Share News

బరిలో ఆరుగురే...

ABN , Publish Date - May 05 , 2024 | 01:51 AM

రాష్ట్రం మొత్తం మీద అతి తక్కువగా ఆరుగురు అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్న నియోజకవర్గంగా చోడవరం రికార్డు సృష్టించింది.

బరిలో ఆరుగురే...

  • చోడవరం అసెంబ్లీ సెగ్మెంట్‌ రికార్డు

  • రాష్ట్రంలో అతి తక్కువ అభ్యర్థులు పోటీలో ఉన్న నియోజకవర్గంగా గుర్తింపు

రాష్ట్రం మొత్తం మీద అతి తక్కువగా ఆరుగురు అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్న నియోజకవర్గంగా చోడవరం రికార్డు సృష్టించింది. ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, వైసీపీ అభ్యర్థిగా కరణం ధర్మశ్రీ, కాంగ్రెస్‌ అభ్యర్థిగా జగతా శ్రీనివాసరావు, బీఎస్‌పీ అభ్యర్థిగా వేగి మహలక్ష్మినాయుడు, సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ పార్టీ అభ్యర్థిగా సవరాల గణేష్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పేరిచర్ల వివేకరాజులు బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎనిమిది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, ప్రధాన టీడీపీ, వైసీపీలకు డమ్మీలుగా వేసిన ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లను అధికారులు స్ర్కూటినీలో తిరస్కరించడంతో, కేవలం ఆరుగురు మాత్రమే రంగంలో మిగిలారు. చోడవరం నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో తొమ్మిది మంది పోటీలో ఉండగా, ఈసారి ఆ సంఖ్య ఆరుకు తగ్గిపోయింది. గత ఎన్నికల్లో ముగ్గురు ఇండిపెండెంట్లు పోటీలో ఉండగా, ఈసారి కేవలం ఒక్కరే బరిలో ఉన్నారు.

- చోడవరం

మద్రాస్‌ ప్రెసిడెన్సీలో ఎమ్మెల్యేగా కొయ్యూరు ప్రాంత వాసి

1937లో భద్రాచలం నియోజకవర్గం నుంచి పెద్దిపడాల్‌ ఎన్నిక

కొయ్యూరు, మే 2:

మన్యం పితూరీలో పాల్గొన్నందుకు మండలంలో పెదమాకవరానికి చెందిన పనసల పెద్దిపడాల్‌ రెండు సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అనుభవించారు. అనంతరం 1937లో మద్రాస్‌ ప్రెసిడెన్సీ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా భద్రాచలం నుంచి పెద్దిపడాల్‌ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పెద్దిపడాల్‌ అప్పటి గూడెం ముఠాకు చెందిన మాకవరం (ప్రస్తుతం కొయ్యూరు మండలంలో చేరిన పెద మాకవరం) భూస్వామి. ఆయనకు 1922-24 మధ్య జరిగిన అల్లూరి మన్యం పితూరీలో పాల్గొన్నందుకు రెండు సంవత్సరాలు కారాగార శిక్ష పడింది. ఆయన ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్‌కు వెళ్లడంతో శిక్ష రద్దయ్యింది. అనంతరం పెద్దిపడాల్‌ శరభన్నపాలేనికి మకాం మార్చారు. బ్రిటీష్‌ ఇండియా ప్రభుత్వం మొత్తం 11 ప్రావిన్సులకు 1937లో ఎన్నికలు నిర్వహించగా జస్టిస్‌, కాంగ్రెస్‌లు పోటీ చేశాయి. మద్రాస్‌ ప్రెసిడెన్సీలో గల భద్రాచలం నియోజకవర్గం భద్రాచలం నుంచి సాలూరు వరకూ ఉండేది. ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పనసల పెద్దిపడాల్‌ (గిరిజన భగత తెగ) పోటీ చేసి గెలుపొందారు. అప్పటి మద్రాస్‌ ప్రావిన్సీకు ముఖ్యమంత్రిగా చక్రవర్తి రాజగోపాలాచారి అయ్యారు. రెండో ప్రపంచ యుద్ధంలో భారత దేశ ప్రమేయానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్‌ సభ్యులంతా రాజీనామా చేశారు. అయితే రాజీనామాకు కొద్ది నెలల ముందే పెద్దిపడాల్‌ పదవిలో ఉండగానే చనిపోయారు. పెద్దిపడాల్‌ తమ్ముడు కొడుకు పనసల బోడయ్యపడాల్‌ శరభన్నపాలెం సర్పంచ్‌గా, కొయ్యూరు సమితి ఉపాధ్యక్షులుగా పనిచేశారు. 1967లో చింతపల్లి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. పనసల పెద్దిపడాల్‌ చెల్లెలి మనమడు మెట్టడం వీరవెంకటసత్యనారాయణ (ఎంవీవీ సత్యనారాయణ) రెండు పర్యాయాలు చింతపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు.

జంపింగ్‌...జపాంగ్స్‌!!!

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఈ ఎన్నికలు చాలా విచిత్రంగా ఉన్నాయి. మొన్నటి వరకు ఏ నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడో స్పష్టంగా అందరికీ తెలుసు. ఫలానా అంటే...ఏ పార్టీయో చెప్పగలిగే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా లేదు. చాలా మంది పార్టీలు మారిపోతున్నారు. ఎప్పుడు..ఎవరు..ఎందుకు మారుతున్నారో తెలియడం లేదు. మెడలో కండువా చూసి, పక్కనున్న పెద్ద నాయకుడిని చూసి...‘ఓహో...! సారు.. పార్టీ మారిపోయారన్న మాట’ అని అనుకోవలసి వస్తోంది. ఎమ్మెల్యే టికెట్‌ కోసం చివరి వరకు ప్రయత్నం చేసి ఇక రాదని నిర్ధారించుకున్నాక పలువురు ఇతర పార్టీల్లోకి మారిపోతున్నారు. మరికొందరు ఒక పార్టీ తరఫున గెలిచి, వేరే పార్టీతో నాలుగున్నరేళ్లు అంట కాగి...ఇప్పుడు మళ్లీ గెలిచిన పార్టీలోకే వస్తున్నారు. పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన వారిని కూడా మళ్లీ చేర్చుకుంటున్నారు. అనేక మంది కార్పొరేటర్లది ఇదే పరిస్థితి. రాజకీయ అవసరాలు మరి అని అనుకోవలసి వస్తోంది.

Updated Date - May 05 , 2024 | 01:51 AM