Share News

మైక్రో అబ్జర్వర్లు పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:44 PM

మైక్రో అబ్జర్వర్లు పకడ్బందీగా ఎన్నికల విధులను నిర్వర్తించాలని మెదక్‌ లోక్‌సభ ఎన్నికల పరిశీలకుడు సమీర్‌ మాధవ్‌ కర్కోటి సూచించారు.

మైక్రో అబ్జర్వర్లు పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి

మెదక్‌ లోక్‌సభ ఎన్నికల పరిశీలకుడు సమీర్‌ మాధవ్‌ కర్కోటి

సిద్దిపేట అగ్రికల్చర్‌, ఏప్రిల్‌ 30: మైక్రో అబ్జర్వర్లు పకడ్బందీగా ఎన్నికల విధులను నిర్వర్తించాలని మెదక్‌ లోక్‌సభ ఎన్నికల పరిశీలకుడు సమీర్‌ మాధవ్‌ కర్కోటి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సమీర్‌ మాధవ్‌ కర్కోటి పర్యవేక్షణలో మైక్రో అబ్జర్వర్స్‌ 2వ ర్యాండమైజేషన్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.మనుచౌదరి నిర్వహించారు. సిద్దిపేట నియోజకవర్గానికి ఐదుగురు, దుబ్బాక నియోజకవర్గానికి 24 మంది, గజ్వేల్‌ నియోజకవర్గానికి 29 మంది, హుస్నాబాద్‌ నియోజకవర్గానికి 26 మంది మైక్రో అబ్జర్వర్లను అదనంగా కేటాయించి వారితో మాట్లాడారు. అలాగే జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌ నియోజకవర్గాల ఏఆర్వోలు, ఎన్నికల నిఘా విభాగాల నోడల్‌ అధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులందరూ కృషి చేయాలని ఎన్నికల పరిశీలకుడు సమీర్‌ మాధవ్‌ కర్కోటి సూచించారు. ఈ సందర్భంగా ఎన్నికల వేళ కోడ్‌ ఉల్లంఘన జరగకుండా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న విధులను ఆయా బృందాల నోడల్‌ అధికారులు వివరించారు. జిల్లాలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటును వేసే విధంగా ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం నిఘా బృందాలు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. పోలింగ్‌ విధుల్లో ఉన్న వారు ఓటింగ్‌కు ఒకరోజు ముందు సాయంత్రం 4గంటల లోపే చేరుకుని అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. పోలింగ్‌ కేంద్రాల్లో బూత్‌ఆఫీసర్లు, పోలింగ్‌ సిబ్బంది వచ్చేలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలన్నారు. అనంతరం మీడియా సెంటర్‌, ఎంసీఎంసీ, సీ-విజిల్‌, 1950 కాల్‌ సెంటర్‌, నేషనల్‌ గ్రీవెన్స్‌, రిడ్రెసల్‌ సెల్‌ ఇంటిగ్రేటెడ్‌ సెల్‌ను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా అదనపు కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌, మైక్రో అబ్జర్వర్స్‌ నోడల్‌ అధికారి ఎల్డీఎం సత్యజిత్‌, డీపీవో దేవకీదేవి, డీపీఆర్‌వో రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 11:44 PM