Share News

మీ ఆస్తుల తనఖాకే ఆ చట్టం

ABN , Publish Date - May 05 , 2024 | 04:26 AM

జనం ఆస్తులను తనఖా పెట్టడానికే జగన్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు తెచ్చారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ దుయ్యబట్టారు.

మీ ఆస్తుల తనఖాకే ఆ చట్టం

మీ భూములను మీకు కాకుండా చేసే కుట్ర: పవన్‌

మీ ఆస్తులపై మీకు నియంత్రణ ఉండదు.. కోర్టుకూ వెళ్లలేరు

మిఽథున్‌రెడ్డో, పెద్దిరెడ్డో, మోపిదేవో మీ భూములు కబ్జాచేసేస్తారు

వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులను మీరే వారి చేతుల్లో పెట్టినట్లే

దొంగ చేతికి మీ అంతట మీరే తాళాలు ఇచ్చినట్లే

జగన్‌ అవినీతి సామ్రాజ్యాన్ని బద్దలు కొడతాం: జనసేనాని

మచిలీపట్నం/గుడివాడ/అవనిగడ్డ/బాపట్ల, మే 4 (ఆంధ్రజ్యోతి): జనం ఆస్తులను తనఖా పెట్టడానికే జగన్‌ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు తెచ్చారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ దుయ్యబట్టారు. ‘ఆ చట్టం ప్రకారం మీ ఆస్తుల మీద మీకు నియంత్రణ ఉండదు. కోర్టు పరిధిలో కూడా లేకుండా చేసి మీ భూములను మీకు కాకుండా చేసే కుట్ర ఇది’ అని స్పష్టం చేశారు. వారాహి విజయభేరి యాత్రలో భాగంగా శనివారం ఆయన కృష్ణాజిల్లా గుడివాడ, అవనిగడ్డ, బాపట్ల జిల్లా రేపల్లెల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. మరో తొమ్మిది రోజుల్లో కూటమి ప్రభుత్వం రావడం ఖాయమని.. ఎన్ని సీట్లు.. ఎంత మెజారిటీ వస్తుందనేది తప్ప అధికారం రావడంపై ఎలాంటి సందేహం లేదని తెలిపారు. ప్రతి కుటుంబానికీ విద్య, వైద్యం, ఉపాధి కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో నోట్లో బూతులు, రోడ్లపై గోతులు తప్ప సాధించింది ఏముందని ప్రశ్నించారు. 151సీట్లతో అధికారాన్ని ఇస్తే కనీసం తాగునీరు, సాగునీటికి కూడా నోచుకోని దుస్థితిలో కృష్ణాడెల్టాలోని తీరప్రాంత గ్రామాలు ఉన్నాయని అన్నారు. వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని బెదిరించి రాజకీయం చేయాలని జగన్‌ చూస్తున్నారని విమర్శించారు. ఇంకా ఏమన్నారంటే..


జిరాక్స్‌తో రుణాలిస్తారా?

మీ ఆస్తులు, భూములు రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటే జిరాక్స్‌ పత్రాలు ఇస్తారు. చిన్న ఇల్లు కట్టుకోవడానికి, బిడ్డలను చదివించుకోవడానికి లోన్లు తెచ్చుకుంటుం టాం. జిరాక్స్‌లతో రుణాలిస్తారా? ఒరిజినల్‌ పట్టాలు లేకుండా రైతులు రుణాలకోసం బ్యాంకులకు వెళ్తే అప్పులు ఇవ్వరు. బిడ్డలకు పసుపుకుంకుమ కింద జిరాక్స్‌ ఇస్తామా? కేంద్రం ముసాయిదా మాత్రమే పంపింది. అమలు చేయాలని చెప్పలేదు. ఈ చట్టంతో దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లే. మిధున్‌రెడ్డో, పెద్దిరెడ్డో లేక మోపిదేవో వచ్చి భూములను కబ్జా చేసేస్తారు. దానిని కోర్టు పరిధిలో లేకుండా చేసేస్తున్నారు. మీరు వైసీపీకి ఓటేస్తే కొరివితో తల గోక్కున్నట్లే. మీ ఆస్తులను మీరే వారిచేతిలో పెట్టినట్లే! జగన్‌ సరిహద్దు రాళ్లపై, భూమిపట్టాలపైనా తన బొమ్మ వేసుకున్నారు. జగన్‌ కుటుంబానికి ఎక్కడెక్కడి ఆస్తులు దోచుకోవడం మీద పిచ్చి ఉంది. జగన్‌ తాతగారి సమయంలో బెరైటీస్‌ గనులకు సంబంధించి దోచుకున్నారు. వీళ్లకు పిడికెడు గింజలు భూమ్మీద చల్లి పైరు పండించడం తెలియదు. మట్టిని తవ్వడం, ఖనిజాలు దోచేయడం, చెట్లు నరికేయడం మాత్రమే తెలుసు. గింజలు వేసి పండిస్తే కదా రైతు కష్టం తెలియడానికి. భూములు దోచుకోవడమే జగన్‌ స్వభావం. రైతులూ ఆలోచించి ఓటేయండి.

రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉండడానికి జగన్‌ పోలీసులను పనిచేయనిస్తే కదా! ఆయనే నేరగాళ్లకు అండగా ఉంటున్నారు. కూటమి ప్రభుత్వం బలమైన లా అండ్‌ ఆర్డర్‌ తీసుకొస్తుంది. పోలీసు వ్యవస్థను బలోపేతం చేసి చూపిస్తాం. చివరికి హోం మంత్రినయినా సరే కానిస్టేబుల్‌కు జవాబుదారీగా ఉండేలా చేస్తాం. రాష్ట్ర పునర్నిర్మాణం బాధ్యతలను కూటమి తీసుకుంటుంది. కూటమి కట్టింది నా కోసమో లేక చంద్రబాబు కోసమో కాదు. రాష్ట్రం కోసమే. నేను బతికుండగా రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను. ఐదేళ్లలో విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఎయిడెడ్‌ స్కూల్స్‌, కళాశాలలను మూసివేశారు. కూటమి అదికారంలోకి రాగానే మెగా డీఎస్సీని విడుదల చేస్తాం. ఏడాదికి 4 లక్షల చొప్పున ఉద్యోగాలు ఇస్తాం, ఆక్వా రైతులను ఆదుకుంటాం. రక్షిత మంచినీటిని ప్రతి ఇంటికీ అందిస్తాం. దివ్యాంగులకు నెలకు రూ.6 వేల పింఛను ఇస్తాం. మంచాన పడినవారికి 15 వేలు, తలసేమీయాతో బాధపడేవారికి 10వేల చొప్పున ఇస్తాం. బూతులు తిట్టే వారిని మోకాళ్లపైన కూర్చోబె డతాం, రోడ్లను బాగుచేయిస్తాం, భగీరథుడిని స్ఫూర్తిగా తీసుకుని పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తాం. పర్యాటకంగా అభివృద్ధి చెందాల్సిన సముద్ర తీర ప్రాంతాన్ని పేకాట క్లబ్‌లకు కేరా్‌ఫగా మార్చేశారు. వైసీపీ వాళ్లకు బానిసలు కావాలి, సమగౌరవం వాళ్లకు నచ్చదు. ఇమడలేకే ఎంపీ బాలశౌరి, రాయుడు వైసీపీని వీడి జనసేనలో చేరారు. ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టం. రానున్న రోజుల్లో అధికార పీఠం మనదే. జగన్‌ అవినీతిని బద్దలు కొడతాం. బూతులు మాట్లాడేవారికి ఘోరీ కడతాం.


ముఖ్యమంత్రిగా నువ్వెంత, ఎమ్మెల్యేగా వాళ్లెంత, వాళ్ల బతుకులెంత.. రానున్న ఎన్నికల్లో యువత కన్నెర్ర చేస్తే జగన్‌ తన స్థానం ఎక్కడో ఆలోచించుకోవాలి.

బీమ్లానాయక్‌, వకీల్‌సాబ్‌వంటి సినిమాలను ఆపుకొంటే ఆపుకో. సినిమాలు, డబ్బులు వస్తుంటాయి పోతుంటాయి. ప్రతిదానికీ భయపడుతూ బతికే బతుకు కూడా వేస్ట్‌.

- పవన్‌ కల్యాణ్‌

Updated Date - May 05 , 2024 | 04:26 AM