Share News

ఏం మొహం పెట్టుకుని సిద్దిపేటకు వస్తావు?

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:34 PM

ఓట్లు అడిగే నైతికత రేవంత్‌రెడ్డికి లేదు సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకున్న రఘునందన్‌రావు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు

ఏం మొహం పెట్టుకుని సిద్దిపేటకు వస్తావు?
సిద్దిపేటలో నిర్వహించిన ఆటో యూనియన్‌ కార్మికుల సమావేశంలో మాట్లాడుతున్న హరీశ్‌రావు

సిద్దిపేట టౌన్‌, ఏప్రిల్‌ 30: సిద్దిపేట వెటర్నరీ కళాశాలను కొడంగల్‌కు తీసుకుపోయి, నోటికాడి బుక్క లాక్కున్న సీఎం రేవంత్‌రెడ్డి ఏం మొహం పెట్టుకుని సిద్దిపేటకు వచ్చి ఓట్లు అడుగుతారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలో మెదక్‌ పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకట్రామారెడ్డికి మద్దతుగా ఆటో క్రెడిట్‌ యూనియన్‌ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, బీజేపీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆటో కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కార్మికుల హక్కులు హరించివేశారని, అదాని, అంబానీలకు దోచి పెట్టి, దేశంలో ఏ వర్గానికి కూడా న్యాయం చేయని కార్మికుల వ్యతిరేక పార్టీగా బీజేపీపై ముద్ర పడిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వందరోజుల్లో అమలు చేయలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రామిసరీ నోట్‌లు, పార్లమెంట్‌ ఎన్నికల్లో గాడ్‌ ప్రామీ్‌సలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రె్‌సకు మళ్లీ ఓటేస్తే వారి హామీలను ప్రజలు ఆమోదించనట్లు అవుతుందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ మెదక్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రామారెడ్డిని గెలిపిస్తే కాంగ్రెస్‌ మెడలు వంచి ఆరు గ్యారంటీలతో పాటు ఇచ్చిన హామీలు అమలు చేయిస్తామన్నారు. రాష్ట్రంలో ఆటో కార్మికుల జీవితాలు కాంగ్రెస్‌ పాలనలో రోడ్డున పడ్డాయన్నారు. ఆటో కార్మికులు చనిపోతే రేవంత్‌రెడ్డికి చీమ కుట్టినట్లు కూడా లేదని, కనీసం వారి కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అసమర్థతతో విద్యుత్‌ సరఫరా చేయలేక ఉద్యోగస్తులను బాధ్యులను చేస్తూ వారికి షోకాజ్‌ నోటీసులు, బదీలీలు, సస్పెండ్‌ చేస్తూ వేధిస్తున్నారని ఆరోపించారు. సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకున్న రఘునందన్‌రావు ఈ ప్రాంత ఓట్లు ఎలా అడుగుతావని ప్రశ్నించారు. సిద్దిపేట అంటేనే బీఆర్‌ఎస్‌ గడ్డని హరీశ్‌రావు చెప్పారు. ఈ సమావేశంలో నాయకులు పాల సాయిరాం, శ్రీనివాస్‌ తిరుపతి, లక్ష్మారెడ్డి, ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 11:34 PM