Share News

Delhi: ఖలిస్థాన్‌ పేరుతో మా ఎన్నికల్లో జోక్యం..

ABN , Publish Date - May 05 , 2024 | 04:45 AM

భారత్‌, కెనడాల మధ్య మరో దౌత్య పర వివాదం తలెత్తింది. తమ ఎన్నికల్లో జోక్యం చేసుకుంటోందంటూ భారత్‌పై కెనడా ఆరోపణలు చేసింది. ఖలిస్థాన్‌ వేర్పాటువాదుల సమస్య పేరుతో కెనడా రాజకీయ నాయకులపై ప్రభావం చూపిస్తోందని విమర్శలు చేసింది.

Delhi: ఖలిస్థాన్‌ పేరుతో  మా ఎన్నికల్లో జోక్యం..

  • భారత్‌పై కెనడా ఆరోపణలు

  • నిజ్జర్‌ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్టు

న్యూఢిల్లీ, మే4: భారత్‌, కెనడాల మధ్య మరో దౌత్య పర వివాదం తలెత్తింది. తమ ఎన్నికల్లో జోక్యం చేసుకుంటోందంటూ భారత్‌పై కెనడా ఆరోపణలు చేసింది. ఖలిస్థాన్‌ వేర్పాటువాదుల సమస్య పేరుతో కెనడా రాజకీయ నాయకులపై ప్రభావం చూపిస్తోందని విమర్శలు చేసింది. రాజధాని అట్టావాలోని కమిషనర్‌ మారీ జోస్సీ హోగ్‌ శుక్రవారం సమర్పించిన మధ్యంతర నివేదికలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. భారత దేశ అధికారులు, వారి ప్రాపకంతో కెనడాలో పనిచేస్తున్న కొందరు వ్యక్తులు రాజకీయ నాయకులు, వివిధ వర్గాలపై ప్రభావం చూపుతున్నారని తెలిపారు. 2019, 2021 ఫెడరల్‌ ఎన్నికల్లోనూ ఇదే విధంగా జోక్యం చేసుకున్నారని పేర్కొన్నారు.


అయితే కెనడా ఎన్నికల వ్యవస్థ పటిష్ఠంగా ఉండడంతో ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని తెలిపారు. 194 పేజీలు ఉన్న ఈ నివేదికలో భారత్‌ పేరును 43 సార్లు ప్రస్తావించారు. చట్టబద్ధమైన ఖలిస్థాన్‌ అనుకూల రాజకీయ వాదనలకు, కెనడాలో అతి స్వల్పంగా ఉన్న ఖలిస్థానీ తీవ్రవాదానికి మధ్య ఉన్న తేడాను భారత్‌ గమనించడం లేదని, రెండింటీని ఒకటిగానే భావిస్తోందని అభిప్రాయపడ్డారు. భారత అధికారుల తరఫున కెనడాలో ‘ప్రాక్సీ ఏజెంట్లు’ నెట్‌వర్క్‌ మాదిరిగా పనిచేస్తున్నారని ఆ నివేదిక తెలిపింది. భారత అనుకూల వ్యక్తులు విజయం సాధించేలా వారు అక్రమ మార్గాల్లో నిధులు కూడా అందజేస్తున్నారని ఆరోపించింది. భారత్‌తో పాటు చైనా కూడా ఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నట్టు ఆరోపించింది.


విద్యార్థి వీసాలపై వచ్చి ఏజెంట్లుగా ?

ఖలిస్థాన్‌ తీవ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో శుక్రవారం కెనడా పోలీసులు ముగ్గురు భారతీయులను అరెస్టు చేశారు. కరణ్‌ప్రీత్‌ సింగ్‌, కమల్‌ప్రీత్‌ సింగ్‌, కరణ్‌ బ్రార్‌లను అరెస్టు చేసినట్టు రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీసుల అసిస్టెంట్‌ కమిషనర్‌ తెలిపారు. ఈ ముగ్గురు 20ల్లో ఉన్నవారే. వారిపై ఫస్ట్‌ డిగ్రీ మర్డర్‌ కేసులు పెట్టడంతో పాటు, హత్యకు కుట్ర పన్నారన్న ఆరోపణలను కూడా నమోదు చేశామని చెప్పారు. వారికి భారత్‌ ప్రభుత్వంతో ఉన్న సంబంధాలపై ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. విద్యార్థి వీసాలపై వచ్చిన ఆ ముగ్గురు భారత్‌ నిఘా అధికారుల సూచనల మేరకు నిజ్జర్‌ను హత్య చేశారా అన్నదానిపై దర్యాప్తు చేయనున్నారు.

Updated Date - May 05 , 2024 | 04:45 AM