Share News

TS : బల్ల గుద్ది చెబుతున్నా.. బీజేపీకి వేసే ప్రతి ఓటూ రిజర్వేషన్ల రద్దుకే

ABN , Publish Date - May 02 , 2024 | 04:59 AM

‘ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో సంక్షేమం, అభివృద్ధి అంశాలు సందర్భోచితం కాదు. రాజ్యాంగాన్ని మార్చాలా? మార్చకూడదా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం.

TS : బల్ల గుద్ది చెబుతున్నా.. బీజేపీకి వేసే ప్రతి ఓటూ  రిజర్వేషన్ల రద్దుకే

  • రాజ్యాంగం మార్చాలా? వద్దా? అన్నదే ఇప్పుడు చర్చ

  • మార్చాలంటే ఎన్డీయే.. వద్దనుకుంటే ‘ఇండియా’..

  • ఎటువైపుంటారో ఎస్సీ, ఎస్టీ, బీసీలే తేల్చుకోవాలి

  • ఆర్‌ఎస్‌ఎస్‌ మూల సిద్ధాంతమే.. రిజర్వేషన్ల రద్దు

  • దాన్ని అమలు చేసే రాజకీయ కార్యాచరణ పేరే బీజేపీ

  • నన్ను బెదిరించడం మోదీ, అమిత్‌ షా వల్ల కాదు

  • నాపై దాడి అంటే.. తెలంగాణపై చేసినట్టే: రేవంత్‌

హైదరాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో సంక్షేమం, అభివృద్ధి అంశాలు సందర్భోచితం కాదు. రాజ్యాంగాన్ని మార్చాలా? మార్చకూడదా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం. రాజ్యాంగాన్ని మార్చొద్దంటే ఇండియా కూటమి.. మార్చాలంటే ఎన్డీయే కూటమి... ఎటువైపు ఉండాలో దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలే నిర్ణయించుకోవాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తాను బల్ల గుద్ది చెబుతున్నానని, బీజేపీకి వేసే ప్రతి ఓటూ దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేసేందుకే ఉపయోగపడుతుందని అన్నారు. తనను పోలీసులతో బెదిరించడం సాధ్యం కాదన్న విషయాన్ని మోదీ, అమిత్‌షా గుర్తుంచుకోవాలని సూచించారు. తనపై దాడి చేయడమంటే.. తెలంగాణపైన, తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీలపైన దాడి చేయడమేనని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా, ఒక రాష్ట్రానికి సీఎంగా ఆర్‌ఎ్‌సఎస్‌ మూల సిద్ధాంతం, రాజకీయ విధానంపైన తాను స్పష్టంగా మాట్లాడితే తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తోందని విమర్శించారు.

ఆర్‌ఎ్‌సఎస్‌ మూల సిద్ధాంతం రిజర్వేషన్లను రద్దు చేయడమేనని, దాన్ని అమలు చేయడానికి ఎన్నుకున్న రాజకీయ కార్యాచరణ పేరే బీజేపీ అని చెప్పారు. అవకాశం వస్తే రాజ్యాంగాన్ని మార్చి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ఎత్తేయాలన్నదే బీజేపీ అజెండా అని, ఆ విషయాన్ని తాను ప్రెస్‌ మీట్లు, బహిరంగ సభల్లోనూ మాట్లాడానని చెప్పుకొచ్చారు. ఇది దేశ వ్యాప్తంగా చర్చకు రావడంతో బీజేపీ తనను టార్గెట్‌ చేసిందని దుయ్యబట్టారు. అందులో భాగంగానే తనపైన కేంద్ర హోంశాఖ స్వయంగా ఢిల్లీలో అక్రమ కేసు పెట్టిందన్నారు. తనతోపాటు కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియాలో పని చేసేవారికి నోటీసులు ఇచ్చి బుధవారం ఢిల్లీకి వచ్చి హాజరు కావాలని హుకుం జారీ చేసిందన్నారు.


వాజ్‌పేయి హయాంలోనే ప్రయత్నం

రాజ్యాంగం మార్చేందుకు వాజ్‌పేయి హయాంలోనే ప్రయత్నం జరిగిందని రేవంత్‌ ఆరోపించారు. స్వాతంత్రం వచ్చి 50 ఏళ్ల అయిన సందర్భంగా రాజ్యాంగాన్ని సమీక్షించే పేరిట పది మంది సభ్యులతో జస్టిస్‌ వెంకటాచలయ్య కమిషన్‌ను నియమిస్తూ 2000 ఫిబ్రవరి 22న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని మార్చడమే బీజేపీ అజెండా అనడానికి ఈ గెజిట్‌ నోటిఫికేషనే ఆధారమని పేర్కొన్నారు. ఆ కమిషన్‌ 2002లో నివేదిక ఇచ్చిందని తెలిపారు.

కానీ, 2004లో ప్రజలు ఎన్డీయేను తిరస్కరించి సోనియా నేతృత్వంలోని యూపీఏను అధికారంలోకి తీసుకురావడంతో రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం తప్పిందన్నారు. ఆర్‌ఎ్‌సఎస్‌ రెండో సత్సంగ్‌ చాలక్‌ మాదవ్‌ సదాశివరావ్‌ గోల్వాల్కర్‌ 1960లో రచించిన రెండు పుస్తకాల్లో దురదృష్టవశాత్తూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించారని రాశారన్నారు. ఆర్‌ఎ్‌సఎస్‌ సిద్ధాంత కర్త ఎన్జీ వైద్య.. 2015లో ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ దేశంలో ఏ కులమూ వెనుకబడి లేదని, కుల ఆధారిత రిజర్వేషన్‌ అవసరం లేదని, ఎస్సీ, ఎస్టీలకు ఇంకో పదేళ్లు రిజర్వేషన్‌ ఉంచి రద్దు చేయాలని స్పష్టం చేశారన్నారు.


ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలన్న మండల్‌ కమిషన్‌ సిఫారసును నాటి వీపీ సింగ్‌ ప్రభుత్వం అమలు చేసినప్పుడు.. దానికి వ్యతిరేకంగా బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ శ్రేణులు ఉద్యమం చేశాయని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని మార్చేందుకే తాము వచ్చామంటూ 2017లో కేంద్ర మంత్రి అనంతకుమార్‌ హెగ్డే వ్యాఖ్యానించారని, రిజర్వేషన్లు అభివృద్దిని తెస్తాయా? అంటూ లోక్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కూడా మాట్లాడారని వెల్లడించారు. వీళ్లంతా బీజేపీ, ఆర్‌ఎ్‌సఎ్‌సకు సంబంధించిన ముఖ్య నేతలేనని చెప్పారు. రిజర్వేషన్లు వద్దన్న సదరు నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రధాని మోదీ, ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ను ప్రశ్నించారు.

కేంద్రంలో అధికారంలోకి వచ్చాక జనగణన చేపట్టి దామాషా పద్ధతిలో రిజర్వేషన్‌ అమలు చేయాలన్న విధానాన్ని కాంగ్రెస్‌ తీసుకుందని తెలిపారు. దీంతో అప్రమత్తమైన బీజేపీ.. ఈ ఎన్నికల్లో 400 సీట్ల లక్ష్యం నినాదాన్ని ఎత్తుకుందన్నారు. రాజ్యాంగంలోని మూల సూత్రాలను తొలగించాలంటే లోక్‌సభలో మూడొంతుల మెజారిటీతోపాటు సగం రాష్ట్రాల శాసనసభల ఆమోదమూ అవసరమన్నారు. అందులోభాగంగానే ఇప్పటికే 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి సొంత ప్రభుత్వాలను బీజేపీ ఏర్పాటు చేసుకుందన్నారు.


ఆ అంశాలు లేవనెత్తాననే నాపై కేసు!

రిజర్వేషన్ల రద్దుకు సంబంధించిన అంశాలను ప్రస్తావించినందుకే కేంద్రంలోని బీజేపీ తనపై కేసు పెట్టించిందని రేవంత్‌ ఆరోపించారు. ‘‘సీఎంలు ఎవరైనా ఫేక్‌ వీడియోలు తయారు చేస్తారా? బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ పత్రికా సమావేశాలతోపాటు బహిరంగంగానే చెప్పిన. ఇంకా ఫేక్‌ వీడియోలు ఎందుకు?’’ అని ప్రశ్నించారు. మోదీ, షా ముందు చిన్నవాడినే అయ్యుండవచ్చని, అయితే వారు తనను పోలీసులతో బెదిరించాలనుకుంటే సాధ్యం కాదని అన్నారు. భయపెట్టి రాజకీయం చేయాలనుకుంటే తెలంగాణలో పరిణామాలు ఎలా ఉంటాయో?.. మీతో చీకట్లో మాట్లాడే వ్యక్తిని(కేసీఆర్‌ను) అడిగి తెలుసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో మతపరమైన రిజర్వేషన్‌ లేదని, బీసీ-ఈ కింద ఇచ్చింది కూడా ముస్లింల్లోని వెనుకబడిన వర్గాలకేనని గుర్తు చేశారు. ‘బీసీ-ఈ’ని ప్రవేశపెట్టక ముందు నుంచీ వారు రిజర్వేషన్లు పొందుతున్నారన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించి ఎమోషన్లతో ఆడుకోవాలని మోదీ, అమిత్‌షా చూస్తున్నారని దుయ్యబట్టారు.


పదేళ్లలో ఇచ్చింది గాడిదగుడ్డు

పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది పెద్ద గాడిద గుడ్డు అని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా, కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ, కృష్ణా, గోదావరి జలాల్లో వాటాల పంపకం, మేడారం జాతరకు జాతీయ హోదాను తెలంగాణ అడిగితే.. మోదీ గాడిద గుడ్డు ఇచ్చారని వ్యాఖ్యానించారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీనే అడ్డని, పదేళ్ల పాలనలో తెలంగాణకు ఇచ్చింది పెద్ద గాడిద గుడ్డని ‘ఎక్స్‌’లో ఆయన పోస్ట్‌ చేశారు.

మోదీ.. కన్వర్టెడ్‌ బీసీ

ప్రధాని మోదీ కన్వర్టెడ్‌ బీసీ అని రేవంత్‌ ఆరోపించారు. గుజరాత్‌కు మోదీ సీఎం కాకముందు ఆయన సామాజిక వర్గం ఫార్వర్డ్‌ క్యాస్టేనని తెలిపారు. మోదీ సీఎం అయ్యాకే ఆయన సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలో కలిపారని వెల్లడించారు. మోదీకి బీసీల పట్ల ప్రేమ లేదని, అవసరమైనప్పుడే బీసీ కార్డును ప్రయోగిస్తారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో దాదాపు 30లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేసి ఉంటే దేశంలోని 15 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగాలు వచ్చి ఉండేవన్నారు.

Updated Date - May 02 , 2024 | 05:45 AM