Share News

చించి చెత్తబుట్టలో వేయండి

ABN , Publish Date - May 05 , 2024 | 04:29 AM

ఇది ఏపీ ప్రభుత్వ లాండ్‌ టైటిలింగ్‌ యాక్టు కాదు.. జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్టు.. ఈ నల్ల చట్టాన్ని చించి చిత్తుకాగితం చేసి చెత్తబుట్టలో వేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపిచ్చారు.

చించి చెత్తబుట్టలో వేయండి

చీకటి చట్టంతో బానిసలమవుతాం: చంద్రబాబు

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు కాదు..

అది జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్టు

క్రిటికల్‌ కంపెనీ ఆయన బినామీ సంస్థే

పేదలను చంపి రాజకీయ లబ్ధి పొందే కుట్ర

క్లాస్‌వార్‌ అబద్ధం.. క్యాష్‌ కోసం వార్‌

ఫ్యాన్‌ రెక్కలు విరవండి.. సైకిల్‌కే పట్టం కట్టండి

ఓటమి భయంతో జగన్‌ గజగజ

ప్రజాగళంలో టీడీపీ అధినేత విసుర్లు

ఒంగోలు/ఏలూరు/నూజివీడు/కాకినాడ, మే 4 (ఆంధ్రజ్యోతి): ఇది ఏపీ ప్రభుత్వ లాండ్‌ టైటిలింగ్‌ యాక్టు కాదు.. జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్టు.. ఈ నల్ల చట్టాన్ని చించి చిత్తుకాగితం చేసి చెత్తబుట్టలో వేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపిచ్చారు. ‘భూమంతా జగన్‌దా? ఈ భూమి మీది కాదా? పట్టాదార్‌ పాస్‌పుస్తకం మీది కాదా? దీనిపై జగన్‌ ఫొటో ఎందుకు? ఆయన తాత ఇచ్చాడా?తండ్రి ఇచ్చాడా? మీకు కోపం రావడం లేదా? ఆ చట్టాన్ని చించి డస్ట్‌బిన్‌లో పడేయండి’ అంటూ తన చేతిలో ఉన్న చట్టం ప్రతిని చించి ముక్కలు వేశారు. ప్రజాగళంలో భాగంగా శనివారం ఆయన ప్రకాశం జిల్లా దర్శి, ఏలూరు జిల్లా నూజివీడుల్లో, కాకినాడ నగరంలో జరిగిన భారీ బహిరంగ సభల్లో మాట్లాడారు. కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని కరప మండలం నడకుదురు నుంచి కాకినాడ సిటీలోని జగన్నాథపురం వంతెన మీదుగా సంతచెరువు సెంటర్‌ వరకు ఆరు కిలోమీటర్ల మేర భారీ రోడ్‌ షో నిర్వహించారు. ఆయా సందర్భాల్లో జగన్‌ పాలనపై నిప్పులు చెరిగారు. ఐదేళ్లుగా సంక్షేమం పేరుతో రూ.10 ప్రజలకు ఇచ్చి రూ.100 వారి నుంచి లాగేసుకున్నాడని, అలాగే రూ.వెయ్యి అవినీతి చేశారని ధ్వజమెత్తారు. టీడీపీ మళ్లీ వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవానికి జగన్‌ ప్రభుత్వం బడ్జెట్‌లో సంక్షేమానికి 15.80 శాతం మాత్రమే కేటాయిస్తే, గత టీడీపీ ప్రభుత్వం 19.50 శాతం ఖర్చుచేసిందన్నారు. సంక్షేమం అంటేనే టీడీపీ అని.. జగన్‌ వచ్చాక అనేక సంక్షేమ పథకాలను రద్దుచేశారని తెలిపారు. ‘పెన్షన్లు రూ.200 నుంచి 2 వేలకు మేం పెంచి ఇస్తే.. అసలు పింఛన్లు ఇస్తున్నది తన ప్రభుత్వమే అన్నట్లుగా జగన్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. ఇంకా ఏమన్నారంటే..


జగన్‌దే భూములపై పెత్తనం..

ఈ సీఎం మన భూమి మీద కన్నేశారు. మనల్ని బానిసలను చేద్దామనుకుంటున్నారు. ఈయనో దొంగోడు.. బూచోడు. అడంగల్‌ దగ్గర నుంచి పట్టాదార్‌ పాస్‌పుస్తకం దాకా లేకుండా చేద్దామనుకుంటున్నాడు. వీటికి బదులుగా జిరాక్స్‌ ఇస్తాడంటా. ఆయన తెచ్చిన ఏపీ లాండ్‌ టైటిలింగ్‌ యాక్టు-2023 ఒక నల్ల చట్టం. దీని ద్వారా ప్రజల భూములపై జగన్‌, ఆయన ప్రైవేటు సైన్యం పెత్తనం చేస్తాయి. మేం అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దుచేస్తాం. అధికారం కోసం శవ రాజకీయాలు చేసే నాటకాలరాయుడు జగన్‌.. పేదలను చంపి వారి ద్వారా ఓట్ల లబ్ధిపొందే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే పింఛన్లను సచివాలయ సిబ్బందితో ఇంటి వద్దే ఇచ్చే అవకాశం ఉన్నా అలా చేయకుండా గత నెలలో సచివాలయాల చుట్టూ.. ఈ నెలలో బ్యాంకుల చుట్టూ వృద్ధులను తిప్పుతున్నారు. ఫలితంగా గత నెలలో 33 మంది, ఈ నెలలో ఏడుగురు చనిపోయారు. అందుకు జగనే బాధ్యత వహించాలి. జగన్‌ తన పాలనలో చెప్పిన నవరత్నాలు అడ్రస్‌ లేకపోగా నవ అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు సాగాయి. అందరినీ బానిసలను చేసి జగన్‌ ఒక్కడే నియంతగా రాజ్యమేలాలనుకుంటున్నారు. డబ్బంతా ఆయన దగ్గరే.. ఎంగిలి మెతుకులు మాత్రం మనకా? ఈ పరిస్థితి పోయేందుకు మే 13న ఫ్యాన్‌ రెక్కలు విరగొట్టి డస్ట్‌బిన్‌లో వేయాలి. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఇంటింటికీ గొడ్డలి వస్తుంది. అందుకే ఓటుతో జగన్‌ను ఫ్యాన్‌కు ఉరేయాలి. ఆయన పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. పోలింగ్‌ రోజు ప్రతి ఒక్కరూ వచ్చి ఓటువేయాలి. ఆ రోజు ఎండ అనే కారణంతో ఓటువేయకుండా ఉండొద్దు.

సంపద సృష్టిస్తా.. పేదలకు అందిస్తా..

జగనేమో పేదల పక్షమంట.. మాదేమో క్లాస్‌వారంట! మేం చేసేది క్లాస్‌వార్‌ కాదు, మాది క్యాష్‌వార్‌. సంపద సృష్టిస్తా, పేదలకు అందిస్తా. ఆయనేమో ప్యాలె్‌సలో ఉంటాడంటా.. మీకేమో అగ్గిపెట్టెలాంటి ఇల్లు ఇస్తారంటా.. ప్యాలె్‌సలో 100 బెడ్‌రూమ్‌లు.. ఇదేమైనా మీ తాత జాగీరా? వేలకోట్లు స్వాహా చేయడమే కాకుండా పేదోడి పక్షాన ఉన్నాననడానికి సిగ్గులేదా? రాష్ట్రంలో ట్రాక్టర్‌ ఇసుక రూ.5 వేలయింది. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. తెలుగుదేశం హయాంలో క్వార్టర్‌ మద్యం ధర రూ.60 ఉండేది. ఇప్పుడది రూ.200కి పెంచారు. పెరిగిన రూ.140 జలగకు వెళ్తోంది. భూగర్భ సంపదంతా దోచేయలేదా? పేదల కడుపు కొట్టేలా వ్యవహరించలేదా? సరైన నిర్ణయం తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది. మీరంతా అధికారమిస్తే నా తొలి సంతకం మెగా డీఎస్సీపైనే. రెండో సంతకం చీకటి చట్టం రద్దు కోసమే. జగన్‌ ఇచ్చినదాని కంటే పేదలకు 15-20 శాతం అధికంగా ఇస్తా. వారి సంక్షేమమే నా ధ్యేయం. జగన్‌ ఇప్పటివరకు ఎంత నొక్కేశాడో.. అదంతా కక్కిస్తా.


1నే జీతాలు, పెన్షన్లు..

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. ఉద్యోగులకు ఐఆర్‌, పీఆర్సీ అమలు చేస్తాం. ఒకటో తేదీన జీతాలు ఇస్తాం. రిటైరైనవారికీ 1నే పెన్షన్లు చెల్లిస్తాం. ప్రజలకు ఉచితంగా ఇసుక అందజేస్తాం. మద్యం జే బ్రాండ్లు రద్దుచేస్తాం. మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలన్నీ అమలు చేసి తీరతాం. మూడు పార్టీలు ఏకమై పోటీచేస్తున్న తర్వాత రాష్ట్రంలో మరొకరికి స్థానం లేదు. నరకాసుర వధ తరహాలో జగనాసుర వధ చేసి జూన్‌ 4న దీపావళి మాదిరిగా పెద్దఎత్తున రాష్ట్ర ప్రజలు పండుగ చేసుకోవాలి.

రాష్ట్రంలో కూటమి, కేంద్రంలో ఎన్డీయే మేనిఫెస్టోలు ప్రజల ఆకాంక్షలను ప్రతి బింబిస్తూ కళకళలాడుతుంటే.. వైసీపీ మేనిఫెస్టో వెలవెలబోతోంది. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌లతో రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరతాయి.

వేల కోట్ల అవినీతి చేసిన జగన్‌ క్లాస్‌వార్‌ అంటున్నారు. అందిన కాడికి దోచుకుని.. అధికారం పోతే క్యాష్‌ పోతుందని పైకి క్లాస్‌వార్‌ అంటూ పేదలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి జగన్‌ది క్లాస్‌వార్‌ కాదు.. క్యాష్‌ కోసం వార్‌.

పెన్షన్‌ రూ.200 నుంచి రూ.2వేలు చేసింది నేను కాదా? నేను వచ్చిన తర్వాత రూ.3 వేలు కాదు.. 4 వేల పింఛన్‌ ఏప్రిల్‌ నుంచే ఇంటికి పంపుతా, దివ్యాంగుల పింఛన్‌ 4 వేల నుంచి 6వేలు పెంచుతా.

- చంద్రబాబు

Updated Date - May 05 , 2024 | 04:29 AM