Share News

9 గంటల కరెంట్‌ ఉత్తిమాటే..

ABN , Publish Date - May 05 , 2024 | 01:12 AM

వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు నాణ్యత గల విద్యుత్‌ సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం.. దానిని అమలు చేయడంలో విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

9 గంటల కరెంట్‌ ఉత్తిమాటే..
వ్యవసాయ బోరు

- అమలుకాని జగన్‌ హామీ

- ప్రస్తుతం వ్యవసాయానికి ఏడు గంటలే విద్యుత్‌ సరఫరా

- అది కూడా ఉదయం, సాయంత్రం వేళల్లో..

- అందులోనూ అనధికార కోతలు

- పొలం తడవడం లేదంటూ రైతుల ఆవేదన

చోడవరం, మే 4: వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు నాణ్యత గల విద్యుత్‌ సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం.. దానిని అమలు చేయడంలో విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏడు గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేస్తున్నారని, అది కూడా రెండు విడతల్లో ఉదయం, సాయంత్రం ఇస్తూ ఇందులో కూడా రెండు గంటలు కోత విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత కొన్ని నెలలుగా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా దైవాదీనంగా మారింది. విద్యుత్‌ సరఫరా ఎప్పుడు వస్తుందో, తిరిగి ఎప్పుడు పోతుందో తెలియక పొలాల్లోనే రైతులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు నెలల క్రితం వరకు 9 గంటల పాటు ఒకే విడతలో సరఫరా ఇచ్చేవారు. తరువాత క్రమంగా రెండు విడతలుగా ఉదయం, సాయంత్రం ఇవ్వడం ప్రారంభించారు. ఆ తరువాత నుంచి క్రమంగా విద్యుత్‌ సరఫరా ఏడు గంటలకు పడిపోయింది. ప్రస్తుతం ఓ రోజు నాలుగు గంటలు, మరో రోజు ఐదు గంటలు చొప్పున సరఫరా అవుతోంది. కొన్ని ఫీడర్లలో సక్రమంగా మూడు గంటల పాటు కూడా విద్యుత్‌ సరఫరా ఉండడం లేదని అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్యాన పంటలు వేసిన రైతులతో పాటు చెరకు సాగు చేస్తున్న రైతులకు సైతం సాగునీరు ఎంతో అవసరం. ఇటువంటి పరిస్థితుల్లో విద్యుత్‌ సరఫరా సక్రమంగా ఉండకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరకు దవ్వ ఉడుపులకు, అరటి, సరుగుడు, పామాయిల్‌ తోటలతో పాటు వేరుశనగ, ఇతర ఉద్యాన పంటలు వేసిన రైతులకు సాగునీరు అవసరం ఎక్కువగా ఉంది. దీనికి తోడు పశువులకు అవసరమైన గడ్డి పెంపకానికి కూడా సాగునీరు అవసరం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా సక్రమంగా ఉండకపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. వేసవి నేపథ్యంలో గ్రామాల్లో ఇళ్లకు కూడా అనధికార కోతలు అమలవుతున్నాయి. ఈ క్రమంలోనే వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరాలో అనధికార కోతలు అమలు చేస్తున్నట్టు సమాచారం. దీని వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Updated Date - May 05 , 2024 | 01:12 AM