Share News

అన్నమేసి... ఇంత పప్పేసి!

ABN , Publish Date - May 04 , 2024 | 06:32 AM

పప్పులో ఏముందీ? అనుకోకండి. బోలెడన్ని ప్రొటీన్లు ఉన్నాయి. నాన్‌వెజ్‌ తినని వారు తరచుగా పప్పుతో సావాసం చేస్తే సరి... తప్పకుండా గట్టిగా ఉంటారు. ఎప్పుడు చేసినా పప్పులో ఏదో కొత్తదనం ఉంటుంది...

అన్నమేసి...   ఇంత పప్పేసి!

వంటిల్లు

పప్పులో ఏముందీ? అనుకోకండి. బోలెడన్ని ప్రొటీన్లు ఉన్నాయి. నాన్‌వెజ్‌ తినని వారు తరచుగా పప్పుతో సావాసం చేస్తే సరి... తప్పకుండా గట్టిగా ఉంటారు. ఎప్పుడు చేసినా పప్పులో ఏదో కొత్తదనం ఉంటుంది. చామకూర, చామగడ్డ, చింత చిగురుతో పప్పు వండుకోండిలా..

చింతచిగురు పప్పు

కావాల్సిన పదార్థాలు:

చింతచిగురు- 1 కప్పు, కందిపప్పు- 1 కప్పు, పచ్చిమిర్చి- 5, ఉల్లిపాయ- 1, పసుపు- పావు టీస్పూన్‌, ఉప్పు- తగినంత, నూనె- 3 టీస్పూన్లు, నెయ్యి- 1 టీస్పూన్‌, ఎండుమిర్చి- 2, ఆవాలు- పావు టీస్పూన్‌, జీలకర్ర- పావు టీస్పూన్‌, ఇంగువ- చిటికెడు, కరివేపాకు- 2 రెబ్బలు, వెల్లుల్లి- 4 రెబ్బలు

తయారీ విధానం:

కందిపప్పు కడిగి నీళ్లు పోసి సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, అరచెంచా నూనె వేసి ఉడికించాలి. పప్పు సగం ఉడికిన తర్వాత చింత చిగురు అరచేతులతో నలిపి పప్పులో వేసి తగినంత ఉప్పు వేసి కలిపి ఉడికించాలి. పప్పు, చింతచిగురు ఉడికిన తర్వాత దింపేయాలి. చిన్న గిన్నెలో నూనె, నెయ్యి కలిపి వేడి చేసి ఇంగు వేయాలి. అది కరిగిన తర్వాత జీలకర్ర వేయాలి. అవి చిటపటలాడతుండగా ఎండుమిర్చి, కరివేపాకు, నలక్కొట్టిన వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా వేపి ఉడికిన పప్పులో వేసి మూత పెట్టాలి. ఈ పప్పువేడి అన్నంలో కలిపి తింటే రుచిగా ఉంటుంది.


చింతకాయ పప్పు

కావాల్సిన పదార్థాలు:

పచ్చి చింతకాయలు- 100 గ్రాములు, కందిపప్పు- 200 గ్రాములు, ఉల్లిపాయ- 1, పచ్చిమిర్చి-3, కొత్తిమీర- కొద్దిగా, కరివేపాకు- 2 రెబ్బలు, కారంపొడి- 1 టీస్పూన్‌, పసుపు- పావు టీస్పూన్‌, ఉప్పు- తగినంత, ఆవాలు- పావు టీస్పూన్‌, జీలకర్ర- పావు టీస్పూన్‌, నూనె- 3 టీస్పూన్లు

తయారీ విధానం:

కందిపప్పు కడిగి నీళ్లు పోసి కొంచెం నూనె, పసుపు వేసి ఉడికించాలి. చింతకాయ దంచి కప్పు నీళ్లు పోసి అరగంట నానబెట్టాలి. తర్వాత పావుకప్పు పులుసు తీసి పెట్టుకోవాలి. పులుపు ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. పప్పు సగం ఉడికిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి కలపాలి. ఐదు నిముషాల తర్వాత కారంపొడి, చింతకాయ పులుసు, ఉప్పు వేసి ఐదు నిముషాల పాటు ఉడకనివ్వాలి. పప్పును గరిటెతో మెదిపి దింపేయాలి. చిన్న గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి చిటపటలాడుతుండగా కరివేపాకు వేసి పప్పులో కలపాలి. ఇందులో కారంపొడి బదులు మొత్తం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు.


చామకూర సెనగ పప్పు

కావాల్సిన పదార్థాలు:

చేమకూర ఆకులు- 8 పెద్దవి, సెనగపప్పు- 250 గ్రాములు, చింతపండు- నిమ్మకాయంత, పచ్చిమిర్చి- 6 లేదా 8, పసుపు- పావు టీస్పూన్‌, ఉప్పు- తగినంత, కరివేపాకు- 2 రెబ్బలు, ఎండుమిర్చి- 3, ఆవాలు, జీలకర్ర- పావు టీస్పూన్‌, వెల్లుల్లి- 6 రెబ్బలు, నూనె- రెండున్నర పావు టీస్పూన్‌, నెయ్యి- 1 టీస్పూన్‌

తయారీ విధానం:

సెనగపప్పు కడిగి తగినన్ని నీళ్లు పోసి అరచెంచా నూనె, పసుపు వేయాలి. చామకూర ఆకులు కడిగి సన్నగా తరిగి వేసి ఉడికించాలి. పప్పు ఉడికిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, చింతపండులోని నార తీసి చిన్న ముక్కలుగా చేసి వేయాలి. తగినంత ఉప్పు వేసి మరికొద్ది సేపు ఉడికించాలి. ఇంకో చిన్న గిన్నెలో నూనె, నెయ్యి కలిపి వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి కాస్త వేగిన తర్వాత వెల్లుల్లి, పొట్టు తీసి నలక్కొట్టి వేయాలి. కాస్త ఎర్రబడ్డాక ఉడికిన పప్పులో వేసి కలిపి మూత పెట్టాలి.


చామకూర కందిపప్పు

కావాల్సిన పదార్థాలు:

కందిపప్పు- 100 గ్రాములు, చామ ఆకులు- 6, ఉల్లిపాయ- 1 చిన్నది, పచ్చిమిర్చి- 4, కరివేపాకు- 1 రెమ్మ, పసుపు- పావు టీస్పూన్‌, చింతపండు- చిన్న నిమ్మకాయంత, ఉప్పు- తగినంత, నూనె- 1 టీస్పూన్‌, నెయ్యి- 1 టీస్పూన్‌, వెల్లుల్లి- 3 రెబ్బలు, ఆవాలు- పావు టీస్పూన్‌, జీలకర్ర- పావు టీస్పూన్‌, ఇంగువ- చిటికెడు

తయారీ విధానం:

కందిపప్పు కడిగి నీళ్లు పోసి అరగంట నానబెట్టాలి. తర్వాత పసుపు, కొంచెం నూనె, సన్నగా తరిగిన ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి వేసి ఉడికించాలి. పప్పు సగం ఉడికిన తర్వాత కడిగి సన్నగా తరిగిన చామకూర, నార, గింజలు తీసిన చింతపండు రెక్కలు, తగినంత ఉప్పు వేసి ఉడికించాలి. పప్పు ఉడికిన తర్వాత మెదపాలి. చిన్న గిన్నెలో నూనె, నెయ్యి వేడి చేసి ఇంగువ వేయాలి. అది కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడుతుండగా పొట్టు తీసి నలక్కొట్టిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి కొద్దిగా వేగిన తర్వాత పప్పులో వేసి కలిపి మూతపెట్టాలి.


చామగడ్డ పప్పు

కావాల్సిన పదార్థాలు:

కందిపప్పు- 200 గ్రాములు, ఉల్లిపాయ-1, చామగడ్డలు- 200 గ్రాములు, పచ్చిమిర్చి- 1, కరివేపాకు-2 రెబ్బలు, కొత్తిమీర- కొద్దిగా, గరం మసాలా పొడి- పావు టీస్పూన్‌, పసుపు- అర టీస్పూన్‌, కారం పొడి- 1 టీస్పూన్‌, అల్లం వెల్లుల్లి ముద్ద- 1 టీస్పూన్‌, ఆవాలు- పావు టీస్పూన్‌, జీలకర్ర- పావు టీస్పూన్‌, టమాటా-1, చింతపండు పులుసు- పావు కప్పు, ఉప్పు- తగినంత, నూనె- 3 టీస్పూన్లు

తయారీ విధానం:

కందిపప్పు కడిగి నీళ్లు పోసి సగం పసుపు కొంచెం నూనె వేసి ఉడికించాలి. చామగడ్డలు పొట్టు తీసి ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. గిన్నెలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు వేసి మెత్తబడేవరకూ మూతపెట్టాలి. చామగడ్డలు కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరిగిన టమాటా వేసి ఇందులో చింతపండు పులుసు, అరకప్పు నీళ్లు కలిపి మూతపెట్టి ఉడికించాలి. చామగడ్డలు మెత్తబడ్డ తర్వాత ఉడికించిన కందిపప్పు, తగినంత ఉప్పు వేసి కలిపి మరికొద్ది సేపు ఉడికించాలి. చివరలో గరం మసాలా పొడి, కొత్తిమీర వేసి కలిపి దింపేయాలి.

Updated Date - May 04 , 2024 | 06:38 AM