Share News

కోటక్‌ బ్యాంక్‌ లాభం రూ.4,133 కోట్లు

ABN , Publish Date - May 05 , 2024 | 06:13 AM

మార్చితో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి (క్యూ4) కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ నికర లాభం స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన 18 శాతం వృద్ధితో రూ.4,133 కోట్లకు చేరుకుంది...

కోటక్‌ బ్యాంక్‌ లాభం రూ.4,133 కోట్లు

ఒక్కో షేరుకు రూ.2 డివిడెండ్‌

న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి (క్యూ4) కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ నికర లాభం స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన 18 శాతం వృద్ధితో రూ.4,133 కోట్లకు చేరుకుంది. మొత్తం ఆదాయం రూ.15,285 కోట్లకు పెరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరం మొత్తానికి బ్యాంక్‌ లాభం 26 శాతం వృద్ధితో రూ.13,782 కోట్లకు, మొత్తం ఆదాయం రూ.56,072 కోట్లకు చేరుకుంది. మరిన్ని ముఖ్యాంశాలు..

  • క్యూ4లో కోటక్‌ బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) వార్షిక ప్రాతిపదికన 13 శాతం పెరిగి రూ.6,909 కోట్లకు చేరుకోగా.. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎన్‌ఐఐ 21 శాతం వృద్ధితో రూ.25,993 కోట్లుగా నమోదైంది. కాగా, నికర వడ్డీ మార్జిన్‌ 5.28 శాతంగా నమోదైంది.

  • మార్చి 31 నాటికి బ్యాంక్‌ మొండి బకాయిలు లేదా స్థూల నిరర్థక ఆస్తులు (గ్రాస్‌ ఎన్‌పీఏ) 1.39 శాతానికి, నికర ఎన్‌పీలు 0.34 శాతానికి తగ్గాయి.

  • మార్చి చివరి నాటికి బ్యాంక్‌ రుణాలు వార్షిక ప్రాతిపదికన 20 శాతం వృద్ధితో రూ.3.9 లక్షల కోట్లకు చేరుకోగా.. డిపాజిట్లు 23 శాతం పెరిగి రూ.4.45 లక్షల కోట్లకు ఎగబాకాయి.

  • గత ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్‌ వాటాదారులకు రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.2 డివిడెండ్‌ను ప్రకటించింది.


ఆర్‌బీఐ ఆంక్షలతో ప్రభావం చాలా తక్కువే: వాస్వానీ

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తమ వ్యాపారంపై విధించిన ఆంక్షల ఆర్థిక ప్రభావం చాలా తక్కువే అయినప్పటికీ, బ్యాంక్‌ పేరు ప్రతిష్ఠలకు నష్టం చేకూరుతుందని ఆందోళన చెందుతున్నట్లు కోటక్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ అశోక్‌ వాస్వానీ అన్నారు. ఆర్‌బీఐ ఆంక్షలు మరికొన్ని నెలల పాటు కొనసాగవచ్చని ఆయన ఈ సందర్భంగా సంకేతాలిచ్చారు. కోటక్‌ మహీంద్రా ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ చానెళ్ల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా, కొత్త క్రెడిట్‌ కార్డులు జారీ చేయకుండా గత నెలలో ఆర్‌బీఐ నిషేధం విధించింది. బ్యాంక్‌ ఐటీ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థలో లోపాలను గుర్తించిన నేపథ్యంలో ఆర్‌బీఐ బ్యాంక్‌పై క్రమశిక్షణ చర్యలు చేపట్టింది.

Updated Date - May 05 , 2024 | 06:13 AM