Share News

రూ.2.25 లక్షల కోట్లు ఆవిరి

ABN , Publish Date - May 04 , 2024 | 05:45 AM

స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వారాంతం ట్రేడింగ్‌లో భారీ నష్టాలను చవిచూశాయి. చాలా కంపెనీల షేర్లు చాలా అధిక ధరల వద్ద ట్రేడవుతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో...

రూ.2.25 లక్షల కోట్లు ఆవిరి

  • భారీగా తరిగిన మార్కెట్‌ సంపద

  • సెన్సెక్స్‌ 733 పాయింట్లు పతనం

  • 74,000 దిగువ స్థాయికి సూచీ

  • 22,500 కిందికి జారిన నిఫ్టీ-50

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వారాంతం ట్రేడింగ్‌లో భారీ నష్టాలను చవిచూశాయి. చాలా కంపెనీల షేర్లు చాలా అధిక ధరల వద్ద ట్రేడవుతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో మదుపరులు పెద్దఎత్తున లాభాల స్వీకరణకు పాల్పడటం ఇందుకు కారణమైంది. శుక్రవారం ఆరంభ ట్రేడింగ్‌లో 484 పాయింట్ల వరకు పెరిగి 75,000 ఎగువ స్థాయికి చేరిన సెన్సెక్స్‌.. కొద్ది సేపటికే నష్టాల్లోకి మళ్లింది. క్రమంగా నష్టాలు పెరుగుతూ వచ్చాయి. ఒక దశలో సూచీ 1,147 పాయింట్ల మేర క్షీణించి 73,467.73 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివర్లో కాస్త కోలుకుని 732.96 పాయింట్ల నష్టంతో 73,878.15 వద్ద ముగిసింది. నిఫ్టీ విషయానికొస్తే, ప్రారంభ ట్రేడింగ్‌లో 146.5 పాయింట్ల వృద్ధితో 22,794.70 వద్ద సరికొత్త ఆల్‌టైం రికార్డును నమోదు చేసిన సూచీ.. చివరికి 172.35 పాయింట్ల నష్టంతో 22,475.85 వద్ద క్లోజైంది. అమ్మకాల హోరులో ఈక్విటీ మదుపరుల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ లిస్టెడ్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.2.25 లక్షల కోట్లు పతనమై రూ.406.24 లక్షల కోట్లకు పడిపోయింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 24 నేలచూపులు చూశాయి

మరింత తగ్గిన ఫారెక్స్‌ నిల్వలు: వరుసగా మూడో వారమూ విదేశీ మారకం (ఫారెక్స్‌) నిల్వలు క్షీణించాయి. గతనెల 26తో ముగిసిన వారంలో ఫారెక్స్‌ నిల్వలు మరో 241.2 కోట్ల డాలర్లు తగ్గి 63,792.2 కోట్ల డాలర్లకు పడిపోయాయని ఆర్‌బీఐ శుక్రవారం వెల్లడించింది. అంతక్రితం వారంలో నిల్వలు 228 కోట్ల డాలర్ల మేర తగ్గాయి. కాగా, ఏప్రిల్‌ 5తో ముగిసిన వారంలో ఫారెక్స్‌ నిల్వలు ఆల్‌టైం గరిష్ఠ స్థాయి 64,856.2 కోట్ల డాలర్లకు పెరిగాయి.

సిగ్నిటీలో మరో 26% కొనుగోలుకు

కోఫోర్జ్‌ ఓపెన్‌ ఆఫర్‌

సిగ్నిటీ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ షేర్‌హోల్డర్ల నుంచి 26 శాతం వాటా కొనుగోలుకు కోఫోర్జ్‌ శుక్రవారం ఓపెన్‌ ఆఫర్‌ను ప్రారంభించింది. హైదరాబాద్‌కు చెందిన ఐటీ సేవల కంపెనీ సిగ్నిటీ టెక్నాలజీస్‌ ప్రమోటర్లు, ఎంపిక చేసిన వాటాదారుల నుంచి 54 శాతం వరకు వాటా కొనుగోలు చేస్తున్నట్లు, ఒక్కో షేరుకు రూ.1,415 చొప్పున చెల్లించనున్నట్లు గురువారం ప్రకటించిన కోఫోర్జ్‌.. సెబీ నిబంధనల ప్రకారంగా ఈ ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఓపెన్‌ ఆఫర్‌లోనూ ఒక్కో షేరుకు రూ.1,415 చొప్పున చెల్లించనున్నట్లు తెలిపింది. ఆఫర్‌లో భాగంగా 26 శాతం వాటాకు సమానమైన 71.62 లక్షల షేర్ల కొనుగోలుకు కోఫోర్జ్‌ రూ.1,013 కోట్లు వెచ్చించనుంది.

Updated Date - May 04 , 2024 | 05:45 AM