Share News

పది ఫలితాల్లో అదే జోరు

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:43 PM

పదోతరగతి ఫలితాల్లో ఈసారి కూడా సిద్దిపేట జిల్లా విద్యార్థుల జోరు కొనసాగింది. మంగళవారం విడుదలైన ఫలితాల్లో విద్యార్థులు సత్తాచాటారు. జిల్లావ్యాప్తంగా 98.65 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా రెండోస్థానంలో నిలిచింది.

పది ఫలితాల్లో అదే జోరు
విజయసంకేతనం చూపిస్తున్న ఇందిరానగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు

98.65 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా రెండోస్థానం

ఈసారి కూడా బాలికలదే పైచేయి

100 శాతం ఉత్తీర్ణతతో సత్తాచాటిన ప్రభుత్వ పాఠశాలలు

సిద్దిపేట క్రైం, ఏప్రిల్‌ 30 : పదోతరగతి ఫలితాల్లో ఈసారి కూడా సిద్దిపేట జిల్లా విద్యార్థుల జోరు కొనసాగింది. మంగళవారం విడుదలైన ఫలితాల్లో విద్యార్థులు సత్తాచాటారు. జిల్లావ్యాప్తంగా 98.65 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా రెండోస్థానంలో నిలిచింది. గతేడాది కూడా 98.65 ఫలితాలతో రెండోస్థానంలో నిలవడం గమనార్హం. ఈ సారి జిల్లావ్యాప్తంగా 13,976 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 13,788 విద్యార్థులు (98.65శాతం) ఉత్తీర్ణత సాధించారు.

మూడుసార్లు అగ్రస్థానంలో జిల్లా

2021-22లో పదోతరగతి ఫలితాల్లో 97.85శాతం ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్రంలో మొదటిస్థానం సాధించింది. 2022-23లో 98.65శాతం ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానం దక్కించుకుంది. 2021-22లో ఉత్తీర్ణత శాతం కన్నా 2022-23లో ఉత్తీర్ణత శాతం పెరిగినప్పటికీ రాష్ట్రంలో ఒక ర్యాంకు మాత్రం తగ్గింది.

బాలికలదే హవా

ఈసారి పదోతరగతి ఫలితాల్లో బాలురతో పోలిస్తే బాలికలే ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారు. 7,030 మంది బాలురులు పరీక్ష రాయగా 6,928 మంది (98.44శాతం) ఉత్తీర్ణత సాధించారు. 6,946 మంది బాలికలు పరీక్ష రాయగా 6,868 మంది (98.88శాతం) ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కూడా బాలికలే సత్తా చాటారు. గత సంవత్సర ఫలితాల్లో బాలురు 98.21శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 99.07శాతం ఉత్తీర్ణత సాధించారు.

ప్రత్యేకత నిలుపుకున్న ఇందిరానగర్‌ పాఠశాల

రాష్ట్రవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలుగాంచిన సిద్దిపేటలోని ఇందిరానగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈసారి కూడా పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. గత సంవత్సరం 253 మంది విద్యార్థులకు 250 మంది (99.01శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇక ఈ సారి 231 మంది విద్యార్థులకు 230 మంది (99.03 శాతం) ఉత్తీర్ణత సాధించారు. గత సంవత్సరం ముగ్గురు విద్యార్థులకు 10 జీపీఏ పాయింట్లు రాగా, ఈ సారి నలుగురు విద్యార్థులకు 10 జీపీఏ పాయింట్లు వచ్చాయి.

238 స్కూళ్లలో 100 శాతం

ఈ సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు ప్రభంజనం సృష్టించాయి. జిల్లాలో 227 జిల్లా పరిషత్‌ పాఠశాలలు, 14 ఆదర్శ పాఠశాలలు, 22 కస్తూర్బా పాఠశాలలు, 36 వివిధ యాజమాన్యాలకు సంబంధించిన గురుకులాలు ఉన్నాయి. వీటిలో 238 పాఠశాలలో వంద శాతం ఫలితాలు వచ్చాయి. గత సంవత్సరం 219 పాఠశాలలో వందశాతం ఫలితాలు వచ్చాయి . గత సంవత్సర ఫలితాల్లో జిల్లావ్యాప్తంగా 126 మందికి 10 జీపీఏ పాయింట్లు రాగా, ఈసారి 153 మంది విద్యార్థులకు 10 జీపీఏ పాయింట్లు వచ్చాయి.

జిల్లా గౌరవాన్ని నిలబెట్టారు

- హరీశ్‌రావు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే

మరోసారి సిద్దిపేట జిల్లా గౌరవాన్ని నిలబెట్టారని పదోతరగతి విద్యార్థులను హరీశ్‌రావు అభినందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కలెక్టర్‌, విద్యాశాఖకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులతో కాన్ఫరెన్స్‌లో హరీశ్‌రావు మాట్లాడారు. మీ బిడ్డను డాక్టర్‌ను చేస్తవా.. మీ కొడుకును ఇంజనీర్‌ను చేయ్‌ అంటూ ముచ్చటించారు. మరి దావత్‌ ఎప్పుడు ఇస్తరు.. మీ ఇంటికి ఎప్పుడు రావాలి అంటూ వారితో ఆత్మీయంగా మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Apr 30 , 2024 | 11:43 PM