Share News

అనుకున్నదొక్కటి...!

ABN , Publish Date - May 05 , 2024 | 02:00 AM

కార్పొరేషన్‌గా ఉన్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు దక్కుతాయని సంబరపడిన ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు నిరాశే ఎదురైంది.

అనుకున్నదొక్కటి...!

  • ప్రభుత్వంలో విలీనంపై ఆర్టీసీ ఉద్యోగుల నిట్టూర్పు

  • లాభం కంటే నష్టమే ఎక్కువ

  • సంజీవిని లాంటి మెడిక్లెయిమ్‌ రద్దు

  • వైసీపీ హయాంలో కొత్తబస్సుల కొనుగోలుకీ బడ్జెట్‌ నిల్‌

  • ఖాళీల భర్తీకీ లభించని గ్రీన్‌సిగ్నల్‌

  • 3,600 డ్రైవర్‌ పోస్టుల భర్తీ ప్రతిపాదన బుట్టదాఖలు

  • మెడికల్‌ అన్‌ఫిట్‌ అయితే ప్రత్యామ్నాయం కరవు

  • సర్కారు తీరుపై ఆర్టీసీ ఉద్యోగులు/కార్మికుల్లో అసంతృప్తి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కార్పొరేషన్‌గా ఉన్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు దక్కుతాయని సంబరపడిన ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు నిరాశే ఎదురైంది. కొత్తగా ఒకటి, రెండు ప్రయోజనాలు మినహా ఉన్న వాటిలో పీకేసినవే ఎక్కువ కావడంతో ఎటూ పాలుపోని స్థితిలో దిక్కులు చూడాల్సిన పరిస్థితిలో ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు.

ఆవిర్భావం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్పొరేషన్‌గా ఆర్టీసీ కార్యకలాపాలు సాగిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత 62 వేల మంది ఉద్యోగులతో ఉన్న ఆర్టీసీని అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో విలీనం చేస్తామని పాదయాత్ర సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో తమ తలరాతలు మారిపోతాయని భావించిన ఆర్టీసీ కార్మికులు గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతు తెలిపారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ ఒత్తిడి చేశారు. ఈ మేరకు 2022లో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనమైంది. వెంటనే ప్రభుత్వ ఉద్యోగులతోపాటే పీఆర్సీని వర్తింపజేయడంతో ఉద్యోగులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ప్రతి ఆరేళ్లకు ఒకసారి పదోన్నతి లభించకపోతే ఏఏఎస్‌ఎల్‌ కింద ఒక ఇంక్రిమెంట్‌ పొందే అవకాశం అందుబాటులోకి వచ్చిందని సంబరపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌) అమలుచేస్తామని వైసీపీ హామీ ఇచ్చినందున ఆ సదుపాయం తమకు కూడా దక్కుతుందనుకున్నారు. తీరా ప్రభుత్వం చేతులెత్తేయడంతో నీరుగారిపోయారు.

కోల్పోయినవే ఎక్కువ...

ఇదిలావుంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంలో అప్పటివరకూ పొందిన ప్రయోజనాల్లో చాలావాటిని కోల్పోయామని ఉద్యోగులు, కార్మికులు వాపోతున్నారు. కార్పొరేషన్‌గా ఉండగా ఉద్యోగి/కార్మికుడు అనారోగ్యానికి గురైనా, వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కార్పొరేట్‌, ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందినా, శస్త్రచికిత్స అవసరమైనా సంస్థ రూ.కోటి వరకూ భరించేది. అయితే ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఆ సదుపాయాన్ని కోల్పోయామంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఈహెచ్‌ఎస్‌) అమలవుతోంది. ఉద్యోగులు ప్రతినెలా రూ.250 చొప్పున చెల్లిస్తే ప్రభుత్వమే వైద్య ఖర్చులను భరిస్తుంది. అయితే ప్రస్తుతం ఈహెచ్‌ఎస్‌ కింద కేవలం దంతాలు, కంటిచూపునకు సంబంధించిన వైద్యం మాత్రమే అందుతోందంటున్నారు. అది కూడా కొన్ని ఆస్పత్రులకే పరిమితం చేయడంతో సరైన వైద్యం అందడం లేదని ఆర్టీసీ ఉద్యోగులు వాపోతున్నారు.

కొత్తబస్సుల్లేవు...

గతంలో కొత్త బస్సులు కొనుగోలుకు ప్రభుత్వాలు ఏటా రూ.200 కోట్లు వరకూ కేటాయించేవి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిధుల మంజూరు నిలిచిపోయింది. దీంతో కొత్త బస్సులు కొనుగోలుకు అవకాశం లేక ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని కార్మికులు గగ్గోలు పెడుతున్నారు.

ఖాళీల భర్తీపై నిర్లక్ష్యం

రాష్ట్ర విభజన నాటికి ఆర్టీసీలో 62 వేల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, సంస్థ ప్రభుత్వంలో విలీనం అయ్యే సమయానికి ఆ సంఖ్య 52 వేలకు, ప్రస్తుతం 48 వేలకు తగ్గిపోయిందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఖాళీల భర్తీ విషయంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శిస్తున్నారు. టీడీపీ హయాంలో 3,600 డ్రైవర్‌ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలను సిద్ధం చేశారని, వైసీపీ వచ్చిన తరువాత దానిపై కదలిక లేదని నిట్టూరుస్తున్నారు. పైగా ఆర్టీసీ బస్సుల కొనుగోలుకు బడ్జెట్‌ కేటాయింపులు నిలిపివేసి, అద్దె బస్సుల సంఖ్యను పెంచడం ద్వారా ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఉద్యోగులు, కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వంలోని ఇతర శాఖలతో పోల్చితే ఆర్టీసీలోనే ఉద్యోగుల మరణాలు ఎక్కువని, ప్రతి నెలా సగటున 26 నుంచి 29 మంది వివిధ కారణాలతో మృత్యువాతపడుతున్నారన్నారు. కేన్సర్‌, పక్షవాతం, అంగవైకల్యం వంటి వాటికి గురైనవారికి మాత్రమే కారుణ్య నియామకాలకు అవకాశం కల్పించి, ఇతరత్రా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిని నిర్లక్ష్యం చేస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. అనారోగ్య కారణాలతో డ్రైవర్‌, మెకానిక్‌ వంటి ఉద్యోగాలకు అన్‌ఫిట్‌గా మారుతున్నారని, అలాంటివారు రాష్ట్రవ్యాప్తంగా 220 మంది ఉన్నారని, వారికి ప్రత్యామ్నాయం చూపించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు.

Updated Date - May 05 , 2024 | 02:00 AM