Share News

స్ట్రాంగ్‌రూమ్‌లకు మూడంచెల భద్రత

ABN , Publish Date - May 18 , 2024 | 01:02 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన గదుల (స్ట్రాంగ్‌రూమ్‌) వద్ద మూడంచెల భద్రతా ఏర్పాటుచేశారు.

స్ట్రాంగ్‌రూమ్‌లకు మూడంచెల భద్రత

  • తొలి అంచెలో రాష్ట్ర పోలీసులు

  • రెండో అంచెలో ప్రత్యేక పోలీసులు

  • గదుల చుట్టూ వలయంగా కేంద్ర బలగాలు

  • ప్రతిరోజు తనిఖీలు...సీసీ కెమెరాలు ఏర్పాటు

విశాఖపట్నం, మే 17 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన గదుల (స్ట్రాంగ్‌రూమ్‌) వద్ద మూడంచెల భద్రతా ఏర్పాటుచేశారు. సా్ట్రంగ్‌ రూమ్‌ల వద్ద కేంద్ర బలగాలు (సీఐఎస్‌ఎఫ్‌ జవాన్లు) కాపలా ఉంటాయి. మధ్యలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ప్రత్యేక పోలీసులు, బయట ప్రధాన గేటు వద్ద సివిల్‌ పోలీసుల బందోబస్తు ఉంటుంది. ఈ మూడంచెలలో 24 గంటలపాటు సిబ్బంది మూడు షిఫ్టులలో పనిచేస్తారు. స్ట్రాంగ్‌రూమ్‌లకు తాళాలు వేసి సీల్‌ వేశారు. ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాలలోని న్యూ క్లాస్‌రూమ్‌ కాంప్లెక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌, కెమికల్‌, ఇనుస్ట్రుమెంటేషన్‌ విభాగాలతోపాటు ప్రిన్సిపాల్‌ భవనంలో ఈవీఎంలు భద్రపరిచారు. ఈవీఎంల భద్రతపై జిల్లా ఎన్నికల అధికారి, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్వోలు, నగర పోలీస్‌ కమిషనర్‌తోపాటు పోటీలో అభ్యర్థులు లేదా వారి తరపున జనరల్‌ ఏజెంట్లు ప్రతిరోజు తనిఖీ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలు, మధ్యాహ్నం రెండు గంటలు, రాత్రి పది గంటల సమయంలో ఒకసారి ఈవీఎంలు భద్రపరిచిన గది వద్దకు వెళ్లి తాళాలు, దానిపై వేసిన సీల్‌ను పరిశీలించుకోవచ్చు. కాగా శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, సీపీ రవిశంకర్‌ అయ్యనార్‌లు, అభ్యర్థులు, జనరల్‌ ఏజెంట్ల సమయంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భద్రతకు తీసుకుంటున్న చర్యలను కలెక్టర్‌ వివరించారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. అన్ని విభాగాల అధికారులు, పోలీస్‌ సిబ్బంది విధి నిర్వహణపై ఆరా తీశారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలు భద్రపరిచిన గదులకు వేసిన సీళ్లను పరిశీలించారు. పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మల్లికార్జున అక్కడ లాగ్‌ బుక్స్‌లో సంతకం చేశారు.

Updated Date - May 18 , 2024 | 01:02 AM