Share News

దాడులపై గోప్యత!

ABN , Publish Date - May 05 , 2024 | 01:58 AM

విశాఖ తూర్పు వైసీపీ అభ్యర్థి, ఎంపీ ఎంవీవీ సత్య నారాయణ ఇంట్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకూ సోదాలు జరిపిన అధికారులు వివరాలను వెల్లడించడంలో మాత్రం గోప్యత పాటిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దాడులపై గోప్యత!

ఎంపీ ఎంవీవీ ఇంట్లో తెల్లవారుజాము వరకు సోదాలు

వివరాలు వెల్లడించని అధికారులు

చీరలు, టీషర్టులు, 1000 ఆటో డ్రైవర్ల యూని ఫాం, రూ.30 వేల నగదు, మూడు వాచీలు

స్వాధీనం చేసుకున్నట్టు వివరించిన పోలీసులు

విశాఖపట్నం/పెదవాల్తేర్‌, మే 4 (ఆంధ్రజ్యోతి):

విశాఖ తూర్పు వైసీపీ అభ్యర్థి, ఎంపీ ఎంవీవీ సత్య నారాయణ ఇంట్లో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకూ సోదాలు జరిపిన అధికారులు వివరాలను వెల్లడించడంలో మాత్రం గోప్యత పాటిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సంఘానికి చెందిన సీ విజిల్‌ యాప్‌ ద్వారా అందిన ఫిర్యాదు మేరకు లాసన్స్‌బే కాలనీలోని ఎంవీవీ ఇంట్లో శుక్రవారం రాత్రి 7.40 గంటల నుంచి శనివారం తెల్లవారుజాము సుమారు 2.30 గంటల వరకు మూడు ఫ్ౖలయింగ్‌ బృందాలు తనిఖీలు చేశాయి. ఈ దాడుల్లో పట్టుకున్న వస్తువులు, నగదుపై ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం మినహా పట్టుకున్న వస్తువులు, నగదుపై జిల్లా ఎన్నికల అఽధికారి నేతృత్వంలో పనిచేసే ఫ్ౖలయింగ్‌ స్క్వాడ్‌ గాని, మీడియా విభాగం గానీ అధికారికంగా ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు.

ఉన్నత స్థాయి ఒత్తిడే కారణమా?

ఈ వ్యవహారంలో అధికార పార్టీ నుంచి ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయనే ప్రచారం సాగుతోంది. ఎన్నికల అధికారులెవరూ ఈ విషయంపై మాట్లాడకపోవడం, ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసిన అనంతరం పోలీసులు వివరాలు వెల్లడించడం మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. పోలీసులు అందించిన వివరాల మేరకు...ఎంవీవీ ఇంట్లో 500 చీరలు, 400 టీషర్టులు, 1000 ఆటోడ్రైవర్ల యూనిఫాంలు, మూడు వాచీలు, రూ.30 వేల నగదు, ఎన్నికల ప్రచార సామగ్రి లభించింది. దీనికి సంబంధించి ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌లో ప్రదీప్‌ అనే ఫ్ౖలయింగ్‌ స్క్వాడ్‌కు చెందిన అధికారి ఫిర్యాదు చేశారు. ఇదిలావుండగా మూడు బృందాలుగా వచ్చిన సుమారు 25 మంది సిబ్బంది ఏకంగా ఆరేడు గంటలపాటు సోదాలు నిర్వహించి కేవలం చీరలు, టీషర్టులే పట్టుకున్నారా?...అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటితోపాటు ఓటర్లకు ఇచ్చేందుకు సిద్ధం చేసిన కూపన్లు భారీగా స్వాధీనం చేసుకున్నా వాటి వివరాలు వెల్లడించలేదని స్థానికులు చెబుతున్నారు. కాగా వారం క్రితం మర్రిపాలెంలో విశాఖ దక్షిణ వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్‌కుమార్‌కు చెందిన రామబాణం కళాశాలలో స్వాధీనం చేసుకున్న రూ.67 లక్షలకు సంబంధించి పోలీసులే వివరాలు వెల్లడించారు. అధికారులు పెదవి విప్పలేదు. జిల్లాలో ఇటీవల నిర్వహించిన దాడులకు సంబంధించి మొత్తం వివరాలను కలెక్టర్‌ నాలుగు రోజుల క్రితం వెల్లడించారు. కానీ పెద్దస్థాయిలో దాడులు జరిగినప్పుడు మాత్రం ఆయన మీడియాకు దూరంగా ఉంటున్నారు.

Updated Date - May 05 , 2024 | 01:58 AM