Share News

ఒక్క చాన్స్‌కే...చుక్కలు చూపించారు

ABN , Publish Date - May 05 , 2024 | 01:50 AM

‘ఒకే ఒక్క చాన్స్‌’ అంటూ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గడిచిన ఎన్నికల్లో చేసిన ప్రచారానికి అండగా నిలబడి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలకు...ఐదేళ్లలో ఆయన చుక్కలు చూపించారు.

ఒక్క చాన్స్‌కే...చుక్కలు చూపించారు

  • రోజువారీ కూలీ నుంచి ప్రభుత్వ ఉద్యోగి వరకూ... అందరిలోనూ అదే భావన

  • జగన్‌ ఐదేళ్ల పాలనపై అన్ని వర్గాల్లోనూ అసంతృప్తి

  • కుడి చేత్తో పది ఇచ్చి...ఎడమచేత్తో వంద లాక్కొన్నారనే భావనే

  • ఇసుక సమస్యతో పనులు దొరకడం లేదంటున్న భవన నిర్మాణ కార్మికులు

  • ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగులు, చేతివృత్తిదారులు, కాంట్రాక్టర్లు...అన్ని వర్గాల్లోనూ ఆగ్రహం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘ఒకే ఒక్క చాన్స్‌’ అంటూ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గడిచిన ఎన్నికల్లో చేసిన ప్రచారానికి అండగా నిలబడి అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలకు...ఐదేళ్లలో ఆయన చుక్కలు చూపించారు. ఆలోచనా రహిత నిర్ణయాలతో రోజువారీ కూలీల మొదలు ప్రభుత్వ ఉద్యోగుల వరకూ అన్ని వర్గాలను ఇబ్బందులకు గురిచేశారు. గడిచిన ఐదేళ్లలో జీవన స్థితిగతుల్లో మార్పులు రాకపోగా, ఇంకా దుర్భరంగా మారాయని పలువురు వాపోతున్నారు.

పాలనపై తీవ్ర అసంతృప్తి

వైసీపీ పాలనపై ఏ వర్గాన్ని కదిపినా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉద్యోగులు ఒక భాగం. అటువంటి ఉద్యోగులే ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. డీఏలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ చెల్లింపుల్లోనూ తీవ్ర అన్యాయం చేశారంటున్నారు. గడిచిన ఎన్నికల్లో సీఎం జగన్‌ అధికారంలోకి రావాలని బలంగా కోరుకున్న ప్రభుత్వ ఉద్యోగులంతా ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్నారు. జగన్‌ ప్రభుత్వ హయాంలో జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. అలాగే అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తామంటూ ఇచ్చిన హామీని జగన్‌ పూర్తిగా విస్మరించారని గుర్తుచేస్తున్నారు. వేలాది మంది పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు బెనిఫిట్స్‌ చెల్లించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్న భావనను వ్యక్తం చేస్తున్నారు.

ఇక, ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కీలకంగా వ్యవహరించిన మరో వర్గం భవన నిర్మాణ కార్మికులు. దాదాపు గడిచిన ఎన్నికల్లో వీరంతా వైసీపీ అధినేత జగన్‌ అధికారంలోకి రావాలని బలంగా కోరుకున్నారు. అయితే, అధికారంలోకి వచ్చిన తరువాత నూతన ఇసుక విధానం కారణంగా ధర పెరగడంతో పాటు కొరత రావడంతో నిర్మాణ రంగం కుదేలైపోయింది. గడిచిన ఐదేళ్లలో నిర్మాణ రంగంలో పనులు నత్తనడకన సాగుతుండడంతో భవన నిర్మాణ రంగ కార్మికులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆటో డ్రైవర్లు కూడా గడిచిన ఎన్నికల్లో జగన్‌ అధికారంలోకి రావడానికి తీవ్రంగా కృషిచేశారు. ఏడాదికి పది వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నా...అంతకు రెండు, మూడు రెట్లు అధికంగా పెనాల్టీలు, చలానాలు పేరుతో ఈ ప్రభుత్వం దోచుకుంటోందని ఆటో డ్రైవర్‌ రాజేశ్వరరావు వాపోయారు. 15 ఏళ్లుగా ఆటో నడుపుతున్నానని, తానెప్పుడూ ఐదేళ్లలో కట్టినంతగా చలానాలు చెల్లించలేదని పేర్కొన్నారు.

నిరుద్యోగులకు జెల్ల

వైసీపీ ప్రభుత్వంలో తీవ్రంగా నష్టపోయిన మరో వర్గం నిరుద్యోగులు. గడిచిన ఐదేళ్లలో తమకు వైసీపీ సర్కారు తీరని అన్యాయం చేసిందని నిరుద్యోగులు పేర్కొంటున్నారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌, మెగా డీఎస్సీ, ప్రభుత్వ శాఖల్లో వేలాదిగా ఉన్న ఖాళీలు భర్తీ చేస్తానంటూ...నమ్మించి సీఎం జగన్‌ నట్టేట ముంచాడని నిరుద్యోగులు వాపోతున్నారు. ఐదేళ్లలో ఒక్క టీచర్‌ పోస్టు కూడా భర్తీ చేయలేదని, ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఇచ్చిన పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామక ప్రక్రియను పూర్తి కూడా చేయలేకపోయారని జ్ఞానేంద్ర అనే నిరుద్యోగి వాపోయాడు. ఉమ్మడి విశాఖ జిల్లాలో కనీసం రెండు లక్షల మంది నిరుద్యోగులు జాబ్‌ క్యాలెండర్‌ కోసం ఆశగా ఎదురు చూశారని, వారి ఆశలపై జగన్‌ నీళ్లు చల్లారని పలువురు స్నేహలత అనే డీఎస్సీ అభ్యర్థి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

చేతి వృత్తులకు ఏదీ సాయం..?

గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పొందేందుకు అనుగుణంగా యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చేవారు. ఈ రుణాలతో డెయిరీ ఫామ్‌, కోళ్ల ఫారాలు, చిరు దుకాణాలు, ఆయిల్‌ మిల్స్‌, ఇతర పరిశ్రమలు ఏర్పాటుచేసుకుని వారు ఉపాధి పొందడంతోపాటు...నలుగురికి ఉపాధి కల్పించేవారు. కానీ, గడిచిన ఐదేళ్లలో చేతి వృత్తులకు, ఆయా వర్గాలకు సాయాన్ని అందించకపోవడంతో వారంతా ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం లేకుండా పోయింది. చేతి వృత్తులను ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టలేదని రజకుడు అప్పారావు ఆవేదన వ్యక్తంచేశారు. తానూ ఈ వృత్తిని వదల్లేక చేస్తున్నానని పేర్కొన్నాడు.

ఆర్థిక భారం మోపిన జగన్‌..

గడిచిన ఐదేళ్లుగా సీఎం జగన్‌ బటన్‌ నొక్కుడుతోనే ప్రభుత్వాన్ని నడిపారు. కుడి చేత్తో పది ఇచ్చి..ఎడమ చేత్తో వంద లాగేసినట్టుగా పాలన సాగిందన్న భావనను ఆయా వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. నిత్యావసర సరకులు, విద్యుత్‌ చార్జీలు ఽఆర్థికంగా భారంగా మారాయని పలువురు పేర్కొంటున్నారు. గతంలో పోలిస్తే సాధారణ, మధ్య తరగతికి చెందిన ఒక్కో కుటుంబంపై నెలకు కనీసం రూ.3,000 నుంచి రూ.8,000 వరకు భారం అదనంగా పెరిగిందని పేర్కొంటున్నారు. విద్యుత్‌ చార్జీలు సంగతి సరే సరి. గతంలో రూ.250 విద్యుత్‌ బిల్లు వస్తే..జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత రెండు, మూడు రెట్లు బిల్లులు పెరిగిపోయాయని రామారావు అనే ప్రైవేటు ఉద్యోగి వెల్లడించాడు.

కాంట్రాక్టర్ల ఇదే బాధ..

ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని కాంట్రాక్టర్లు, వ్యాపారులు కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా చితికిపోయారు. కోట్లాది రూపాయల బిల్లులను ఈ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఒక్క విశాఖ జిల్లాకు సంబంధించి సుమారు మూడు వేల కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు చెబుతున్నారు. ఆయా పనులు చేసిన వందలాది మంది కాంట్రాక్టర్లు ఆర్థికంగా చితికిపోయారు. బిల్లులు క్లియర్‌ చేయించుకోవడానికి ప్రభుత్వ పెద్దలు, అధికారులు చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందని వారంతా వాపోతున్నారు.

ఇంటిని గుల్ల చేస్తున్న మద్యం

వైసీపీ సర్కార్‌ వల్ల పొందిన లబ్ధి పొందిన కుటుంబాలు కంటే..జగన్‌ తీసుకువచ్చిన నాసిరకం మద్యంతో నాశనమైన కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మద్యం రేట్లను జగన్‌ ప్రభుత్వం భారీగా పెంచేసింది. ఈ పెరిగిన ధరలతో ఆర్థికంగా ఆయా కుటుంబాలు నష్టపోవడమే కాకుండా..నాసిరకం మద్యంతో ఎంతోమంది తీవ్ర అనారోగ్యాలకు గురయ్యారు. డబ్బుతోపాటు ఆరోగ్యమూ పోయిందని, నాసిరకం మద్యం ఎంత తాగినా మత్తు వచ్చేది కాదని, తాగుతున్న కొద్దీ తాగాలనిపిస్తూ ఉంటుందని రాజు అనే కూలీ పేర్కొన్నాడు. నాసిరకం మందును తెచ్చి..మందుబాబులు జీవితాలను నాశనం చేశాడని పేర్కొన్నాడు.

ఆదాయం కంటే ఖర్చులు అధికమయ్యాయి

- పారిసిరెడ్డి అప్పలరాజు, హమాలీ మేస్ర్తీ

హమాలీల పరిస్థితి దారుణంగా మారింది. ఏళ్ల తరబడి ఇదే వృత్తిని నమ్ముకుని ఉన్నా...కుటుంబ పోషణకు సరిపడా ఆదాయం కూడా రావడం లేదు. ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు కష్టపడితే రూ.600 కూలీ రావడం కూడా కష్టమవుతోంది. మరోపక్క ఇంటి అద్దె, కరెంట్‌ చార్జీలు, పెట్రోల్‌ ధరలు అన్నీ పెరిగిపోయాయి. స్కూల్‌ ఫీజులు, నిత్యావసర సరకుల ధరలతో అల్లాడుతున్నాం. చాలీ,చాలని రోజువారీ ఆదాయంతో ఇంటి నడపడం కష్టమవుతోంది. గడిచిన మూడేళ్ల నుంచి చేసేందుకు పని కూడా పెద్దగా దొరకడం లేదు. ఏళ్ల నుంచి నమ్ముకుని వృత్తిని వదులుకోలేకపోతున్నాం. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా భరిస్తున్నాం. ప్రభుత్వం మా లాంటి వారిని ఆదుకోవాలి. సరైన కూలీ లభించేలా చర్యలు తీసుకోవాలి.

పనులు దొరకడం లేదు

- సీహెచ్‌ శ్రీనివాసరావు, వుడ్‌ వర్కర్‌

గడిచిన 20 ఏళ్ల నుంచి వుడ్‌ వర్కర్‌గా పనిచేస్తున్నా. పనికి వెళితే రోజుకు వేయి రూపాయలు వస్తుంది. గతంలో నెలలో కనీసం 25 రోజులు పని దొరికేది. గడిచిన కొన్నాళ్ల నుంచి పనిచేద్దామన్నా దొరకడం లేదు. పనులు పూర్తిగా తగ్గిపోయాయి. ఇసుక, సిమెంట్‌, ఇతర ధరలు పెరిగిపోవడంతో నిర్మాణ రంగంలో పనులు నిలిచిపోయాయి. దీంతో మాకూ పని దొరకడం లేదు. రెండు, మూడు రోజులు కూడా పని దొరకడం లేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా. పెరిగిన చార్జీలు, నిత్యావసర సరకుల ధరలతో కుటుంబాన్ని నెట్టుకురావడం కష్టమవుతోంది. ప్రతినెలా అప్పులు చేస్తున్నా. గతంలో నెలకు రూ.25 వేలు ఆదాయం వస్తే..ఖర్చులన్నీ పోను ఐదారు వేలు మిగిలేవి. ఇప్పుడు ఆదాయం లేకపోగా, ఖర్చులు భారీగా పెరిగాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత రూపాయి ఆదాయం లేదు. పెరిగిన ధరలతో గతంతో పోలిస్తే నెలకు అదనంగా నాలుగు వేలు ఖర్చు అవుతోంది. ఇంటి అద్దె, ఇతర ఖర్చులతో కలిపి నెలకు రూ.17 వేలు అవసరం అవుతోంది.

చుక్కలు కనిపిస్తున్నాయి.. ఘోరంగా పరిస్థితి

- టి.ఉదయ్‌, పెయింటింగ్‌ వర్కర్‌

గడిచిన ఐదేళ్లుగా ఆర్థికంగా చితికిపోయాం. పెరిగిన రేట్లుతో నెలకు రూ.4 వేలు వరకు అదనపు భారం పెరిగింది. పెయింటింగ్‌ పనికి వెళితే రూ.700 వరకు వస్తుంది. పాత ఇళ్లకు ఏమైనా పెయింటింగ్‌ వర్క్స్‌ ఉంటే వేస్తున్నాం. కొత్త భవనాల పనులు ఏడాదిలో 20కు మించి దొరకడం లేదు. గతంలో పదుల సంఖ్యలో కొత్త భవనాల పెయింటింగ్‌ వర్క్‌ చేయడానికి పనులు లభించేవి. పెరిగిన రేట్లతో పనికి వెళ్లినప్పుడు బయట భోజనం కూడా చేయలేని పరిస్థితి. గతంలో అన్నా క్యాంటీన్‌ ఉంటే అక్కడే తినేసేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. ప్రతిరోజూ పని కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. చేతిలో నైపుణ్యం ఉండి కూడా పని దొరకడం లేకపోవడం దారుణం. జగన్‌ వచ్చి ఏదో చేస్తాడనుకుంటే.. మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. పనుల్లేకుండా చేశాడు. ఎవరికి చెప్పుకోవాలో కూడా మా బాధ తెలియడం లేదు.

స్వర్ణకారులకు అన్యాయం

- పక్కి కొండబాబు, రాష్ట్ర స్వర్ణకారుల సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం స్వర్ణకారులకు, విశ్వబ్రాహ్మణులకు తీవ్ర అన్యాయం చేసింది. ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లేకపోడంతో ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్వర్ణకారులను అన్ని విధాలుగా ఆదుకున్నారు. ఆదరణ పథకంలో భాగంగా గోల్డ్‌ వైర్లు (తీగలు) చేసే మెషిన్లు, ఉంగరాలు సైజ్‌ చేసే మెషిన్లు, రేకులు తీసే మెషిన్లు అందించారు. సబ్సిడీతో కూడిన రుణాలను అందించి ఆర్థికంగా చేయూతనిచ్చారు. జిల్లావ్యాప్తంగా 40 వేల మంది స్వర్ణకారులు చేసేందుకు పనులు లేక వృత్తికి దూరమయ్యారు. ప్రభుత్వం స్వర్ణకారులను ఆదుకునేందుకు కనీస చర్యలను చేపట్టలేదు. స్వర్ణకారులకు ఇచ్చిన అనేక హామీలను జగన్‌ ప్రభుత్వం విస్మరించింది.

ఇచ్చింది ఈతకాయ-తీసుకున్నది తాటికాయ

కె.సూరిబాబు, ఆటో డ్రైవర్‌, గాజువాక

వైసీపీ పాలనలో వాహనమిత్ర ద్వారా నాలుగేళ్లు రూ.10 వేలు చొప్పున ఇచ్చింది. ఐదో ఏడాది ఇవ్వలేదు. కానీ చాటుగా ఫొటోలు తీసి జరిమానాల రూపంలో రూ.135, 335, 1035, 1135 చొప్పున ప్రతి ఆటోడ్రైవర్‌ వద్ద వసూలు చేయించింది. ఇక రోడ్లు అధ్వానంగా తయారవ్వడంతో పలుమార్లు ఆటోలు మరమ్మతులకు గురయ్యేవి. ఆ ఖర్చులు అదనం. అదేవిధంగా మొదటి ఏడాది ‘వాహనమిత్ర’ డబ్బు అందుకున్న అనేకమంది పేర్లు రెండో ఏడాది జాబితాల్లో లేవు. ఏవో సాకులు చూపించి సుమారు 25 శాతం మందిని పక్కనపెట్టేశారు. ఆటో డ్రైవర్లకు పలు రాయితీలను ఇస్తామన్న ప్రకటనలు కార్యారూపం దాల్చలేదు. ఆటోడ్రైవర్ల సమస్యలపై పలుమార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చినా చర్యలు శూన్యం. మొత్తమ్మీద చూస్తే వైసీపీ ప్రభుత్వం ఆటోడ్రైవర్లకు ఈతకాయ ఇచ్చి తాటికాయ తీసుకున్నట్టుగా వ్యవహరించింది.

Updated Date - May 05 , 2024 | 01:50 AM