరికైనా ‘బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్‌’ అనే పోతనగారి పద్యం గుర్తుకొస్తుంది. తన ఆంధ్ర మహా భాగవత కృతిని గున్నమామిడి చెట్టు లేత చిగురులా కోమలమైనదని....

వేసవి పానీయం... ‘రసాల’

రసాల అనగానే ఎవరికైనా ‘బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్‌’ అనే పోతనగారి పద్యం గుర్తుకొస్తుంది. తన ఆంధ్ర మహా భాగవత కృతిని గున్నమామిడి చెట్టు లేత చిగురులా కోమలమైనదని భావించాడు పోతన మహాకవి. ఈ పద్యంలో ‘రసాల’ అంటే మామిడి అని! మామిడి పండు రసంలా తియ్యగా ఉండే పానీయం కాబట్టి... తియ్యటి పెరుగుతో చేసిన పానీయాన్ని క్షేమశర్మ తన ‘క్షేమ కుతూహలం’ గ్రంథంలో ‘రసాల’ అనే పానీయంగా పేర్కొన్నాడు.

‘రసాల’... తయారీ ఇలా...

కొద్దిగా పులిసిన గట్టి గేదె పెరుగును ఒక కప్పు కొలతలో మట్టి లేదా పింగాణీ పాత్రలోకి తీసుకోండి. అందులో సగం అంటే, అర కప్పు పంచదార, రెండు కప్పుల నీళ్లు కలిపి బాగా చిలకాలి. ఏలకుల పొడి, లవంగాలపొడి, పచ్చకర్పూరం, మిరియాల పొడి తగుమాత్రంగా కలపండి. చిటికెడంత ఉప్పు వేస్తే ఎలకో్ట్రలైట్‌ బ్యాలెన్స్‌ ఇస్తుంది. జీలకర్ర కూడా కలపవచ్చు. ఉత్తరాదివాళ్లు నల్ల ఉప్పు, జీలకర్ర, పంచదార కలిపితే ‘నమ్కీన్‌ లస్సీ’ అని, అల్లం, కారం, జీడిపప్పు వగైరా కలిపితే ‘మసాలా లస్సీ’ అని, పంచదార, కొన్ని సుగంధ ద్రవ్యాలు కలిపితే ‘మీఠీ లస్సీ’ అని... ఇలా అనేక లస్సీలు ఉత్తరాదిలో బాగా ప్రసిద్ధి.

ఇంట్లో చేసుకునేప్పుడు కొద్ది నిమిషాలు చల్లదనం కలిగేంతవరకూ దీన్ని ఫ్రిజ్జులో ఉంచొచ్చు. అతిగా చల్లదనం ఉండకూడదు. బజార్లో ఐస్‌ ముక్కలు కలుపుతారు. ఆ ఐస్‌ మానవ వినియోగం కోసం లైసెన్స్‌ పొందినది కాకపోవచ్చు. అందుకని బజార్లో దొరికే ‘రసాల’ పానీయాన్ని తాగేట్లయితే ఐస్‌ ముక్కల్లేకుండా తీసుకోండి.


రసాల అంటే లస్సీయ్యేనా?

ఆధునిక కాలంలో దీన్ని లస్సీ అంటున్నారు. ‘లస్సీ’ అనేది పంజాబీ పదం. పెరుగులో నీళ్లు, సుగంథ ద్రవ్యాలు కలిపి చిలికిన మజ్జిగ అని దీని భావం. లస్సీ అంటే పంచదార లేదా ఉప్పు కలిపిన మజ్జిగ అని మన హోటళ్లవాళ్ల అభిప్రాయం. లస్సీ తెమ్మంటే స్వీటా? సాల్టా? అనడుగుతారు. లస్సీలో స్వీటు సాల్టుతో పాటు సుగంధ ద్రవ్యాలు కూడా ఉంటాయి. సాధారణంగా బయట మనం తాగేది నిజమైన లస్సీ కాదు.

ప్రయోజనాలెన్నో...

గ్రీష్మే తథా శరది యే రవిశోషితాంగా యే చ ప్రమత్తవనితాసు రతాతిస్విన్నాః!

యే చాపి మాథపరిసర్పణస్విన్నగాత్రా స్తేషామియం వపుషి పోషణమాశు కుర్యాత్‌!

ఈ ఎండాకాలం ప్రతిరోజూ ఒక గ్లాసుడు ‘రసాల’ తాగితే ఎండబాధ నుంచి బయటపడవచ్చు. స్థూలకాయం, షుగరు, కఫ వ్యాధులతో బాధపడేవారికి తప్ప అందరికీ ఇది మంచిదే! అలసటను నివారిస్తుంది. పోషణనిస్తుంది. స్త్రీ, పురుషులకు మంచిది.

రసాలా శుక్రలా బల్యా రోచనీ వాతజిత్పరా!

దీపనీ బృంహణీ స్నిగ్ధా మథురా శిశిరా సరా!

రక్తపిత్తం తృషాం దాహం ప్రతిశ్యాయం చ నాశయేత్‌!


రోజూ ‘రసాల’ తాగితే పురుషుల్లో జీవకణాలు పెరుగుతాయి. బలకరం. నోటికి రుచి తెలుస్తుంది. వాతాన్ని జయిస్తుంది. కీళ్లవాతం, నడుంనొప్పి, మైగ్రేన్‌ తలనొప్పి సహా వాతవ్యాధులన్నింటిలోనూ మేలు చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. కడుపు నిండుగా ఉంటుంది. వేసవి కాలానికి అనువైనది. ‘సరగుణం’... అంటే శరీరం అంతా వ్యాపించే గుణం కలిగి ఉంటుంది. ఏదైనా ఔషధాన్ని వేసుకుని అనుపానంగా ఈ ‘రసాల’ను తాగితే చాలా త్వరగానూ, శక్తివంతంగానూ పని చేస్తుంది. బీపీ తగ్గిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. దప్పిక తీరుస్తుంది. న్యూరైటిస్‌ లాంటి నరాల జబ్బుల్లో బాగా పని చేస్తుంది. అరికాళ్లలో, అరిచేతుల్లో మంటల్ని తగ్గిస్తుంది. పడిసె భారాన్ని, ఎన్నటికీ వదలని జలుబునీ తగ్గిస్తుంది. చిక్కిపోతున్నవాళ్లకు, శుష్కింపచేసే వ్యాధులు, కీళ్లవాతంతోనూ, రక్తస్రావం బీపీ, గుండె జబ్బులతోనూ బాధపడేవారికి ఇది మంచి ఔషధం. చలవనిస్తుంది. వడదెబ్బ నుంచి రక్షిస్తుంది.

గంగరాజు అరుణాదేవి


భీముడు చేసిన పానీయం...

‘రసాల’ పానీయానికి కనీసంలో కనీసం రెండు వేల సంవత్సరాల ప్రాచీనత ఉంది. వాతాన్ని, పైత్యాన్ని, రక్తస్రావాన్ని అరికట్టే ఔషధంగా ఈ ‘రసాల’ పానీయాన్ని ఇవ్వాలని ఆయుర్వేద సంహితా గ్రంథాలు పేర్కొన్నాయి. దాని అర్థం... ఆ వ్యాధులున్నవారికే అని కాదు! సమస్త మానవాళికీ సర్వ వేళలా తీసుకోదగిన గొప్ప పానీయం అని. దీన్ని భీముడు అరణ్యవాస సమయంలో ఎండన పడివచ్చిన కృష్ణుడి కోసం స్వయంగా తయారు చేశాడని ‘భావప్రకాశ’ గ్రంథం పేర్కొంది. ‘భావప్రకాశ’లో చెప్పిన శ్లోకమే ‘క్షేమకుతూహలం’లోనూ ఉంది. దీన్నే ‘శిఖరిణీ’ అని కూడా పిలుస్తారు. తెలుగువాళ్లు ‘సిగరి’ అన్నారు.

మామిడి పండ్ల రసంతో కూడా...

ముఖ్యంగా వేసవి పానీయంగా ‘రసాల’ను తయారు చేసుకోవటం ఒక అవసరం. ఈ ఏడాది అసాధారణ వేసవి అంటున్నారు కాబట్టి, దీని అవసరం ఇంటిల్లిపాదికీ ఉంటుంది. ఎటుతిరిగీ మామిడిపండ్ల సీజనే కాబట్టి ‘రసాల’ అనే పేరుని సార్థకం చేస్తూ పెరుగుకు సమానంగా తియ్య మామిడి రసం కలిపి, బాగా చిలికి, అందులో సుగంధద్రవ్యాలు, చిటికెడంత ఉప్పు చేర్చుకుని తాగితే వడదెబ్బ మన జోలికి రాదు.

Updated Date - May 04 , 2024 | 06:39 AM